వందేభారత్ స్లీపర్ రైళ్ల కాంట్రాక్టులో సవరణ
ఒక్కో రైలులో కోచ్‌ల సంఖ్య 16 నుంచి 24కు పెంపు
200 రైళ్లు
133కు తగ్గింపు
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ స్లీపర్ రైళ్ల కాంట్రాక్టును రైల్వే శాఖ సవరించింది. రైళ్ల సంఖ్యను తగ్గిస్తూ.. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ కాంట్రాక్టులో మార్పులు చేసింది. స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే రూట్లను కూడా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న చైర్ కార్ వందేభారత్ రైళ్లతోపాటు స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఖరారు చేసింది. 800 కి.మీ. నుంచి 1,200 కి.మీ. దూరప్రాంతాలకు స్లీపర్ కోచ్‌లతో కూడిన 200 వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రూ.58వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది. కానీ.. స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో ప్రవేశపెట్టాలనే అంశంపై రైల్వే శాఖ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది.
స్లీపర్ కోచ్‌ల నిర్వహణ వ్యయం, టికెట్ల ద్వారా వచ్చే రాబడి మధ్య సమతుల్యత లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. అందుకే.. మొదటి స్లీపర్ వందేభారత్ రైలును ప్రారంభించే విషయంలో కాలయాపన చేస్తోంది. డిమాండ్ ఉన్న, అంతగా లేని మొత్తం 200 రూట్లలో స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టడం నిర్వహణ వ్యయం పరంగా సరైన నిర్ణయం కాదని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. ఒక్కో కోచ్‌లో 80 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌లతో కూడిన స్లీపర్ రైళ్లను అంతగా డిమాండ్‌లేని రూట్లలో కూడా నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతుందని అంచనాకు వచ్చింది.
దాంతో స్లీపర్ కోచ్‌లకు అధిక డిమాండ్ ఉంటుందని భావిస్తున్న రూట్లలోనే ఆ రైళ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా టికెట్ల ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. ఈ మేరకు స్లీపర్ రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇక ఒక్కో రైలులో కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచింది. కాంట్రాక్టు మొత్తం వ్యయం మాత్రం రూ.58వేల కోట్లుగానే ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్), భారతహెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)కు సవరించిన కాంట్రాక్టును ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment