వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఆ రైలు అంటేనే వేగం అన్న మాటగా మారింది. గంటకు 160 కి.మీ.వేగంతో ఆ రైళ్లు సులువుగా పరుగు పెట్టగలవు.. ఆ మేరకు గంటకు 130 కి.మీ. వేగానికి తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యాన్ని రైల్వే పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆ సామర్థ్యానికి సరిపోని ట్రాక్‌పై గరిష్టంగా 110 కి.మీ. వేగానికి పరిమితమవుతూ ఆ రైళ్లు దూసుకెళ్తున్నాయి.
కానీ ఇప్పుడు ఆ రైళ్ల విషయంలో రైల్వే శాఖ తీరు మారినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ట్రాక్ సామర్థ్యం మెరుగుపడని ట్రాక్ మీదుగా కూడా వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. వీలైనంత వేగంగా ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్న రైల్వే శాఖ, ప్రస్తుతానికి వేగానికి సరిపడా ట్రాక్ సామర్ధ్యం పెరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేసింది. –సాక్షి, హైదరాబాద్
అదే కోవలో హైదరాబాద్–బెంగళూరు..
ఇటీవలే సికింద్రాబాద్– విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లను సమకూర్చుకున్న దక్షిణ మధ్య రైల్వేకు వచ్చే నెలలో ముచ్చటగా మూడో వందేభారత్ రైలు కూడా అందనుంది. హైదరాబాద్– బెంగుళూరు మధ్య కొత్త వందేభారత్ రైలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చే నెలల్లోనే ఇది పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు. విశాఖ వందేభారత్ రైలు ప్రారంభమైన కొద్ది రోజులకే మరో మూడు రైళ్లను కేటాయిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. అందులో తిరుపతి రైలు ఇప్పటికే మొదలు కాగా, తదుపరి బెంగళూరు రైలు, ఆ తర్వాత హైదరాబాద్–పుణే రైలు ప్రారంభం కానున్నాయి.
మహబూబ్‌నగర్ మీదుగానే ఆసక్తి..
నగరం నుంచి బెంగుళూరుకు ప్రధాన మార్గంగా ఉన్న మహబూబ్‌నగర్–కర్నూలు ట్రాక్ మీదుగానే కొత్త వందేభారత్‌ను నడిపేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. కాచిగూడ–మహబూబ్‌నగర్–కర్నూలు–డోన్– మీదు గా బెంగళూరు చేరుకుంటుంది. మరో మార్గం వాడి–రాయచూర్ మీదుగా ఉంది. నిజానికి, ఈ రెండో మార్గంలో ఎక్కువ నిడివి 130 కి.మీ. వేగానికి తగ్గట్టుగా మార్చారు.
ఇందులో ఎక్కువ దూరం డబుల్ లైన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో పోలిస్తే మహబూబ్‌నగర్ మార్గంలో ట్రాక్‌ను పటిష్ట పరచలేదు. మహబూబ్‌నగర్–డోన్ మధ్య ఇంకా సింగిల్ లైనే ఉంది. అయినా కూడా.. రాయచూర్ మార్గంతో పోలిస్తే బెంగళూరుకు 80 కి.మీ. దూరం తక్కువగా ఉండటం, మహబూబ్‌నగర్, కర్నూలు లాంటి డిమాండ్ ఉన్న ప్రాంతాలు ఉండటంతో పాలమూరు, కర్నూలు మార్గాన్నే ఎంపిక చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు.
రైల్వే బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే తప్ప ఇదే ఖరారు అయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఈ మార్గం ఖరారైతే... ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరుగుపెడుతున్న రెండు వందేభారత్ రైళ్ల కంటే ఈ వందేభారత్ రైలు తక్కువ వేగంతో నడవనుంది. దీని గరిష్ట వేగం సగటున 70 కి.మీ. కంటే తక్కువే ఉంటుందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment