Fire Hazard Due to Short Circuit in Falaknuma Express - Sakshi
Sakshi News home page

ఎస్‌4 బోగీలో షార్ట్‌ సర్క్యూట్‌. .ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి అదే కారణమని అంచనా

Published Sun, Jul 9 2023 3:16 AM | Last Updated on Wed, Jul 12 2023 8:59 PM

Fire hazard due to short circuit in Falaknuma Express - Sakshi

సాక్షి,యాదాద్రి/బీబీనగర్‌: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎస్‌–4లో షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్‌ నిపుణులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమా­చారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మా­యపల్లి– పగిడిపల్లి మధ్యన శుక్రవారం ఫలక్‌ను­మా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జరిగిన అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు శనివారం ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు.

రైల్వే శాఖకు చెందిన ఎలక్ట్రానిక్‌ విభాగం సిబ్బంది బోగీలకు కింది భాగంలో గల బ్యాటరీలను క్షుణంగా పరిశీలించారు. బ్యాటరీల ద్వారా షార్ట్‌సర్క్యూట్‌ తలెత్తి­వుండవచ్చని అనుమానిస్తున్నారు. సిగరెట్‌ తాగి ప్రయాణికులు ఎవరైనా టాయిలెట్‌లలో పడివే­యడంతో అగ్గి రాజుకుందా అన్న కోణంలో విచారణ చేయగా అలాంటి ఆనవాళ్లు లేనట్లు అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేశారు.

32విభాగాల అధికారుల విచారణ
ఘటనపై 32 విభాగాలకు చెందిన రైల్వే, రాష్ట్ర పోలీస్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌లో ఉంచిన కాలిపోయిన బోగీలను శనివారం సుమారు 50 మంది అధికారులు పరిశీలించారు. ఎస్‌–4 బోగీతో పాటు కాలిపోయిన అన్ని బోగీల బ్యాటరీలను క్షుణ్ణంగా పరిశీలించారు.  

రిజర్వేçషన్‌ బోగీల్లో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ సాకెట్‌లలో ఏమైనా స్పార్క్‌ వచ్చిందా, లేక రైలు చక్రాల కింద నిప్పు రవ్వలు లేచి బోగీ అంటుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, కాలిపోయిన బోగీల్లో అధికారులకు బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. అవి కాలిపోయి నల్లగా మారాయి. అలాగే లాప్‌టాప్, సెల్‌ఫోన్‌లు, సెల్‌ఫోన్‌ చార్జర్‌లు కాలిపోయి కన్పించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement