‘ఏసీ’ భారం.. జనరల్‌ ‘ఘోరం’ | The railway department does not care about sleeper and general coaches | Sakshi
Sakshi News home page

‘ఏసీ’ భారం.. జనరల్‌ ‘ఘోరం’

Published Wed, Jul 31 2024 4:59 AM | Last Updated on Wed, Jul 31 2024 4:59 AM

The railway department does not care about sleeper and general coaches

అధిక రాబడే ధ్యేయం.. సామాన్యుల గోడు పట్టని రైల్వే శాఖ

వందే భారత్‌ రైళ్లు, ఏసీ కోచ్‌లకే ప్రాధాన్యత

స్లీపర్, జనరల్‌ కోచ్‌లను పట్టించుకోని వైనం

స్లీపర్‌ కోచ్‌లో రిజర్వేషన్‌ దొరకడం గగనం

జనరల్‌ కోచ్‌లో నిలబడేందుకూ చోటుండదు

సీట్లకంటే రెండింతలు ప్రయాణికులతో కిటకిట

ఏసీ కోచ్‌ల ఉత్పత్తి మూడింతలు పెరుగుదల

స్లీపర్, జనరల్‌ కోచ్‌ల ఉత్పత్తిలో 50 శాతం కోత

రైల్వే శాఖ తీరుపై సర్వత్రా ఆగ్రహం

ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వాలు  పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అత్యధిక ప్రాధాన్యత  ఇస్తాయి. ఆదాయం దృష్టితో కాకుండా  బాధ్యతతో వ్యవహరిస్తాయి. ప్రధానంగా  మన దేశంలో పేదలు, దిగువ మధ్య తరగతి  వర్గాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి  వచ్చి నప్పుడు ఎక్కువగా ప్రయాణించేది రైళ్ల లోనే. అదీ స్లీపర్, జనరల్‌ కోచ్‌ల్లోనే. తక్కువ  చార్జీతో గమ్యస్థానం చేరొచ్చనేదే పేదల ఆశ.  అయితే కొంత కాలంగా రైల్వే శాఖ వారి  ఆశలపై నీళ్లు చల్లుతూ.. జనరల్, స్లీపర్‌ కోచ్‌ లను తగ్గించేస్తూ.. ఏసీ కోచ్‌లను పెంచేస్తూ  ‘పక్కా వ్యాపారం’ చేస్తోంది. పర్యవసానంగా  ఏ రైలులోని జనరల్‌ కోచ్‌ల్లో చూసినా  పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. 

ఒకరిపై ఒకరు పడిపోయి.. ఒంటి కాలిపై  నిల్చొని.. టాయ్‌లెట్స్‌ ముందు ఇరుక్కుని..  మెట్లపై వేలాడుతూ.. చెమటలు కార్చుకుంటూ.. చిన్నారుల ఏడుపుల మధ్య ప్రయాణం సాగించాల్సి వస్తోంది. 70–80 మంది ప్రయాణించాల్సిన కోచ్‌లో దాదాపు 500 మంది వెళుతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది. హౌరా, పూరి, గౌహతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్, వివేక్‌ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. ఇలా ఒక్కటేమిటి రైళ్లన్నింటిలోనూ ఇదే దుస్థితి. ‘ఊరికి ఎలా వెళ్లాలి దేవుడా..’ అంటూ పేదలు వణికిపోతున్నారు.


సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు.. అనే నానుడికి ఇప్పుడు రైల్లో జనరల్‌ బోగీ ఎక్కిచూడు.. అనే వాక్యం కలుపు­కోవాలి.  రైలు ఎక్కాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందేనని సామాన్యులు హడలి పోతుండటం నేటి వాస్తవం. ఏసీ కోచ్‌లో వెళ్లాలంటే ఆరి్థక భారం.. స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులో ఉండవు.. జనరల్‌ కోచ్‌­లలో కాలు పెట్టేందుకే చోటుండదు.. ఇదీ సగటు రైల్వే ప్రయాణికుల దుస్థితి. రైల్వేల ఆధునికీకరణ, మెరుగైన సౌకర్యాల పేరుతో రైల్వే శాఖ పన్నిన మాయోపాయం పేద, దిగువ మధ్యతరగతి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ధనిక, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా రైళ్లను తీర్చిదిద్దడమే ఆధునికీకరణని రైల్వే శాఖ వక్రభాష్యం చెబుతోంది. 

సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండటం.. వారికి మెరుగైన వసతులు సమకూర్చడం అనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. దాదాపు అయిదేళ్లుగా పక్కా పన్నాగంతో జనరల్, స్లీపర్‌ కోచ్‌ల సంఖ్యను తగ్గిస్తూ ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచుతోంది. కోచ్‌ల సంఖ్యే కాకుండా ఏకంగా దేశంలో జనరల్, స్లీపర్‌ కోచ్‌ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తూ... రాబోయే కాలమంతా ఏసీ రైలు ప్రయాణమేనని తేల్చి చెబుతోంది. కేవలం ఏసీ కోచ్‌లే అందుబాటులో ఉండేలా చేసి భారీగా టికెట్ల రాబడి పెంచుకోవాలన్న ఉద్దేశంతో సామాన్య ప్రయాణికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. 

దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ అంశంపై ‘సాక్షి’ దృష్టి సారించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లా కేంద్రాల మీదుగా ప్రయాణించే ప్రధాన రైళ్లలో పరిస్థితిని పరిశీలించింది. యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, కోరమండల్, హౌరా–చెన్నై మెయిల్, గౌతమి, శేషాద్రి, పద్మావతి, ఎల్‌టీటీ, అల్లెప్పి–ధన్‌బాద్, తిరుపతి–పూరి, నవ జీవన్, తిరుపతి –హౌరా, ప్రశాంతి.. ఇలా ఏ రైలు చూసినా ఏమున్నది గర్వ కారణం.. సమస్త రైళ్లలో తీవ్ర అవస్థల మయం.. అన్నట్లుంది జనరల్, స్లీపర్‌ కోచ్‌లలో ప్రయాణికుల పరిస్థితి.  
 
జనరల్, స్లీపర్‌ కోచ్‌ల కోత  
రైల్వే శాఖ ఓ ప్రణాళిక ప్రకారం నాలుగేళ్లుగా వందే భారత్‌ వంటి ఏసీ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. తద్వారా అధిక చార్జీలు ఉండే ఏసీ కోచ్‌ల వైపు ప్రయాణికులను మళ్లించడం ద్వారా అధిక ఆదాయ సముపార్జనకే పెద్దపీట వేస్తోంది. మరోవైపు దిగువ మధ్య తరగతి, పేద ప్రయాణికులు ప్రయాణించే స్లీపర్, జనరల్‌ కోచ్‌ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది. 2019లో మొదలుపెట్టిన ఈ ప్రక్రియను మూడేళ్లుగా వేగవంతం చేసింది. సాధారణంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రాయాణికుల కోసం సగటున 22 కోచ్‌లతో నిర్వహిస్తున్నారు. 

గతంలో రైళ్లలో జనరల్‌ కోచ్‌లు నాలుగు, స్లీపర్‌ కోచ్‌లు 12 వరకు ఉండగా.. థర్డ్‌ ఏసీ కోచ్‌లు మూడు, సెకండ్‌ ఏసీ కోచ్‌లు రెండు, ఒక ఫస్ట్‌ ఏసీ కోచ్‌ ఉండేవి. కానీ మూడేళ్లుగా రైలు కోచ్‌ల కూర్పును రైల్వే శాఖ అమాంతం మార్చేసింది. ప్రస్తుతం జనరల్‌ కోచ్‌లు రెండు, స్లీపర్‌ కోచ్‌లు 10కి తగ్గించింది. థర్డ్‌ ఏసీ కోచ్‌లు ఆరు, సెకండ్‌ ఏసీ కోచ్‌లు మూడు, ఫస్ట్‌ ఏసీ కోచ్‌ ఒకటిగా చేసింది. దాంతో ఒక్కో రైలులో స్లీపర్‌ కోచ్‌లలో దాదాపు 150 బెర్త్‌లు, జనరల్‌ కోచ్‌లలో 150 వరకు సీట్లు తగ్గిపోయాయి. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఆధారపడే 300 సీట్లలో కోత పడింది. 

మరోవైపు ఏసీ కోచ్‌ల సంఖ్య పెరగడంతో వాటిలో 280 నుంచి 300 బెర్త్‌లు పెరిగాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే దసరా, దీపావళి, సంక్రాంతి, వేసవి సెలవుల స్పెషల్‌ రైళ్లలో అయితే స్లీపర్‌ కోచ్‌ల సంఖ్య కేవలం ఆరింటికే పరిమితం చేస్తూ థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ప్రధానమైన 40 రైళ్లలో ఏకంగా 100 ఏసీ కోచ్‌లను పెంచింది. వాటిలో థర్డ్‌ ఏసీ కోచ్‌లు 75, సెకండ్‌ ఏసీ కోచ్‌లు 20, ఫస్ట్‌ ఏసీ కోచ్‌లు 5 ఉన్నాయి. కొత్తగా ఎల్‌హెచ్‌బీ సాంకేతిక విధానంతో ఉత్పత్తి చేస్తున్న కోచ్‌లను ప్రవేశపెడుతున్నామనే సాకుతో స్లీపర్‌ కోచ్‌లను తగ్గిస్తూ ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచుతోంది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.  

కోచ్‌ల ఉత్పత్తిలోనూ అదే వివక్ష  
కొత్త రైల్వే కోచ్‌ల ఉత్పత్తిలోనూ కేంద్ర ప్రభుత్వం పేద, సామాన్య ప్రయాణికుల పట్ల వివక్ష కనబరుస్తోంది. అయిదేళ్లుగా రైల్వే శాఖ ఉత్పత్తి చేస్తున్న కోచ్‌ల విధానమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని చెన్నై, కపుర్తలా, రాయ్‌బరేలీలోని కోచ్‌ ఫ్యాక్టరీలలో జనరల్, స్లీపర్‌ కోచ్‌ల ఉత్పత్తిని రైల్వే శాఖ క్రమంగా తగ్గిస్తూ... ఏసీ కోచ్‌ల ఉత్పత్తిని పెంచుతోంది. ఆ మూడు ఫ్యాక్టరీలలో 2019–20లో 997 ఏసీ కోచ్‌లను ఉత్పత్తి చేశారు. కాగా 2024–25లో ఏకంగా 2,571 ఏసీ కోచ్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

మరోవైపు ఆ ఫ్యాక్టరీలలో 2019–20లో 1,925 జనరల్, స్లీపర్‌ కోచ్‌లను ఉత్ప­త్తి చేశారు. ఆ ఉత్పత్తిలో 85 శాతం కోత విధించి 2024–25లో కేవ­లం 278 కోచ్‌లే ఉత్పత్తి చేయాలని నిర్ణ­యించడం గమనార్హం. అంటే జనరల్, స్లీపర్‌ కోచ్‌ల స్థానంలో క్రమంగా ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలనే కార్యచరణ అమలు చేస్తోంది. 22 కోచ్‌లు ఉన్న రైళ్లలో కనీ­సం 18 ఏసీ కోచ్‌లే ఉండేట్టుగా చేయాలన్నది రైల్వే శాఖ అంతిమ లక్ష్యమని రైల్వే వర్గాలు చెప్పడం గమనార్హం.   

‘స్లీపర్‌’లో దొరకదు..  ‘జనరల్‌’లో చోటు ఉండదు 
రైల్లో ప్రయాణం అంటేనే పేదలు, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణం చేద్దామంటే రిజర్వేషన్లు దొరకడం లేదు. బెర్త్‌లు తగ్గిపోవడంతో రెండు నెలల ముందే రిజర్వేషన్‌ చేసుకోవాలి. లేదంటే రిజర్వేషన్‌ దొరకదు. తత్కాల్, ప్రీమియం తత్కాల్‌ విధానంలో రిజర్వేషన్‌ చేసుకుంటే టికెట్‌ ధర తడిసి మోపెడవుతోంది. జనరల్‌ కోచ్‌లో వెళ్లడం అంటే ప్రాణాలకు తెగించి సాహసం చేసినట్టే. ఒక జనరల్‌ కోచ్‌లో 72 నుంచి 80 వరకు సీట్లు ఉంటాయి. కానీ ఏ సమయంలో ఏ రైలులో జనరల్‌ కోచ్‌ చూసినా కనీసం 100 నుంచి 150 మంది వరకు ఉంటారు. 

ముగ్గురు కూర్చునే బెర్త్‌లో ఆరుగురు కూర్చోవడమే కాదు.. సీట్ల మధ్య ఖాళీల్లోనూ చివరికి లగేజీ పెట్టే రాక్‌ల మీద కూడా కూర్చొని కనిపిస్తారు. టాయిలెట్ల పక్కన ఒకరిని నెట్టుకుంటూ ఒకరు కూర్చోనో, నిలబడో పరస్పరం ఘర్షణ పడుతూ ప్రయాణిస్తుండటం అన్నది మన రైళ్లలో సర్వసాధారణమైంది.  కనీసం నీళ్లు తాగుదామన్నా అవ్వదు.. టాయిలెట్‌కు వెళ్దామంటే కుదరదు.. కాలు కదుపుదామన్నా సాధ్యం కాదు.. మెట్లపైన సైతం వేలాడుతూ ప్రాణాలకు తెగించి ప్రయాణించే ప్రయాణికుల దృశ్యాలు మన రైళ్లలో నిత్యం ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ కనిపిస్తాయి.  

అధిక రాబడే రైల్వే శాఖ లక్ష్యం 
అధిక రాబడే లక్ష్యంగా రైల్వే శాఖ ఏసీ కోచ్‌లకు పరిమితికి మించి ప్రాధాన్యమిస్తోంది. జనరల్, స్లీపర్‌ కోచ్‌లను తగ్గించి ఏసీ కోచ్‌లను పెంచితే అధిక రాబడి వస్తుందన్నది రైల్వే శాఖ ఉద్దేశం. ఉదాహరణకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నంకు స్లీపర్‌ కోచ్‌లో టికెట్‌ రూ.255. అదే థర్డ్‌ ఏసీ అయితే 660, సెకండ్‌ ఏసీ అయితే 910, ఫస్ట్‌ ఏసీ అయితే రూ.1,551. ఈ లెక్కన స్లీపర్‌ కోచ్‌ కంటే థర్డ్‌ ఏసీ 100 శాతానికి పైగా, సెకండ్‌ ఏసీ 200 శాతంపైగా, ఫస్ట్‌ ఏసీ ఏకంగా 400–500 శాతం అధికం. 

రైల్వే శాఖ స్లీపర్‌ కోచ్‌లను తగ్గిస్తూ ఏసీ కోచ్‌లను పెంచడం వెనుక లోగట్టు అధిక రాబడే అని ఈ గణాంకాలు బట్టబయలు చేస్తున్నాయి. రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 22 వేల రైళ్లను నిర్వహిస్తుండగా వాటిలో రోజుకు సగటున 13,500 రైళ్లు నిర్వహిస్తోంది. వాటిలో రోజూ 2.4 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఆ లెక్కన జనరల్, స్లీపర్‌ కోచ్‌లను తగ్గించి ఏసీ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండేట్టు చేస్తే టికెట్ల ద్వారా భారీ రాబడి సాధించవచ్చనద్ని రైల్వే శాఖ ఉద్దేశం. అంటే కేంద్ర ప్రభుత్వానికి లాభం.. సామా­న్య ప్రయాణికులకు భారం. ఇదే రైల్వే శాఖ లెక్క.

అమ్మో వందే భారత్‌ 
అత్యధిక చార్జీలతో పూర్తిగా ఏసీ కోచ్‌లతో నిర్వహించే వందే భారత్‌ రైళ్లకే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తుండటం సామాన్యులకు భారంగా మారింది. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లన్నీ వందేభారత్‌ రైళ్లేనని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే శాఖ ప్రస్తుతం దేశంలో 41 వందేభారత్‌ రైళ్లను నిర్వహిస్తోంది. వాటిలో ఏపీలో నాలుగు నిర్వహిస్తున్నారు. 

కాగా 2030 నాటికి 800 వందేభారత్‌ రైళ్లను పట్టాలు ఎక్కించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని 40 వేల కోచ్‌లను కూడా వందేభారత్‌ కోచ్‌ల స్థాయికి ఆధునికీకరిస్తామని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ రైళ్లను నిర్ధిష్ట సమయంలో నడిపేందుకు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.

కాళ్లు కింద మోపలేం 
విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే గౌహతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం కిక్కిరిసి విశాఖపట్నం చేరుకుంది. ఈ రైలులో జనరల్, స్లీపర్‌క్లాస్‌లలో కనీసం కాలు మోపేందుకు కూడా ఖాళీ లేదు. ఈ రైలులో జనరల్‌4, స్లీపర్‌7, ఏసీ కోచ్‌లు 8 ఉన్నాయి. జనరల్‌ కోచ్‌లలో 200 మంది చొప్పున ఉన్నారు. 

స్లీపర్‌ కోచ్‌లో కేవలం 78 బెర్తుల చొప్పున మాత్రమే ఉన్నప్పటకీ రెట్టింపు ప్రయాణికులు కనిపించారు. డిబ్రూగడ్‌–కన్యాకుమారి వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఇదే విధంగా కిక్కిరిసి వెళ్లింది. ఈ రైలులో జనరల్‌ బోగీలు మూడు మాత్రమే ఉన్నాయి. ఉత్తరాంద్ర వాసుల ప్రధాన రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న రెండు జనరల్‌ కోచ్‌లలో పరిస్థితి కనీసం కాలు మోపలేని విధంగా ఉంది.    

రెండు బోగీల్లో వెయ్యి మంది!  
ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే తిరుపతి నగరం మీదుగా రోజూ పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైళ్లలోని జనరల్‌ బోగీలన్నీ కిక్కిరిసి ఉంటాయి. హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైల్లోని జనరల్‌ బోగీలో అయితే ఒకరిపై ఒకరు కూర్చొని, నిల్చొని ప్రయాణిస్తుండటం రోజూ కనిపిస్తుంది. 

బెంగళూరు నుంచి కాటా్పడి, తిరుపతి, రేణిగుంట, ఒంగోలు, విజయవాడ, శ్రీకాకుళం, పలాస మీదుగా హౌరాకు చేరుకునే ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసి నడిచింది. ఇందులో జనరల్‌ బోగీలు కేవలం రెండే ఉన్నాయి. ఈ రెండు బోగీల కెపాసిటీ 180 మంది. మంగళవారం సుమారు వెయ్యి మంది ప్రయాణించి ఉండొచ్చని అధికారుల అంచనా. అనేక మంది ఒంటి కాలుపై నిల్చుని ఉండటం కనిపించింది.

ఉన్న వాటికీ ఎసరు 
ఏలూరులో మంగళవారం ఈస్ట్‌కోస్ట్‌ రైలు మధ్యాహ్నం 3.50 గంటలకు వచి్చంది. రెండే జనరల్‌ బోగీలున్నాయి. అప్పటికే ఆ బోగీ కిక్కిరిసి ఉంది. ఒక్క ఏలూరులోనే ఈ రెండు జనరల్‌ బోగీల్లో 60 మంది ఎక్కారు. ఒక్కో బోగీలో 150–200 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. 

బాత్‌రూమ్‌ల వద్ద, నడిచే మార్గంలో, వాకిట్లో కూర్చున్నారు. మరి కొంతమంది రెండు బోగీలను కలిపే మార్గంలో టాయిలెట్‌లను ఆనుకుని కూడా కూర్చోనుండటం కని్పంచింది. కరోనా సమయంలో రద్దు చేసిన పలు ప్యాసింజర్‌ రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదు. మహిళలు, దివ్యాంగులు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఉండే బోగీ ఇప్పుడు కనిపించడం లేదు. ఉన్న రైళ్లనూ రద్దు చేస్తున్నారు.


ఇదీ లెక్క
రాష్ట్రంలో రోజూ సగటున ప్రయాణిస్తున్న రైళ్లు 340350

ఇందులో విజయవాడ మీదుగా వెళ్తున్న రైళ్లు 280

విజయవాడ నుంచి రోజూ రాకపోకలుసాగిస్తున్న ప్రయాణికులు 1,00,000

మొత్తం ప్రయాణికుల్లో జనరల్‌ బోగీల్లో ప్రయాణిస్తున్నవారు 40%

స్లీపర్‌ క్లాసులో ప్రయాణిస్తున్నవారు 20%

ఒక రైల్లో  జనరల్‌ బోగీలు 10%

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement