సాక్షి, అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.4,666 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు నిధుల కేటాయింపుల్ని బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు ప్రైవేటు రైళ్లు నడుపుతామని చెప్పారు.
రెండు కీలక డబ్లింగ్ ప్రాజెక్టులు
ఏపీలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు గతేడాది కేటాయింపులు రూ.2,442 కోట్లు మాత్రమే. ఈ ఏడాది రూ.4,666 కోట్లు కేటాయించారు. అయితే, కొత్త లైన్లకు నిధులేవీ మంజూరు చేయకపోవడం గమనార్హం. రూ.5,380 కోట్ల అంచనాతో కొత్తగా రెండు డబ్లింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ధర్మవరం–పాకాల–కాట్పాడి (290 కిలోమీటర్లు) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,900 కోట్లు, గుంటూరు–బీబీనగర్ (248 కిలోమీటర్లు) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,480 కోట్లు కేటాయించారు.
- నడికుడి–శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్‌కు ఇప్పటివరకు రూ.1,114 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,198 కోట్లతో ఈ రైలు మార్గం పూర్తవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
- కోటిపల్లి–నర్సాపూర్ కొత్త రైలు మార్గానికి రూ.551 కోట్లు కేటాయించారు. దీంతో ఈ పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.
- మంగళగిరి–అమరావతి కొత్త లైన్ మార్గానికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు.
- కడప–బెంగుళూరు కొత్త రైలు మార్గానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అలాగే గూడూరు–దుగరాజపట్నం రైల్వే లైన్‌కు కూడా నిధులు కేటాయించలేదు.
- విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నర్సాపురం–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఈ ఏడాది పూర్తి కానున్నాయి. బడ్జెట్‌లో రూ.1,158 కోట్లు కేటాయించారు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి విశాఖపట్నంతో అనుసంధానం పెంచడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
- గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.294 కోట్లు కేటాయించారు.
- గుత్తి–ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.135 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
- విజయవాడ–గూడూరు మూడో లైన్ (ట్రిప్లింగ్) పనులకు రూ.664 కోట్లు కేటాయించారు. 2022 నాటికి ఈ పనుల్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. ఆ మేరకు కేటాయింపులు లేకపోవడం గమనార్హం.
- విజయవాడ–కాజీపేట ట్రిప్లింగ్ పనులకు రూ.404 కోట్లు కేటాయించారు.
- విజయవాడ, రేణిగుంట, గుత్తి బైపాస్ మార్గాలకు రూ.122 కోట్లకు పైగా కేటాయించారు. కర్నూలు మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి రూ.30 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్ రెండో ప్రవేశ ద్వారం అభివృద్ధికి రూ.6 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.11 కోట్లు కేటాయించారు.
- ధర్మవరం–పాకాల, నంద్యాల–యర్రగుంట్ల, డోన్–మన్మాడ్ రైలు మార్గాల విద్యుదీకరణకు వరుసగా రూ.25 కోట్లు, రూ.18 కోట్లు, రూ.50 కోట్లు కేటాయించారు.
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు రూ. 4,666 కోట్లు
Published Thu, Feb 6 2020 4:26 AM | Last Updated on Thu, Feb 6 2020 4:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment