ఉద్దంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి
ప్రపంచాన్ని అబ్బురపరిచిన భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యం..
సంక్లిష్ట హిమాలయాల గుండా అద్భుత నిర్మాణం
చెనాబ్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన..
ఆంజిఖడ్ వద్ద దేశంలోనే తొలి కేబుల్ వంతెన
38 సొరంగాలు, 931 వంతెనలతో నిర్మాణం..
రూ.41 వేల కోట్లతో చేపట్టిన రైల్వే శాఖ
2025 జనవరిలో జాతికి అంకితం చేయనున్న కేంద్ర ప్రభుత్వం
(జమ్మూ–కశ్మీర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : 77 ఏళ్ల స్వతంత్ర భారతం నిరీక్షణకు గ్రీన్ సిగ్నల్ లభించింది! 25 ఏళ్ల నాటి ప్రణాళిక పట్టాలెక్కుతోంది! రెండు దశాబ్దాల అకుంఠిత దీక్ష ఫలిస్తోంది!! కశ్మీర్‌ను మిగతా దేశంతో అనుసంధానిస్తూ మన రైల్వేల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావచ్చింది. హిమాలయాల మీదుగా భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైన 338 కి.మీ. ‘ఉద్దమ్‌పూర్– శ్రీనగర్–బారాముల్లా’ రైల్వే లైన్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది.
ఏకంగా 38 సొరంగాలు (టన్నెళ్లు), 931 చిన్నా, పెద్ద వంతెనలతో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చెనాబ్ వంతెన, దేశంలో మొదటి కేబుల్ రైల్వే వంతెనతోపాటు ఎన్నో ప్రత్యేకతలను ఈ విశిష్ట ప్రాజెక్టు సంతరించుకుంది. వ్యాపార, పర్యాటక, రవాణా రంగాల ప్రగతిని విప్లవాత్మక మలుపు తిప్పుతూ జమ్మూ–కశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదపడనుంది.
దేశ రక్షణ వ్యూహాత్మక అవసరాలను తీర్చడంలోనూ అత్యంత కీలకంగా మారనుంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో భద్రతాపరంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దీన్ని చేపట్టారు. మొత్తం రూ.41 వేల కోట్లతో చేపట్టి.. 2025 జనవరిలో ప్రారంభించనున్న ఈ రైల్వే ప్రాజెక్ట్ ప్రధాన అంశాలు ఇవీ..
27 సొరంగాలు.. 37 వంతెనలు
ఉద్దమ్‌పూర్– శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన 111 కి.మీ. కట్రా– బనిహల్ లైన్ నిర్మాణాన్ని రైల్వే శాఖ తాజాగా పూర్తి చేసింది.
అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు, లోతైన లోయలు, అతి వేగంగా ప్రవహించే నదులతో కూడుకున్న ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉండగా వాటిలో 27 ఈ లైన్‌లోనే ఉండటం గమనార్హం.
ఇక 37 వంతెనలు కూడా ఈ లైన్‌లోనే నిర్మించారు. వాటిలో అత్యంత ప్రధానమైన చెనాబ్ వంతెన, ఆంజిఖడ్ వంతెనలున్నాయి. హిమాలయ ప్రాంత వాసులకు రైలు రవాణాను అందుబాటులోకి తెస్తూ కొత్తగా రియాసీ, బక్కల్, దుగ్గా, సావల్‌కోట్, సంగల్‌దాన్, సుంబుర్, ఖరీ రైల్వే స్టేషన్లను నిర్మించారు. హిమాలయాలను తొలిచి ప్రత్యేకంగా నిరి్మంచిన ఎత్తైన ప్రదేశాలు, సొరంగాల వద్ద ఈ రైల్వే స్టేషన్లను నిర్మించడం విశేషం.
ఇక మిగిలింది 17 కి.మీ. లైనే
కట్రా–రియాసీ మధ్య మరో 17 కి.మీ. మేర రైల్వే లైన్‌ను ఇంకా నిరి్మంచాల్సి ఉంది. ఆ ప్రాంతంలో హిమాలయాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. ఆంజిఖడ్ కేబుల్ వంతెనకు ఆవల ఓ సొరంగాన్ని నిర్మించి ఈ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం ఆ పనులను కొన సాగిస్తూ పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
ఉగ్ర దాడులను తట్టుకునేలా..
చెనాబ్ వంతెన పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 45 కి.మీ. దూరంలోనే ఉండటంతో రక్షణశాఖ సమన్వయంతో రైల్వే శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. వంతెన సమీపానికి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 24/7 సీసీ కెమెరాల నిఘాతో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఒక్కొక్కటి రూ.500 ఖరీదు చేసే ఐదు లక్షల బోల్టులను నిర్మాణంలో వినియోగించారు.
ఒకసారి బిగించిన వాటిని ఇతరులు విప్పలేని రీతిలో తయారు చేసిన భారీ బోల్టులను వంతెన నిర్మాణంలో ప్రత్యేకంగా వాడారు. చెనాబ్ వంతెన సమీపంలో డ్రోన్లు ఎగుర వేయడాన్ని నిషేధించారు. సరిహద్దులకు అవతలి వైపు నుంచి 40 కేజీల గ్రెనేడ్లు విసిరినా వంతెన ధ్వంసం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వంతెనపై ఒక అడుగు ఎత్తులో ఇనుప జాలీలతో ఫ్లోర్ నిర్మించారు. గ్రెనేడ్లు విసిరినా అవి నేరుగా వంతెనను తాకకుండా ఈ ఇనుప జాలీలు అడ్డుకుంటాయి.
దేశంలో తొలి రైల్వే కేబుల్ వంతెన
కట్రా– రియాసీ సెక్షన్‌లో అంజీఖడ్ వద్ద దేశంలోనే తొలి రైల్వే కేబుల్ వంతెనను నిర్మించారు. భూకంపాలు, వరదలు, ప్రకృత్తి విపత్తులకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతంలో రెండు కొండలను అనుసంధానిస్తూ కేబుల్ వంతెన నిర్మాణమే సరైన పరిష్కారమని ఇంజనీరింగ్ నిపుణులు నిర్ణయించారు.
ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీ సాంకేతిక పరిశోధన సహకారంతో 725.5 మీటర్ల వంతెనను నిర్మించారు. అందులో 290 బలమైన కేబుల్ వైర్లతో నిర్మించిన వంతెన 473.25 మీటర్ల పొడవు ఉంటుంది.
పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా..
చలి కాలంలో పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా ఉండేందుకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రత్యేక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డబుల్ వాల్డ్ కాంపోజిట్ ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకులను నిరి్మంచారు. దీంతో పట్టాలపై చేరే నీరు ద్రవ రూపంలోనే ఉంటుంది. చలికి గడ్డ కట్టదు. రైళ్లకు నీటి సరఫరా కోసం రక్షణ శాఖ సహకారంతో హీటెడ్ పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లలోని టాయిలెట్లలో గీజర్ల సదుపాయం ఉంటుంది. సెంట్రల్లీ హీటెడ్ స్లీపర్ వందే భారత్ రైళ్లను ఈ లైన్‌లో ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment