సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలో ఇటీవల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాదం రైల్వే చరిత్రలో పెద్ద మచ్చే. కవచ్ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. రైళ్ల ప్రమాదాల నివారణకు భారత రైల్వే శాఖ రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థ ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది.
దేశవ్యాప్తంగా కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 15 ఏళ్లు పడుతుందని రైల్వే శాఖ నివేదిక వెల్లడించింది. స్వర్ణ చతుర్భుజి మార్గంలో 2028 నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. స్వర్ణ చతుర్భుజిలోని చెన్నై – హౌరా మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందున రాష్ట్రంలో మరో ఐదేళ్లలో (2028నాటికి) కవచ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
స్వదేశీ పరిజ్ఞానంతో ‘కవచ్’
సాంకేతిక, మానవ తప్పిదాలతో రెండు రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్ మీదకు వస్తే ఢీకొనకుండా నివారించేందుకు రైల్వే రీసెర్చ్ డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ‘కవచ్’ పేరుతో ఆధునిక రక్షణ వ్యవస్థను రూపొందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రైల్వే శాఖ రూపొందించిన ఈ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అందించే అత్యుత్తమ స్థాయి సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్ –4 (ఎస్‌ఐఎల్ 40) సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం.
దేశంలో రైళ్లు ఢీకొన్న ఘటనల్లో 89 శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి ‘యాంటీ కొల్లీషన్ పరికరాలను’ రైల్వే శాఖ రూపొందించింది. దీనిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరీక్షించగా, పూర్తి సఫలీకృతమైంది. దీంతో ‘కవచ్’ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటివరకు దేశంలో కేవలం 1,450 కిలోమీటర్ల మేరే అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనతో కవచ్ వ్యవస్థను దేశమంతా దశలవారీగా విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికను రూపొందించింది. అందుకోసం హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ అనే సంస్థతో కలసి కవచ్ ప్రాజెక్టును చేపట్టినట్టు రైల్వే శాఖ తెలిపింది.
ఇదీ ప్రణాళిక..
♦ దేశంలో రైళ్ల రద్దీ అత్యధికంగా ఉండే స్వర్ణ చతుర్భుజి మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం కిలోమీటర్‌కు రూ.50 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
♦ స్వర్ణ చతుర్భుజి మార్గంలో మొదటగా ముంబయి–ఢిల్లీ, ఢిల్లీ–హౌరా రూట్‌లో కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. ఇప్పటికే రైల్వే శాఖ ఈ పనులు ప్రారంభించింది. ముంబయి – ఢిల్లీ 1,384 కి.మీ., ఢిల్లీ–హౌరా 1,454 కి.మీ. కలిపి మొత్తం 2,838 కి.మీ. మేర ఈ పనులను 2024 డిసెంబర్‌కు పూర్తి చేయాలన్నది లక్ష్యం.
♦ రెండో దశ కింద స్వర్ణ చతుర్భుజిలోని ఇతర మార్గాల్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ మీదుగా చెన్నై–హౌరా మార్గంలో కూడా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. చెన్నై –హౌరా, చెన్నై–బెంగళూరు–ముంబయి మార్గంలో 2024 డిసెంబర్‌లో పనులు ప్రారంభించి 2028నాటికి పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
♦ ఆంధ్రప్రదేశ్ గుండా చెన్నై–హౌరా మార్గంలో మొత్తం 1,162 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు విజయవాడ, విశాఖపట్నం, కటక్, బాలాసోర్‌లను ప్రధాన కేంద్రాలుగా గుర్తించారు.
♦ అనంతరం మూడో దశ కింద చెన్నై–ఢిల్లీ మార్గంలో మొత్తం 2,182 కి.మీ. మేర కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు.
కవచ్ పనిచేస్తుందిలా..
కవచ్ వ్యవస్థలో భాగంగా రైళ్లలో మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్‌లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్‌ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది.
ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే... నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా గుర్తించొచ్చు. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. దాంతో రైళ్లు పరస్పరం ఢీకొనకుండా పూర్తిగా నివారించడం సాధ్యపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment