సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా వందేభారత్ రైళ్లను ఒకేసారి పెద్దసంఖ్యలో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు 30లోపు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సంఖ్యను వీలైనంత తొందరలో వందకు చేర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా వాటిని వాయిదా వేశారు. ఇందులో కాచిగూడ– యశ్వంత్‌పూర్(బెంగళూరు) రైలు కూడా ఉంది. వాస్తవానికి ఈ రైలు గత నెల 31నే చెన్నై నుంచి కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంది.
ఆ తర్వాత మహబూబ్‌నగర్ మీదుగా దీని ట్రయల్‌రన్ కూడా పూర్తి చేశారు. దీనిని ఈనెల ఆరో తేదీన ప్రారంభిస్తున్నట్టు గుంతకల్ స్టేషన్ అధికారులు అప్పట్లోనే ప్రకటించగా, దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు ఖండించారు.అది పంద్రాగస్టు రోజు ప్రారంభమయ్యే సూచనలున్నాయంటూ కొందరు అధికారులు అనధికారికంగా ప్రకటించారు. దానికి బలం చేకూరుస్తూ ఈలోపే ట్రయల్‌రన్ పూర్తి చేశారు. కానీ, రైల్వేబోర్డు మాత్రం అధికారికంగా ప్రారంభతేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు.
ఎన్నికల వేళ...
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, వందేభారత్ రైళ్లను కూడా ప్రధాన ఆకర్షణగా జనం ముందు నిలపాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో భారత్‌లో వంద వందేభారత్ రైళ్లను పట్టాలెక్కించాలని ముందుగా అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్యను వీలైనంత తొందరలోనే ప్రయాణికుల సేవలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొన్నింటిని ఆపి, మరికొన్నింటిని జతచేసి ఒకేసారి ప్రారంభించాలని భావి స్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పంద్రాగస్టు కానుకగా పట్టాలెక్కాల్సిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.
8 కోచ్‌ల రైళ్లే ఎక్కువ..
ప్రారంభంలో వందేభారత్ రైళ్లను 16 కోచ్‌లతో పట్టాలెక్కించారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో మాత్రమే వందేభారత్ రైళ్లు తయారవుతున్నాయి. త్వరలో మరో మూడు కోచ్‌ఫ్యాక్టరీల్లో వాటి ఉత్పాదన ప్రారంభిస్తారు. ఇప్పుడు ఒక్కో రైలు సిద్ధం కావటానికి చాలా సమయం పడుతోంది.
ప్రొడక్షన్ వేగం పుంజుకునే వరకు, ఒక రైలుకు వినియోగించే 16 కోచ్‌లను రెండు రైళ్లుగా మార్చి నడపాలని రైల్వేశాఖ భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లు ప్రారంభించే అవకాశం ఉంటుందనేది ఆలోచన. డిమాండ్ పెరిగే కొద్ది క్రమంగా కోచ్‌ల సంఖ్య పెంచాలని అనుకుంటున్నారు. దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన మొదటి వందేభారత్‌ను సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య 16 కోచ్‌లతో ప్రారంభించారు.
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రారంభమైన రెండో వందేభారత్‌ను మాత్రం 8 కోచ్‌లతో ప్రారంభించి, ఆ సంఖ్యను పెంచుతామని తర్వాత రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పుడు 8 కోచ్‌ల మినీ వందేభారత్ రైళ్లు ఎక్కువ సంఖ్యలో ప్రారంభించి, ఆ తర్వాత ఉత్పత్తి పెరిగే కొద్దీ వాటికి అదనపు కోచ్‌లను జతచేస్తూ పోవాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment