హామీపత్రం ఉంటేనే..హోం ఐసోలేషన్‌ | UnderTaking Letter Must For Home Isolation | Sakshi
Sakshi News home page

హామీపత్రం ఉంటేనే..హోం ఐసోలేషన్‌

Published Sat, Jul 4 2020 10:23 AM | Last Updated on Sat, Jul 4 2020 10:34 AM

UnderTaking Letter Must For Home Isolation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రోగుల సంరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. బాధతుల సంఖ్య ఎక్కువైతే అందరికీ ఆస్పత్రుల్లో చికిత్స సాధ్యం కానందున లక్షణాలు తక్కువగా ఉన్నవారు, ఇంట్లో వసతులు ఉన్న వారంతా హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో హోం ఐసోలేషన్‌ విధానాన్ని కట్టుదిట్టం చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు మార్పులు చేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా, ప్రతిరోజూ వైద్యుల పరిశీలన ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. (మూడు నెలలు ముప్పుతిప్పలే!)

పర్యవేక్షకుడి ఆధ్వర్యంలో... 
ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లకు ఆన్‌లైన్‌లో వైద్యుల సలహాలు, సూచనలు అందుతున్నాయి. అయితే కేంద్రం తాజా ఆదేశాల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి బాధితుడిని వైద్యులు లేదా వైద్య సహాయకుడు తప్పకుండా పరిశీలించాలి. రోగి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ శాతంతోపాటు గుండె వేగం ఎంత ఉందో పరీక్షించి ఆ వివరాలను కోవిడ్‌–19 పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అలాగే బాధితుడితో ఎవరైనా కాంటాక్ట్‌ అయ్యారా లేదా అని చెక్‌ చేస్తూ అలాంటి వారుంటే వైద్యుడి సలహా మేరకు పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదివరకు కేవలం లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే హోం ఐసోలేషన్‌కు అనుమతివ్వగా తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులున్నప్పటికీ వాటిని నియంత్రణలో ఉంచుకొనే వారు కూడా వైద్యల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు సుముఖుత తెలిపిన బాధితుడు ప్రభుత్వానికి అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి. తనకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలిచ్చే డాక్టర్‌ కూడా అందులో సంతకం (కౌంటర్‌ సైన్‌) చేయాల్సి ఉంటుంది. అవయవ మార్పిడి, కేన్సర్, హెచ్‌ఐవీ రోగులకు మాత్రం హోం ఐసోలేషన్‌కు అనుమతి లేదు. 

10 రోజులకు కుదింపు... 
కరోనా బాధితుడి హోం ఐసోలేషన్‌ గడువు ఇప్పటిదాకా 17 రోజులుగా ఉంది. తాజాగా ఈ కాలాన్ని మరింత కుదించారు. కేవలం పది రోజులు ఉంటే హోం ఐసోలేషన్‌ నుంచి డిశ్చార్జి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో వరుసగా మూడు రోజులపాటు ఎలాంటి లక్షణాలు ఉండకూడదు. అయితే హోం ఐసోలేషన్‌ నుంచి డిశ్చార్జి అయినప్పటికీ మరో వారంపాటు రోగి తప్పకుండా ఇంట్లోనే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. 

మరిన్ని లక్షణాలు జోడింపు... 
కరోనా వైరస్‌ సోకిన వారికి జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితోపాటు ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలను కేంద్ర నిర్ధారించింది. తాజాగా ఈ లక్షణాల జాబితాలో మరో రెండు అంశాలను జోడించింది. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, ఫిట్స్‌ రావడం, మాటలు నత్తిగా రావడం లాంటి వాటిని కూడా లక్షణాల జాబితాలో చేర్చింది. తాజా నిబంధనలతో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిపై ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోందని, దీంతో రిస్క్‌ కూడా తగ్గుతోందని నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి డాక్టర్‌ మాదల కిరణ్‌ ‘సాక్షి’కి వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement