భూమి చుట్టూ 310 రౌండ్లు | Vande Bharat trains are new records | Sakshi
Sakshi News home page

భూమి చుట్టూ 310 రౌండ్లు

Published Thu, Jun 6 2024 5:32 AM | Last Updated on Thu, Jun 6 2024 5:32 AM

Vande Bharat trains are new records

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే ఆధునికీకరణలో భాగంగా కొత్తగా ప్రారంభించిన వందేభారత్‌ రైళ్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లకు ఇప్పుడు ఉన్న డిమాండ్‌ అంతాఇంతా కాదు. 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైన వందేభారత్‌ రైళ్లు ఇప్పటి వరకు తిరిగిన నిడివిని పరిశీలిస్తే.. 310 పర్యాయాలు భూపరిభ్రమణం చేసిన దూరంతో సమానమట. ఇది సరికొత్త రికార్డు అంటూ రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. 

105.57% ఆక్యుపెన్సీ రేషియోతో 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్ల సగటు 105.57 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. వీటిలో కేరళలో తిరుగుతున్న వందేభారత్‌ రైలు సర్వీసు గరిష్టంగా 175.3 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది. వందేభారత్‌ రైళ్లలో తిరుగుతున్న ప్రయాణికుల్లో 26–45 ఏళ్ల మధ్య  ఉన్నవారు 45.9 శాతంగా నమోదవుతోంది. 

కేరళలో తిరుగుతున్న వందేభారత్‌ సర్వీసుల్లో అత్యధికంగా 15.7 శాతం వృద్ధులు ప్రయాణిస్తున్నట్టు తేలింది. గోవాలో తిరుగుతున్న వందేభారత్‌ రైళ్లలో అత్యధికంగా 42 శాతం మంది మహిళా ప్రయాణికులుంటున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని సర్వీసుల్లో గరిష్టంగా 67 శాతం మంది పురుషులు ఉంటున్నట్టు నమోదైంది. 

తెలంగాణలో నాలుగు రైళ్లు
ప్రస్తుతం తెలంగాణలో నాలుగు వందేభారత్‌ రైళ్లు తిరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య 16 కోచ్‌లతో కూడిన వందేభారత్‌ రైలు సేవలు గతేడాది సంక్రాంతికి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రైలులో 120 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియో ఉంటుండటంతో ఇటీవల ఇదే రూట్‌లో రెండో వందేభారత్‌ రైలు మొదలైన విషయం తెలిసిందే. 

రెండోది 8 కోచ్‌ల మినీఆరెంజ్‌ వందేభారత్‌. ఒకే రూట్‌లో రెండు వందేభారత్‌ రైళ్లు తిరగటం తొలుత కేరళలో మొదలైంది. రెండో ప్రయత్నంగా సికింద్రాబాద్‌– విశాఖ మార్గం ఎంచుకోవటం విశేషం. ఈమా ర్గం కాకుండా, సికింద్రాబాద్‌–తిరుపతి, కాచిగూడ–బెంగుళూరు మధ్య మరో రెండు సర్వీసులు తిరుగుతున్నాయి. 

దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్‌ రైళ్లు తిప్పాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమేరకు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఇక త్వరలో రాత్రి వేళ తిరిగే స్లీపర్‌ వందేభారత్‌ రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి.

సెమీ హైస్పీడ్‌ రైళ్లుగా...
రైళ్ల వేగాన్ని గరిష్టస్థాయికి తీసుకెళ్తూ సెమీ హైస్పీడ్‌ రైళ్లుగా వీటిని ప్రారంభించారు. గంటకు 160 కి.మీ. వేగ సామర్థ్యమున్న ఈ రైళ్లు సగటున 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 వరకు సర్వీసులు (స్పెషల్‌ రైళ్లు కలుపుకొని) సేవలు అందిస్తున్నాయి. తొలి రైలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. 

అన్ని వందేభారత్‌ రైళ్లు 18423 ట్రిప్పులు తిరిగాయి. వీటి మొత్తం నిడివి1,24,87,540 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది 310 పర్యాయాలు భూమి చుట్టూ పరిభ్రమించిన దూరంతో సమానమని రైల్వే శాఖ పేర్కొంది. గత ఏడాది కాలంలో 97,71,705 కి.మీ.లు తిరిగినట్టు      వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement