కరోనాపై పోరుకు రైల్వే రెడీ! | Railway Isolation Wards Ready In Telangana | Sakshi
Sakshi News home page

కరోనాపై పోరుకు రైల్వే రెడీ!

Published Sun, May 10 2020 4:29 AM | Last Updated on Sun, May 10 2020 4:29 AM

Railway Isolation Wards Ready In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే మరికొద్ది రోజుల్లో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం సగటున 3 వేలకు పైగా కొత్త పాజిటివ్‌ కేసులు వస్తుండటం, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తుండటంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు సరిపోని పరి స్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌ వార్డులుగా మార్చిన రైల్వే కోచ్‌లను వాడకానికి వీలుగా సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ డీజీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా వినియోగించాల్సిన రైళ్లతో కూడిన తొలి విడత జాబితాను సిద్ధం చేసింది.

దేశవ్యాప్తంగా 215 రైల్వే స్టేషన్లలో..
దేశవ్యాప్తంగా తొలి విడతగా 215 రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్‌ వార్డులుగా మార్చిన రైళ్లను సిద్ధంగా ఉంచుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రైల్వే శాఖను అప్రమత్తం చేసి,  కరోనా రైళ్లను ఉంచాల్సిన స్టేషన్ల వివరాలను అందజేసింది. ఇం దులో భాగంగా తెలంగాణలో సికింద్రాబాద్, కాచి గూడ, ఆదిలాబాద్‌ స్టేషన్లలో ఒక్కో కరోనా రైలు చొప్పున ఉంచాల్సిందిగా ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 9 స్టేషన్లలో రైళ్లను సిద్ధం చేయాలని సూచించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాస, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్డు, కొండాపురం, దిగువమెట్ట స్టేషన్లలో ఈ రైళ్లను అందుబాటులో ఉంచుతోంది.

వైద్యులు.. ఆక్సిజన్‌.. ఇతర పరికరాలు..
పాజిటివ్‌ కేసు రాగానే సమీపంలో ఉన్న ఆసుపత్రికి వేగంగా తరలించాలి. ఆసుపత్రి అందుబాటులో లేకుంటే ఈ రైల్వే కోచ్‌లను వాడుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఒక రైలులో 22 కోచ్‌లుంటాయి. ప్రతి కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఒక కూపేను సిబ్బంది కోసం వదిలేసి మిగతా 8 కూపేలను కరోనా బాధితుల చికిత్సకు కేటాయించారు. ప్రతి కూపేలో రెండు చొప్పున బెడ్లుంటాయి. కోచ్‌లో రెండు టాయిలెట్లు, ఒక స్నానాల గది ఉంటుంది. ప్రతి కోచ్‌లో ఆక్సిజన్‌ సిలిండర్, విద్యుత్తు వసతి, ఇతర వైద్య పరికరాలు ఉంచాలని రైల్వేను కేంద్ర వైద్య శాఖ కోరింది. ఇప్పటికే ఆ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రత్యేక రైలు ఉన్న స్టేషన్‌లో ఆక్సిజన్‌ వసతి ఉన్న అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని రాష్ట్రాలను కోరింది.

అందుబాటులో రైల్వే వైద్యులు, సిబ్బంది ఉంటే ఏర్పాటు చేయాలని, లేని చోట రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయాలని కోరింది. తెలంగాణలో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన రైలులో రైల్వే వైద్యులున్నారు. కాచి గూడ, ఆదిలాబా ద్‌లలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో విశాఖ, విజయవాడల్లో మాత్రం రైల్వే వైద్యులుండగా, మిగతా ఏడు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక నిరంతరం ఆ రైళ్లలో నీళ్లు అందుబాటులో ఉంచాలి. విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించాలి అని పేర్కొంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే మరిన్ని స్టేషన్లలో ఇలాంటి రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే 486 కోచ్‌లను సిద్ధం చేసి ఉంచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement