ప్రమాదస్థలి వద్ద యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు
బాలాసోర్/న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. అంతేగాక, ‘‘ప్రమాదం వెనక విద్రోహ కోణాన్నీ తోసిపుచ్చలేం. రైళ్ల ఉనికిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటి గమనాన్ని నిర్దేశించే అతి కీలకమైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం’’ అని రైల్వే వర్గాలు చెప్పుకొచ్చాయి.
రైలును ట్రాక్‌ను మళ్లించే ఎలక్ట్రిక్ పాయింట్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సంబంధిత సమస్యే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ్ భువనేశ్వర్‌లో మీడియాకు చెప్పారు. ‘‘పూర్తి వివరాల్లోకి నేనిప్పుడే వెళ్లదలచుకోలేదు. అయితే పాయింట్ యంత్రం సెట్టింగ్‌ను మార్చారు. ఇదెందుకు, ఎలా జరిగిందన్నది విచారణ నివేదికలో వెల్లడవుతుంది’’ అని వివరించారు. మూడు రైళ్ల ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి సిఫార్సు చేసినట్టు వెల్లడించారు. విపక్షాలు మాత్రం ఈ విషయంలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి.
ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ సహా పలు ఇతర విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. మంత్రుల స్థాయి నుంచి కింది దాకా బాధ్యులందరినీ గుర్తించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు మీడియా పిచ్చి, పీఆర్ గిమ్మిక్కులు ప్రభుత్వ వ్యవస్థను చేతగానిదిగా మార్చేశాయమంటూ ఖర్గే తూర్పారబట్టారు. యూపీఏ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు ఎంత ఘోరంగా ఉండేదో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. మహా విపత్తును కూడా రాజకీయం చేయడం దారుణమని మండిపడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను 288 నుంచి 275గా రైల్వే శాఖ ఆదివారం సవరించింది.
విద్రోహ కోణంపై రైల్వే ఏం చెప్పిందంటే...
పాయింట్ మెషీన్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమని రైల్వే వర్గాలు వివరించాయి. ‘‘అదెంత సురక్షితమంటే ఒకవేళ అది పూర్తిగా విఫలమైనా సిగ్నళ్లన్నీ వెంటనే రెడ్‌కు మారి రైళ్ల రాకపోకలన్నీ తక్షణం నిలిచిపోతాయి. అయినా సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమైంది గనుక బయటి శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. కేబుళ్లను చూసుకోకుండా ఎవరైనా తవ్వేయడంతో తెగిపోయి ఉండొచ్చు’’ అని రైల్వే బోర్డు సభ్యురాలు జయా వర్మ సిన్హా వివరించారు. ప్రమాదానికి మితిమీరిన వేగం, డ్రైవర్ల తప్పిదం కారణం కావని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. లోపలి, లేదా బయటివ్యక్తులు విద్రోహానికి పాల్పడే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని రైల్వే అధికారి ఒకరన్నారు.
టికెట్ లేని వారికీ పరిహారం
షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో లూప్‌లైన్లోకి దూసుకెళ్లి ఆగున్న గూడ్సును ఢీకొని పట్టాలు తప్పడం, పక్క ట్రాక్‌పై పడ్డ బోగీలను ఢీకొని బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో గాయపడ్డ 1,175 మందిలో వందలాది మంది ఇంకా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రైళ్లలో చాలావరకు వలస కార్మికులే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్డు గత ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం అందించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు సహాయ చర్యలతో పాటు ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తూర్పు, దక్షిణ భారతాలను కలిపే ఈ కీలక రైల్వే లైన్లో పూర్తిగా దెబ్బ తిన్న ట్రాకుల్లో ఇప్పటిదాకా రెండింటిని పునరుద్ధరించారు.
ప్రమాదంపై సుప్రీంలో పిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాలో రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రైల్వే వ్యవస్థలో ప్రమాద, భద్రత పరామితులను కమిటీ విశ్లేషించి, వాటి బలోపేతానికి సలహాలు, సూచనలిచ్చేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విశాల్ తివారీ కోరారు. కవచ్ వ్యవస్థను వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలివ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment