మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో నిలిచిపోయిన పరిహారం చెల్లింపు
రూ.130 కోట్ల స్వల్ప మొత్తాన్ని పెండింగులో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
తంగళ్లపల్లి వరకు మాత్రమే భూమి స్వాధీనం అవటంతో అక్కడి వరకే టెండర్లు పిలిచిన రైల్వే
కీలక తరుణంలో పనుల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: కీలక రైల్వే ప్రాజెక్టు పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించలేకపోతోంది. తక్కువ మొత్తమే అవసరమున్నా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయే దుస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి గ్రీన్‌ఫీల్డ్ రైల్వే మార్గంగా పనులు ప్రారంభించుకున్న మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టు పనులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వేగం మందగించింది. రాజధాని నగరంతో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌లాంటి కీలక పట్టణాలను నేరుగా అనుసంధానించే కీలక ప్రాజెక్టు అయినప్పటికీ, భూసేకరణ నిధులు విడుదల చేయకపోవటంతో ఆ ప్రాజెక్టు పనులు పడకేస్తున్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు 2023లో రైలు సర్విసు ప్రారంభించారు. ప్రస్తుతం సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి సిరిసిల్ల వరకు రైలు సర్విసు ప్రారంభించేలా పనులు పూర్తి చేయాల్సి ఉంది. సిరిసిల్ల స్టేషన్‌కు చేరువలో ఉన్న మానేరు నదిని దాటి తదుపరి కరీంనగర్ వరకు పనులు చేపట్టాల్సి ఉంది. సిరిసిల్ల వరకు ట్రాక్ (రెయిల్స్ పరవటం) ఏర్పాటు పనులు జరుపుతూనే, కరీంనగర్ వరకు నేలను లెవల్ చేసే పనిని సమాంతరంగా నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడే చిక్కు వచ్చి పడింది.
సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనుల కోసం టెండర్లు పిలిచి పనులు నిర్వహిస్తున్న రైల్వే, ఆపై కరీంనగర్ వరకు కూడా తదుపరి టెండర్ పిలవాల్సి ఉంది. కానీ, సిరిసిల్ల జిల్లా పరిధిలోని తంగళ్లపల్లి వరకు భూసేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. దీంతో అక్కడి వరకు భూమి రైల్వేకు స్వా«దీనం కావటంతో.. తంగళ్లపల్లి వరకు పనుల కోసం టెండర్లు పిలిచింది. ఇప్పుడు ఆక్కడే పనులు జరుగుతున్నాయి. తంగళ్లపల్లి తర్వాత 15 హెక్టార్ల అటవీ భూములున్నాయి. దానికి సంబంధించి అనుమతి రావాల్సి ఉంది.
ఆ తర్వాత సిరిసిల్ల వరకు భూపరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేయలేదు. నిజానికి కొత్తపల్లి వరకు భూసేకరణ ప్రక్రియ అంతా పూర్తయింది. రైతులకు పరిహారాన్ని అందించటమే మిగిలిఉంది. పరిహారం అందిస్తేనే ఆ భూములు రైల్వేకు స్వా«దీనం చేసే పరిస్థితి ఉంటుంది. తన వంతు వాటాగా తాజా బడ్జెట్‌లో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుకు రూ.350 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. గతేడాది బడ్జెట్ నిధుల (రూ.185 కోట్లు) కంటే ఇది దాదాపు రెట్టింపు కావటం విశేషం.
రూ.130 కోట్లు మాత్రమే..
తంగళ్లపల్లి నుంచి సిరిసిల్ల మధ్యలో పరిహారం మొత్తం రూ.68 కోట్లుగా ఉంది. ఆ తర్వాత కొత్తపల్లి (చివరి స్టేషన్) వరకు మరో రూ.62 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి సాంకేతిక అంశాలన్నీ పూర్తయి కేవలం పరిహారం చెల్లింపు మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రాజెక్టులో భూసేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ ప్రక్రియనే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇతర అవసరాలకు నిధులు మళ్లించటంతో భూపరిహారానికి డబ్బులు కేటాయించలేకపోతోందంటూ కొందరు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే రైల్వే శాఖ పలుదఫాలుగా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ నిధులు మాత్రం విడుదల కావటం లేదు. భూ పరిహారం చెల్లింపు పూర్తయితే తప్ప ఆ పనులు చేపట్టే వీలు లేదు. రైల్వే శాఖ ఆయా పనులకు టెండర్లు పిలవాలంటే కనీసం 90 శాతం భూమి తన స్వాధీనం అయి ఉండాలి. పరిహారం డబ్బులు చెల్లించనందున స్వా«దీన ప్రక్రియకు వీలు లేదు. దీంతో కొత్తపల్లి వరకు రైలును నడిపేందుకు మరో మూడేళ్ల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment