secunderabad-nagpur train
-
సికింద్రాబాద్–నాగ్‌పూర్ వందేభారత్‌కు 20 కోచ్‌లు?
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పునకు కారణమైన వందేభారత్ రైళ్ల సిరీస్‌లో మరో నూతన అంకానికి కేంద్ర ప్రభుత్వం తెరదీస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ కేటగిరీ రైళ్లలో మొదలైన వందేభారత్ తదుపరి వర్షన్‌గా వందేభారత్ స్లీపర్ సరీ్వసులు ప్రారంభిస్తున్న రైల్వే, తాజాగా 20 కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 16 కోచ్‌ల వందేభారత్, 8 కోచ్‌ల మినీ వందేభారత్ రైళ్లే తిరుగుతున్నాయి. మొదటిసారి 20 కోచ్‌ల రేక్‌ను ప్రారంభిస్తున్నారు. ఒకేసారి అలాంటి నాలుగు రైళ్లను ప్రారంభిస్తుండగా, అందులో ఒకటి తెలంగాణ నుంచి నడవనుండటం విశేషం. ఈనెల 16న ప్రారంభం కానున్న సికింద్రాబాద్–నాగ్‌పూర్ ఆరెంజ్ వందేభారత్‌ను కూడా 20 కోచ్‌లతో ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లే..మరింతమంది ప్రయాణికులను సర్దుబాటు చేసే క్రమంలో 20 కోచ్‌ల సెట్‌ను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ ఆలోచనకు రాగా, ప్రతినెలా అలాంటి ఒక సెట్‌ను తయారు చేయాలని చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యా క్టరీని ఆదేశించింది. దీంతో మే, జూన్, జూలై, ఆగస్టులకు సంబంధించి నాలుగు రేక్‌లు సిద్ధమయ్యాయి. వాటిల్లో రెండింటిని ఉత్తర రైల్వేకు, తూర్పు రైల్వేకు, సెంట్రల్ రైల్వే జోన్‌కు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు గతంలోనే మంజూరైంది. రేక్ కొరత వల్ల దాని ప్రారంభం ఆలస్యమవుతూ వచి్చంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వేకు కేటాయించిన 20 కోచ్‌ల రైలును సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య తిప్పనున్నట్టు తెలిసింది. 20 కోచ్‌ల వందేభారత్‌లో 3 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లు, 16 ఎకానమీ (ఏసీ చైర్‌కార్) కోచ్‌లు ఉంటాయని సమాచారం. సాధారణ 16 కోచ్‌ల రేక్‌లో ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2, ఎకానమీ కోచ్‌లు 14 ఉంటున్నాయి.యమ గిరాకీఎనిమిది కోచ్‌ల వందేభారత్‌లో 530 సీట్లుంటున్నాయి. అదే 16 కోచ్‌ల వందేభారత్‌లో 1,128 సీట్లు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 20 కోచ్‌ల రేక్‌లో 312 సీట్లు పెంచుతూ వాటి సంఖ్యను 1,440కి విస్తరించారు. ఆ మేరకు ప్రయాణికులకు అదనంగా వెసులుబాటు కలుగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేషియో 110 శాతంగా ఉంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం వందేభారత్‌లో అది 130 శాతాన్ని మించింది. దీంతో కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య మూడు డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లు తిరుగుతున్నాయి. హైదరాబాద్–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ మధ్య నడిచే దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు నాగ్‌పూర్ మీదుగా నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి ఓసారి నడిచే హైదరాబాద్–ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, వారానికి నాలుగు రోజులు తిరిగే బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు సహా మొత్తం 8 రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వందేభారత్ రైలు రానుంది. -
రూట్లు రెడీ.. నాగ్‌పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైలు?
సాక్షి, కరీంనగర్: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్ రైలు’ను పూర్తిస్థాయిలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. జనవరి 15వ తేదీన సికింద్రాబాద్– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టాలపైనా వందేభారత్ పరుగులు తీస్తుందా? అన్న సామాన్యుల అనుమానాలకు దక్షిణ మధ్య రైల్వే తెరదించింది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో రైల్వే లైను ఉంది. సిరిసిల్లకు రూటు ప్రగతిలో ఉంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందేభారత్‌కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచారు. పెద్దపల్లి– కరీంనగర్, కరీంనగర్– జగిత్యాల, జగిత్యాల–నిజామాబాద్ రూట్లలో ఈ రైలును నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంది. ముఖ్యంగా సిరిసిల్ల, జగిత్యాలలోని నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. అన్ని డివిజన్లలో.. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, హైదరాబాద్ ఉన్నాయి. అన్ని రూట్లలోనూ గరిష్ట వేగంతో వెళ్లేలా ఇటీవలే రైల్వేలైన్లను ఆధునీకరించారు. విభజన అనంతరం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు తెలంగాణలో ఉన్నాయి. వందేభారత్ రైలు గరిష్ట వేగం 160 నుంచి 180 కి.మీలతో ప్రయాణించగలదు. అందుకు అనుగుణంగా రైలు పట్టాల సామర్థ్యం పెరగాలి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల చేపట్టిన అప్‌గ్రేడేషన్ పనులతో ఇక్కడ గరిష్ట వేగం 130 కి.మీలకు చేరుకుంది. తెలంగాణలోని మూడు డివిజన్లలో వందే భారత్ రైలును నడపాల్సి వస్తే.. చాలా సెక్షన్లలో 130 కి.మీ గరిష్ట వేగంతో నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గరిష్ట వేగం 130 కి.మీ.. కనిష్టవేగం 30.కి.మీ ఈ రైలును మూడు డివిజన్లలోని పలు సెక్షన్లను పరిశీలిస్తే.. సామర్థ్యాన్ని బట్టి వేగం మారుతోంది. ఖాజీపేట– బల్లార్షా సెక్షన్లో 130 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదని అధికారులు తెలిపారు. అదే సమయంలో అతి తక్కువగా మల్కాజిగిరి– మౌలాలి సెక్షన్లో కేవలం 30.కి.మీ స్పీడుకే పరిమితం కావడం గమనార్హం. అయితే, వేగంపై లైన్ అప్‌గ్రేడేషన్‌తోపాటు లెవెల్ క్రాసింగ్స్, రైల్ ట్రాఫిక్ కూడా ప్రభావం చూపుతుంది. అత్యాధునిక సౌకర్యాలు.. ఆటోమేటిక్ డోర్స్, స్మోక్ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్, సెన్సార్‌తో పనిచేసే నల్లాలు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నం. తొలి వందే భారత్ రైలు సర్వీసు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ– వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు సర్వీసులు నడుస్తుండగా.. సికింద్రాబాద్– విజయవాడ మధ్య సర్వీసు ప్రారంభమైతే ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 20కిపైగా ప్రాంతాల నడుమ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో హైదరాబాద్– తిరుపతి, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్ మార్గాలు ఉండటం విశేషం. రూటు స్పీడు ►సికింద్రాబాద్– బల్లార్షా 130 కి.మీ. ►ఖాజీపేట–కొండపల్లి 130 కి.మీ. ►సికింద్రాబాద్– ఖాజీపేట 130 కి.మీ. ►మానిక్‌నగర్– విరూర్ (3వలైన్) 110 కి.మీ. ►మందమర్రి– మంచిర్యాల కి.మీ(3వలైన్) 110 కి.మీ. ►మంచిర్యాల– పెద్దంపేట (3వలైన్) 100 కి.మీ. ►పెద్దంపేట– రాఘవపురం (3వ లైన్) 110 కి.మీ. ►రాఘవపురం– కొలనూరు–పొత్కపల్లి (3వలైన్) 90 కి.మీ. ►బిజిగిరి షరీఫ్– ఉప్పల్ (3వలైన్) 100 కి.మీ. ►పెద్దపల్లి– కరీంనగర్ 100 కి.మీ. ►కరీంనగర్– జగిత్యాల(లింగంపేట) 90 కి.మీ. ►జగిత్యాల(లింగంపేట)– నిజామాబాద్ 100 కి.మీ మేడ్చల్– మనోహరాబాద్ 110 కి.మీ మల్కాజిగిరి– మౌలాలి కార్డ్‌లైన్ సెక్షన్లలో 30 కి.మీ. ఈ ప్రాంతానికి ఎంతో మేలు ‘వందేభారత్’ రైలును బల్లార్షా– కాజీపేట మార్గంలో నడపాలి. నాగ్‌పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ రైలు ప్రస్తుతం ప్రతిపాదనలో ఉంది. ఈ మార్గంలో రైలు వస్తే.. రామగుండం లేదా మంచిర్యా లకు హాల్టింగ్ కల్పిస్తే.. కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. – కామని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త రవాణా సదుపాయాలకు పెద్దపీట కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రవాణా సదుపాయాలకు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుందనడానికి వందేభారత్ రైలే పెద్ద ఉదాహరణ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు దేశంలోనే అత్యధిక వేగంతో వెళ్లడం విశేషం. భవిష్యత్తులో దేశంలోని ముఖ్యప్రాంతాలకు దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు సైతం త్వరలో దీని సేవలు అందుతాయి. – బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ -
సికింద్రాబాద్ టు నాగ్‌పూర్... సెమీ హైస్పీడ్ కారిడార్‌కు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెమీ హైస్పీడ్ రైలు భాగ్యం హైదరాబాద్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. దాదాపు మూడేళ్ల క్రితం ఈ కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన రష్యా రైల్వే కంపెనీ తాజాగా ఈ కారిడార్‌లో 180 కి.మీ. వేగంతో రైళ్ల ప్రయాణం సాధ్యమేనని తేలుస్తూ త్వరలో నివేదిక సమర్పించనుంది. అలాగే ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమని రష్యన్ రైల్వే సమ్మతి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వచ్చినట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌లో సెమీ హైస్పీడ్ ప్రాజెక్టు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని స్వయంగా పుతిన్ ప్రస్తావించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సగానికి తగ్గనున్న సమయం... సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య దూరం 584 కి.మీ. ఇంత దూరం ప్రయాణానికి ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌లకు దాదాపు 9 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం పరుగుపెడుతున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల గరిష్ట వేగం గంటకు 120 కి.మీ., కానీ రైళ్ల ట్రాఫిక్, ట్రాక్‌ల పరిస్థితి, సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల అవి సగటున 75 కి.మీ. వేగాన్ని మించడంలేదు. దీంతో ప్రధాన కారిడార్లలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని దాదాపు నాలుగేళ్ల క్రితం రైల్వేశాఖ నిర్ణయించింది. బుల్లెట్ రైలు ఇప్పట్లో సాధ్యం కానందున గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించేలా సెమీ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలుత ఐదు కారిడార్లను ఎంపిక చేసింది. వాటిలో అంత వేగంగా రైళ్ల ప్రయాణం సాధ్యమా కాదా అని తేల్చేందుకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఇందులో భాగంగా ఢిల్లీ–చండీగఢ్ సెక్షన్‌ను ఫ్రెంచ్ కంపెనీకి, చెన్నై–కాజీపేట మార్గాన్ని జర్మన్ కంపెనీకి, చెన్నై–బెంగళూరు–మైసూరు మార్గాన్ని చైనా కంపెనీకి, ఢిల్లీ–జైపూర్ మార్గాన్ని ఇటలీ కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. 2016లో గోవాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సికింద్రాబాద్–నాగ్‌పూర్ మార్గాన్ని రష్యా రైల్వే కంపెనీకి అప్పగించాలని నిర్ణయించారు. ఆ మేరకు అదే సంవత్సరం రష్యన్ రైల్వేస్‌కు సంబంధించి భారత్‌లో ఉన్న విభాగం అధిపతి వ్లాదిమీర్ ఎ ఫినోవ్... భారత రైల్వే బోర్డు యంత్రాంగంతో చర్చలు జరిపారు. అందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా అలెగ్జాండర్ కులాగిన్ ఆధ్వర్యంలోని 12 మంది ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన రష్యన్ రైల్వేస్ ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చింది. స్థానిక రైల్వే అధికారులతో కలసి ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నాగ్‌పూర్ వరకు పరిశీలిస్తూ ప్రయాణించింది. గంటకు 200 కి.మీ. వేగంతో రైలు దూసుకెళ్లాలంటే ప్రస్తుత ట్రాక్‌లో చేయాల్సిన మార్పులను గుర్తించింది. ఆ తర్వాత మరో బృందం 2017 డిసెంబర్లో నాగ్‌పూర్‌కు వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణిస్తూ అధ్యయనం చేసింది. కానీ ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ కారిడార్ ప్రతిపాదన అటకెక్కినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తాజాగా ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో అది సాకారమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఇది సాకారమైతే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గిపోతుంది. దాదాపు నాలుగు గంటల్లోనే గమ్యం చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్–ఢిల్లీ ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ఆ మేరకు వీలుగా ట్రాక్‌ను పూర్తిస్థాయిలో పటిష్టం చేస్తారు. నివేదిక సమర్పించిన తర్వాత అంచనా వ్యయం విలువ తెలుస్తుంది. వేగంగా మూడో లైన్ పనులు.... కాజీపేట–బల్లార్షా మార్గం అత్యంత కీలకమైనది కావడంతో ఈ కారిడార్‌లో ప్రయాణించే రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రైళ్ల వేగం మందగించింది. ఈ మార్గం బొగ్గు వ్యాగన్లు ప్రయాణించేది కావడం, బొగ్గు సరఫరాకు ప్రాధాన్యం ఉండటంతో ఈ మార్గంలో వాటి కోసం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిలిపేస్తున్నారు. దీంతో ప్రయాణికుల రైళ్ల ప్రయాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కారిడార్‌లో మూడో మార్గం నిర్మించాలని రైల్వేశాఖ గతంలో నిర్ణయించి ప్రయారిటీ ప్రాజెక్టుగా గుర్తించింది. ఫలితంగా పనులు వేగంగా సాగుతున్నాయి. కాజీపేట నుంచి మంచిర్యాల మధ్య దాదాపు పని పూర్తయింది. మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, మందమర్రి సెక్షన్లో పనులు చివరి దశకు వచ్చాయి. సిర్పూర్ కాగజ్‌నగర్–మాకుడి మధ్య 29 కి.మీ. మార్గంలో ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పెండింగ్‌లో పడ్డాయి. రాఘవాపురం–పొత్కపల్లి మధ్య 31 కి.మీ. మార్గం, బిజ్గర్ షరీఫ్–ఉప్పల్ మధ్య 18 కి.మీ. మార్గంలో ఇటీవలి వరకు భూసేకరణ జరగక నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం బీరూరు–మాణిక్‌ఘర్ పనులు జరుగుతున్నాయి. హైస్పీడ్ కారిడార్ కావాలంటే ఆ మార్గంలో గూడ్సు రైళ్లు తిరగొద్దని రష్యన్ ఇంజనీర్లు గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు మూడో కారిడార్ అందుబాటులోకి వస్తే ఆ సమస్య కూడా దాదాపు పరిష్కారమవుతుంది. భవిష్యత్తులో నాలుగో లైన్ కూడా నిర్మించనున్నారు. రైల్–19 వస్తుందా...? వందే భారత్ ఎక్స్‌ప్రెస్... భారతీయ రైల్వేలో నవశకానికి నాంది పలికింది. ఇంజిన్ లేని ఈ రైలు అభివృద్ధి చెందిన దేశాల వేగవంతమైన రైళ్లను తలపిస్తోంది. గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకుపోతోంది. రైల్–18 పేరిట మొదలైన ఈ రైళ్ల తదుపరి వెర్షన్ రైల్–19 (2019)గా రాబోతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా సీటింగ్‌కే పరిమితం కాగా కొత్త వెర్షన్లో స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఈ సంవత్సరమే పట్టాలెక్కే ఈ రైళ్లు సెమీ హైస్పీడ్ రైళ్లుగా నిలుస్తున్నాయి. మరి సికింద్రాబాద్–నాగ్‌పూర్ సెమీ హైస్పీడ్ కారిడార్‌లో వీటినే ప్రవేశపెడతారా లేక అధునాతన కొత్త రైళ్లను ప్రారంభిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
సికింద్రాబాద్ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు ప్రారంభానికి వేదిక కానుందా?. తాజాగా పరిస్ధితులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. భారతీయ రైల్వేలు రష్యా రైల్వేతో సహకారంతో రైళ్లను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టించేందుకు సిద్ధమౌతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్‌ల మధ్య ఈ రైలును నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. కాగా, దేశంలోని రైళ్లలో గతిమాన్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే అత్యధికంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరుస్తోంది.