అదనంగా అందుబాటులోకి 312 సీట్లు
ఇప్పటివరకు 16, 8 కోచ్‌ల రైళ్లే పరుగులు
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పునకు కారణమైన వందేభారత్ రైళ్ల సిరీస్‌లో మరో నూతన అంకానికి కేంద్ర ప్రభుత్వం తెరదీస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ కేటగిరీ రైళ్లలో మొదలైన వందేభారత్ తదుపరి వర్షన్‌గా వందేభారత్ స్లీపర్ సరీ్వసులు ప్రారంభిస్తున్న రైల్వే, తాజాగా 20 కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 16 కోచ్‌ల వందేభారత్, 8 కోచ్‌ల మినీ వందేభారత్ రైళ్లే తిరుగుతున్నాయి. మొదటిసారి 20 కోచ్‌ల రేక్‌ను ప్రారంభిస్తున్నారు. ఒకేసారి అలాంటి నాలుగు రైళ్లను ప్రారంభిస్తుండగా, అందులో ఒకటి తెలంగాణ నుంచి నడవనుండటం విశేషం. ఈనెల 16న ప్రారంభం కానున్న సికింద్రాబాద్–నాగ్‌పూర్ ఆరెంజ్ వందేభారత్‌ను కూడా 20 కోచ్‌లతో ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రస్తుతానికి నాలుగు రైళ్లే..
మరింతమంది ప్రయాణికులను సర్దుబాటు చేసే క్రమంలో 20 కోచ్‌ల సెట్‌ను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ ఆలోచనకు రాగా, ప్రతినెలా అలాంటి ఒక సెట్‌ను తయారు చేయాలని చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యా క్టరీని ఆదేశించింది. దీంతో మే, జూన్, జూలై, ఆగస్టులకు సంబంధించి నాలుగు రేక్‌లు సిద్ధమయ్యాయి. వాటిల్లో రెండింటిని ఉత్తర రైల్వేకు, తూర్పు రైల్వేకు, సెంట్రల్ రైల్వే జోన్‌కు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు గతంలోనే మంజూరైంది.
రేక్ కొరత వల్ల దాని ప్రారంభం ఆలస్యమవుతూ వచి్చంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వేకు కేటాయించిన 20 కోచ్‌ల రైలును సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య తిప్పనున్నట్టు తెలిసింది. 20 కోచ్‌ల వందేభారత్‌లో 3 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లు, 16 ఎకానమీ (ఏసీ చైర్‌కార్) కోచ్‌లు ఉంటాయని సమాచారం. సాధారణ 16 కోచ్‌ల రేక్‌లో ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2, ఎకానమీ కోచ్‌లు 14 ఉంటున్నాయి.
యమ గిరాకీ
ఎనిమిది కోచ్‌ల వందేభారత్‌లో 530 సీట్లుంటున్నాయి. అదే 16 కోచ్‌ల వందేభారత్‌లో 1,128 సీట్లు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 20 కోచ్‌ల రేక్‌లో 312 సీట్లు పెంచుతూ వాటి సంఖ్యను 1,440కి విస్తరించారు. ఆ మేరకు ప్రయాణికులకు అదనంగా వెసులుబాటు కలుగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేషియో 110 శాతంగా ఉంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం వందేభారత్‌లో అది 130 శాతాన్ని మించింది.
దీంతో కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య మూడు డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లు తిరుగుతున్నాయి. హైదరాబాద్–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ మధ్య నడిచే దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు నాగ్‌పూర్ మీదుగా నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి ఓసారి నడిచే హైదరాబాద్–ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, వారానికి నాలుగు రోజులు తిరిగే బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు సహా మొత్తం 8 రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వందేభారత్ రైలు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment