సాక్షి, అమరావతి: రైళ్లు పరస్పరం ఢీకొనే ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు రైల్వే శాఖ ఆధునిక సాంకేతిక రక్షణాత్మక వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. రెండు రైళ్లు ఒకేసారి ట్రాక్ మీదకు వచ్చి ఢీకొనడం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తోంది. దీన్ని నివారించేందుకు ‘కవచ్’ పేరుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దేశంలో 2 వేల కిలోమీటర్ల మేర రైలు మార్గాల్లో ‘కవచ్’ విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోఅభివృద్ధి చేసిన కవచ్ విధానంతో రైళ్లు పరస్పరం ఢీకొనడాన్ని పూర్తిగా నివారించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది.
వేగం తగ్గించకుండానే..
ప్రస్తుతం రైళ్ల డ్రైవర్లు ఏదైనా రైల్వే స్టేషన్ రాగానే రైళ్ల వేగాన్ని తగ్గిస్తుంటారు. ఆ స్టేషన్‌లో రైలు నిలపాల్సిన అవసరం లేకపోయినా సరే రైళ్ల వేగాన్ని తగ్గిస్తున్నారు. పొరపాటున ఎదురుగా ఏదైనా రైలు వస్తుందేమోనని ముందు జాగ్రత్తగా వేగాన్ని తగ్గిస్తారు. మళ్లీ వేగం పుంజుకునేందుకు కొంత సమయం పడుతుంది. దాంతో రైళ్లు తగిన వేగంతో ప్రయాణించడం సాధ్యపడటం లేదు. కవచ్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఆ విధంగా నిలపాల్సిన అవసరం లేని రైల్వే స్టేషన్లు సమీపించగానే రైళ్ల వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండదు. దాంతో రైళ్లు గమ్యస్థానాలకు త్వరగా చేరేందుకు అవకాశం ఉంటుంది.
విజయవంతంగా ప్రయోగం
రైల్వే శాఖ కవచ్ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. భారత దేశంలో రైళ్లు ఢీకొన్న ప్రమాదాలను విశ్లేషించగా 89 శాతం ప్రమాదాలు మానవ తప్పిదంతోనే సంభవించాయని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి యాంటీ కొల్లీషన్ పరికరాలను రైల్వే శాఖ రూపొందించింది. ఈ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా కొంకణ్ రైల్వే పరిధిలో పరీక్షించారు. అనంతరం ఈశాన్య రైల్వే పరిధిలోనూ ప్రవేశపెట్టారు. ఆ రెండుచోట్లా ఈ వ్యవస్థ పూర్తిగా విజయవంతమైంది. దాంతో ఈ వ్యవస్థకు ‘కవచ్’ అనే పేరుపెట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. మొదటి దశలో దేశంలో 2వేల కిలోమీటర్ల మేర లైన్లలో కవచ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా మెట్రో నగరాలను కలుపుతూ ఉన్న లైన్లలో వీటిని ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. చెన్నై–కోల్‌కతా మార్గంలో కూడా వీటిని ప్రవేశపెట్టనున్నారని సమాచారం.
కవచ్ వ్యవస్థ ఇలా..
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కవచ్ వ్యవస్థను రైల్వే శాఖ సిద్ధం చేసింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఎస్‌ఐఎల్–4 సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. ఈ పరిజ్ఞానాన్ని ఏర్పరచడంలో భాగంగా మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను రైళ్లలో ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్‌లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్‌ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే.. నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా వెంటనే గుర్తించడం సాధ్యపడుతుంది. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment