సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు కోటి మంది ప్రజలు వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. 1.48 లక్షల మందికి రూ.800 విలువ చేసే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (ఎల్‌పీటీ)తో పాటు థైరాయిడ్ పరీక్షలు ఉచితంగా చేసినట్లు చెప్పారు. బస్తీ దవాఖానాల్లో ప్రస్తుతం 57 రకాల పరీక్షలు చేస్తున్నామని, త్వరలో వాటిని 134కు పెంచుతామని వివరించారు.158 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఆదివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వివేకానంద, గణేష్ కోరుకంటి చందర్, జాఫర్ హుస్సేన్, అబ్రహం, భూపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
పెద్ద ఆస్పత్రులపై తగ్గిన ఒత్తిడి
బస్తీ దవాఖానాలు స్థానికంగా సేవలందిస్తుండడం వల్ల పెద్ద ఆస్పత్రుల్లో ఓపీ తగ్గినట్లు హరీశ్‌రావు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో 2019లో 12 లక్షల మంది ఓపీకి రాగా, 2022 నుంచి ఇప్పటివరకు 5 లక్షల మంది (60 శాతం తగ్గుదల) మాత్రమే వచ్చారన్నారు. గాం«దీలో 2019లో 6.5 లక్షల మంది ఓపీకి రాగా, 2022 నుంచి ఇప్పటివరకు 3.7 లక్షల మంది (56 శాతం తగ్గుదల) మాత్రమే వచ్చినట్లు తెలిపారు. నీలోఫర్‌లో 2019లో 8 లక్షల మంది ఓపీకి రాగా, 2022 నుంచి ఇప్పటివరకు 5.3 లక్షల మంది వచి్చనట్లు చెప్పారు. అలాగే ఫీవర్ ఆసుపత్రిలో 2019లో 4 లక్షల ఓపీ ఉంటే, 2022 నుంచి ఇప్పటివరకు 1.12 లక్షలు మాత్రమే ఉందని వివరించారు. అదే సమయంలో పెద్దాసుపత్రుల్లో శస్త్ర చికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి చెప్పారు.
కొత్తగా 496 బస్తీ దవాఖానాలు
బస్తీ దవాఖానాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభం అవుతుందని తెలిపారు. కొత్తగా 496 బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయని, వాటిలో కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. త్వరలో మేడ్చల్ హెచ్‌ఎంటీ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment