సాక్షి, హైదరాబాద్ : ఎవరికైనా కరోనా వస్తే చికిత్స కోసం ఇక ఆస్పత్రులకు వెళ్లక్కర్లేదు. రోజుల తరబడి ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. కరోనా రోగులకు చికిత్స చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారు తమ ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం కల్పించింది. అలాంటివారు ఇంట్లోనే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన మందులు వాడితే సరిపోతుంది. ఇందుకోసం ముందుగా స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.
అయితే, ఇరుకుపాటి ఇళ్లున్నవారికి ఈ వెసులుబాటు వర్తించదు. మిగతా కుటుంబ సభ్యులతో కలవకుండా ప్రత్యేక గదిలో ఉండటానికి వీలున్నవారికే ఇది వర్తిస్తుంది. ఒకవేళ వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రుల్లోనే ఉంటామని చెబితే.. వారికి అలాగే చికిత్స అందజేస్తారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ రోగులందరినీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కరోనా రోగులు ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందే వెసులుబాటు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే, ఇది ఆచరణ సాధ్యమేనా అని పలువురు వైద్య నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తగ్గని కరోనా ప్రకోపం
వైద్యుడి సలహా మేరకే ఇంట్లో చికిత్స
కరోనా పాజిటివ్ లక్షణాలుండి, తీవ్రత తక్కువ ఉన్న రోగి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవాలంటే, సంబంధిత వైద్యుడి అనుమతి ఉండాలి. అలా ఉంచడం వల్ల వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులుండవని సదరు వైద్యుడు నిర్ధారించాలి. అలాగే స్వీయ దిగ్బంధంలో ఉండే పరిస్థితులు రోగికి ఉన్నాయా లేదా డాక్టర్ తెలుసుకోవాలి. రోగి సంరక్షణ బాధ్యతలు తీసుకునేవారు తప్పనిసరిగా ప్రొటోకాల్ ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు, రోగనిరోధక శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. రోగి మొబైల్‌లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ఉండాలి. అది ఎల్లప్పుడూ బ్లూటూత్ లేదా వైఫై ద్వారా యాక్టివ్‌లో ఉండాలి. వైద్య నిఘా బృందాలు ఆ రోగి కదలికలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంటాయి. ఇవన్నీ సక్రమంగా పాటించేవారు మాత్రమే ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవడానికి అర్హులని కేంద్రం స్పష్టంచేసింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణమే ఆసుపత్రికి తరలిస్తారు. చదవండి: లాక్‌డౌన్ సమస్యలపై సుప్రీం విచారణ
రోగి ఇంట్లో ఎలా ఉండాలంటే?
►ఎప్పుడూ ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ వాడాలి. 8 గంటలు ఉపయోగించిన తర్వాత దానిని మార్చాలి. ఒక్కోసారి అంతకంటే ముందుగానే తడిగా ఉన్నా, ఏదైనా మురికిగా ఉన్నా వెంటనే తీసేయాలి.
►మాస్క్‌ను సోడియం హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేసిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుని పారేయాలి.
►రోగి తప్పనిసరిగా ఇతర వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, బీపీ, షుగర్, గుండె, మూత్రపిండ వ్యాధులు ఇతరత్రా అనారోగ్యంగా ఉన్న వారికి దగ్గరగా ఉండకూడదు.
►రోగి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి, అవసరమైనంత నీరు, పళ్ల రసాలు తాగాలి. శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవాలి.
►చేతులను తరచుగా సబ్బు, నీటితో 40 సెకన్ల పాటు కడుక్కోవాలి. లేదంటే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
►వ్యక్తిగత వస్తువులను ఇతర వ్యక్తులతో పంచుకోవద్దు. రోగి తాకిన ప్రదేశాలను, వస్తువులను, మందులను, తలుపు హ్యాండిళ్లను హైపోక్లోరైట్ ద్రావణంతో కడగాలి.
►తప్పనిసరిగా వైద్యుడి సూచనల మేరకు మందులు వాడాలి.
రోగి సహాయకుడికి సూచనలు...
►రోగితో ఒకే గదిలో ఉంటూ సాయపడే వ్యక్తి ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ ధరించాలి. దాన్ని మరోసారి ఉపయోగించకూడదు.
►తినడానికి ముందు, టాయిలెట్‌కు వెళ్లొచ్చాక కనీసం 40 సెకన్లపాటు చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడానికి సబ్బు, నీరు వాడాలి. లేకుంటే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ ఉపయోగించవచ్చు.
► రోగికి దగ్గరగా ఉండకూడదు. అతడు/ఆమె శరీర ద్రవాలు, ముఖ్యంగా నోటి ద్వారా వచ్చే తుంపర్లకు దూరంగా ఉండాలి.
►రోగికి సపర్యలు చేసేప్పుడు గ్లౌజులు ధరించాలి. వాటిని తొలగించిన తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కోవాలి.
►రోగి వాడే వస్తువులను సహాయకుడు ఉపయోగించకూడదు. సిగరెట్లు పంచుకోవడం, పాత్రలు, వంటకాలు, పానీయాలు, ఉపయోగించిన తువ్వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. రోగి వాడిన సబ్బును కూడా వినియోగించకూడదు.
►రోగి దుస్తులు, వాడే వస్తువులను శుభ్రపరిచేటప్పుడు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్‌తోపాటు, గ్లౌజ్‌లు వేసుకోవాలి.
►రోగి రోజువారీ ఉష్ణోగ్రత చూస్తుండాలి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌కు తెలియజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment