సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే ప్రైవేటు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. డిమాండ్ ఉన్న ఐదు రూట్లలో ఏడు రైళ్లను ఆపరేటర్లు నిర్వహించేందుకు అనుమతించనున్నారు. ప్రయాణీకుల లబ్ధి కోసమే వీటిని ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన టెండర్లను ఈ నెలలోనే ఆహ్వానించేందుకు నీతి ఆయోగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విమానాల తరహాలో సౌకర్యాలు
కాగా, రూ.22,500 కోట్ల పెట్టుబడితో దేశంలోని వంద మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నారు. వీటిలో సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలో ఏపీకి సంబంధించి ఐదు రూట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ–లక్నో మధ్య తేజస్ ప్రైవేట్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 24న దీన్ని ప్రారంభించారు. రెండో ప్రైవేట్ రైలు అహ్మదాబాద్–ముంబై మార్గంలో జనవరి 19 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైళ్లలో విమానాల తరహాలో సౌకర్యాలుంటాయి. రైల్ హోస్టెస్‌లు ఉంటారు. ఏపీలోని ఐదు రూట్లలో డైలీ, ట్రై వీక్లీలుగా ఏడు ప్రైవేటు రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
డిమాండ్ ఉన్న రూట్లలోనే..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉన్న రూట్లనే ప్రైవేటు రైళ్లకు ఎంపిక చేశారు. శ్రీకాకుళం నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్లి హైదరాబాద్‌లోని చర్లపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఉంటున్నారు. తిరుపతికి, గుంటూరుకు లింగంపల్లి ప్రాంతం నుంచి ప్రయాణీకుల డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అలాగే, విశాఖ–విజయవాడ, విశాఖ–తిరుపతి రూట్లలోనూ అదే పరిస్థితి. ఈ మార్గాల్లోని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ రూట్లలో ప్రైవేటు రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు.
ప్రైవేటు రైళ్ల నిర్వహణ ఇలా..
ప్రైవేటు రైళ్లలో డ్రైవరు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది. ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు, బీమా తదితరాలన్నీ చూసుకుంటుంది. మిగిలిన సౌకర్యాలు మొత్తం ప్రైవేటు ఆపరేటర్లదే బాధ్యత.
ప్రైవేటు రైళ్లు నడిచే ఐదు రూట్లు ఇవే..
- చర్లపల్లి–శ్రీకాకుళం (డైలీ)
- లింగంపల్లి–తిరుపతి (డైలీ)
- గుంటూరు–లింగంపల్లి (డైలీ)
- విజయవాడ–విశాఖ (ట్రై వీక్లీ)
- విశాఖ–తిరుపతి (ట్రై వీక్లీ)
Comments
Please login to add a commentAdd a comment