ఇక వందే భారత్‌ స్లీపర్‌ | Sleeper coach in Vande bharat trains | Sakshi
Sakshi News home page

ఇక వందే భారత్‌ స్లీపర్‌

Published Wed, May 24 2023 3:47 AM | Last Updated on Wed, May 24 2023 11:10 AM

Sleeper coach in Vande bharat trains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లోని ఆధునిక రైళ్లతో పోటీపడే రీతిలో రూపుదిద్దుకుని సూపర్‌ సక్సెస్‌ అయిన వందేభారత్‌ రైళ్ల తదుపరి వర్షన్‌ తయారీకి రైల్వే సిద్ధమైంది. ప్రస్తుతం చైర్‌ కార్‌ కోచ్‌లతో నడుస్తున్న ఈ రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డిజైన్లు రూపొందించేందుకు రైల్వే చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చికల్లా డిజైన్లు ఖరారు చేసి రైల్‌ కోచ్‌ల తయారీ ప్రారంభించాలని నిర్ణయించింది. 

ప్రస్తుత రైలుకు భిన్నంగా.. 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 800 కి.మీ.లోపు దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి సంక్రాంతి రోజున సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య నడిచే తొలి వందేభారత్‌ రైలును, ఏప్రిల్‌లో రెండో వందేభారత్‌ సర్విసుగా సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య నడిచే రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే.

పగటి వేళ నడిచే రైళ్లు అయినప్పటికీ ఈ రెండు సర్వీసులు విజయవంతమయ్యాయి. వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 140 శాతంగా నమోదవుతోంది. ఇలా దేశవ్యాప్తంగా చాలా వందేభారత్‌ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. అయితే, వీటిల్లో బెర్తులు లేకపోవటంతో ప్రయాణికులు కూర్చునే వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఎనిమిది గంటల్లో గమ్యం చేరేలా సమయాలను సెట్‌ చేశారు.

దూర ప్రాంత నగరాల మధ్య నడపాలంటే, సమయం ఎక్కువ పడుతుంది, అంతసేపు కూర్చోవటం సాధ్యం కానందున కేవలం దగ్గరి నగరాల మధ్యనే తిప్పుతున్నారు. అయితే వీటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి దూర ప్రాంత నగరాల మధ్య రాత్రింబవళ్లు తిప్పాలని రైల్వే నిర్ణయించింది.  

మరింత వేగంగా.... 
గతంలో పగటి వేళ చైర్‌ కార్‌తో తిరిగేలా డబుల్‌ డెక్కర్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. అన్ని వసతులు మెరుగ్గానే ఉన్నప్పటికీ వీటి వేగం సాధారణ రైళ్లలాగే ఉండేది. దీంతో గంటల తరబడి పగటి వేళ కూర్చుని ప్రయాణించేందుకు ప్రయాణికులు విముఖత చూపటంతో ఆ కేటగిరీ విజయం సాధించలేదు. వందేభారత్‌ రైళ్లు మాత్రం శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వీలుండటంతో వీటి ప్రయాణ సమయం బాగా తక్కువగా ఉంది.

ఈ కేటగిరీ సక్సెస్‌కు ఇదే ప్రధాన కారణం. దీంతో తదుపరి స్లీపర్‌ కేటగిరీ రైళ్లు మరింత వేంగంగా ప్రయాణించేలా ప్లాన్‌ చేస్తున్నారు. వాటి గరిష్ట వేగం దాదాపు 200 కి.మీ. మించి ఉంటుందని తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించటం ఆసక్తిని రేపుతోంది. అంత వేగంతో దూసుకుపోయేలా దీని డిజైన్‌ను రూపొందించనున్నారని, ఇది ప్రస్తుత వందేభారత్‌ రైళ్లకు భిన్నంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇప్పటికే దేశంలోని అన్ని కోచ్‌ ఫ్యాక్టరీల్లో వందేభారత్‌ రైళ్లను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో కొత్త రైలు నమూనాలను రూపొందించే పని ప్రారంభించినట్టు సమాచారం. మార్చి నాటికి నమూనా రైలును కూడా సిద్ధం చేసి కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. వందేభారత్‌ రైలు 2018లో రూపొందినా.. దాదాపు ఏడాదిన్నర పాటు దాన్ని పరిశీలించి పలు మార్పులు చేస్తూ వచ్చారు. కొత్త రైలుకు కూడా అలా పరిశీలించి మార్పులు చేసి, లోపాలు లేకుండా ప్రారంభించాలని భావిస్తున్నారు. 

సాధారణ రైళ్లను రీప్లేస్‌ చేసేలా..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంప్రదాయ నమూనా రైళ్లే నడుస్తున్నాయి. ప్రీమియం కేటగిరీ రైళ్లుగా పిలుచుకునే శతాబ్ది, తేజస్, రాజధాని, దురంతో లాంటివి కూడా సంప్రదాయ రూపులోనే ఉంటున్నాయి. ఇటీవల కోచ్‌లను మాత్రం ఐసీఎఫ్‌ బదులు ఎల్‌హెచ్‌బీవి జత చేస్తున్నారు. కొత్త వందేభారత్‌ రైలు పట్టాలెక్కటం ప్రారంభించాక ఇక ప్రీమియం కేటగిరీ రైళ్లను కొత్త వందేభారత్‌తో రీప్లేస్‌ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ రైళ్లను కూడా కొత్త రూపు రైళ్లతో మార్చే యోచనలో రైల్వే ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement