![reduction in contractors bills is not wrong - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/31/HIGH-COURT-2.jpg.webp?itok=eHBFz86h)
సాక్షి, అమరావతి : జిల్లా మినరల్ ఫౌండేషన్, రాష్ట్ర ఖనిజ వెలికితీత ట్రస్ట్‌ల నిమిత్తం కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రైల్వే శాఖ కొంత మొత్తాలను తగ్గించడాన్ని తప్పు పట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తగ్గింపు పూర్తిగా ‘సాయం’ కిందకు వస్తుందని చెప్పింది. ఈ ఫౌండేషన్ ట్రస్ట్ చార్జీలు సీనరేజీ చార్జీల ఆధారంగా ఉన్నప్పటికీ, దానిని అదనపు సీనరేజీ ఫీజుగా భావించడానికి వీల్లేదని తెలిపింది. ఈ చార్జీలు 2015 నుంచే అమల్లో ఉన్నాయని, కాంట్రాక్టర్లు పనులకు రేట్లను కోట్ చేసే ముందు ఈ చార్జీలను దృష్టిలో పెట్టుకుని ఉండాల్సిందని హైకోర్టు స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన కేవీఆర్‌ఈసీపీఎల్ ఇన్‌ఫ్రా టెక్ జాయింట్ వెంచర్ 2017లో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఇటీవల తీర్పునిచ్చారు.
విచారణ సందర్భంగా కంపెనీ తరఫు న్యాయవాది ఎన్.సుబ్బారావు వాదనలు వినిపిస్తూ, టెండర్ సమర్పించిన తరువాతే ఈ ఫీజుల వసూలు జీవో జారీ అయిందన్నారు. అందువల్ల ఆ ఫీజులను తమ బిల్లుల నుంచి వసూలు చేయడం సరికాదన్నారు. రైల్వే శాఖ తరఫు న్యాయవాది కె.అరుణ వాదనలు వినిపిస్తూ, టెండర్ నిబంధనల ప్రకారం అదనపు మొత్తాలన్నింటినీ కాంట్రాక్టరే భరించాలని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ ఫీజులు ఖనిజ తవ్వకాల వల్ల ప్రభావితం అవుతున్న ప్రాంతాల ప్రజల కోసం వినియోగిస్తారన్నారు. చట్ట ప్రకారమే వసూలు చేస్తున్నారని తెలిపారు. పిటిషనర్ టెండర్ దాఖలు చేయడానికి ముందు నుంచే వీటిని వసూలు చేస్తున్నారని, కొత్తవేమీ కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment