
గజ్వేల్‌లోని సరుకు రవాణా యార్డు
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ రైల్వేస్టేషన్‌ను సరుకు రవాణాకు మినీ హబ్‌గా మార్చేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సిద్దిపేట మొదలు గజ్వేల్ వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే వివిధ పంటలతోపాటు పండ్లు, పాలు, చేపలను ఇతర ప్రాంతాలకు రైల్వే ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి గూడ్స్ రైళ్ల ద్వారా వాటిని తరలించాలంటే తొలుత సనత్‌నగర్ రైల్వే యార్డుకు చేర్చాల్సి వస్తోంది.
దీంతో ఎక్కువ మంది వ్యాపారులు లారీల ద్వారానే ఇతర ప్రాంతాలకు సరుకు పంపుతున్నారు. తాజాగా రైల్వే ద్వారా సరుకు రవాణాకు గజ్వేల్‌ను ఎంపిక చేయడంతో దక్షిణమధ్య రైల్వే, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మధ్య ఇందుకు సంబంధించి అవగాహన కుదిరింది. ఇటీవల భేటీ అయిన రెండు విభాగాల అధికారులు.. ఇందుకుగల డిమాండ్‌పై చర్చించారు.
నిత్యం 500కుపైగా లారీలు: పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతాలైన సిద్దిపేట, గజ్వేల్‌లలో వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, కూరగాయలు, పప్పుధాన్యాలు బాగా పండుతాయి. పాడి కూడా విస్తారంగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి ప్రస్తుతం నిత్యం 500కుపైగా లారీల్లో సరుకును కొందరు వ్యాపారులు సనత్‌నగర్‌కు తరలించి అక్కడి యార్డు ద్వారా గూడ్స్ రైళ్లలోకి తరలిస్తున్న ప్పటికీ ఖర్చు ఎక్కువగా అవుతోంది. మరోవైపు రైల్వేశాఖ ఇటీవల కొన్ని నిబంధనలను సడలించి విడివిడిగా లారీల్లో సరుకు తెచ్చినా కూడా వ్యాగన్‌లను కేటాయిస్తోంది.
తాజాగా గజ్వేల్ స్టేషన్ వద్ద సరుకు రవాణాకు వీలుగా రైల్వేశాఖ పెద్ద యార్డును సిద్ధం చేసింది. ఇటీవలే హైదరాబాద్ డీఆర్‌ఎం శరత్‌చంద్రాయణ్ ఇతర అధికారులతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి యార్డు వరకు లారీలు వచ్చేలా రోడ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యాయి. వ్యాపారులతో మాట్లాడి సరుకు ఇండెంట్ ఇవ్వాలని ఎఫ్‌సీఐని రైల్వే అధికారులు కోరారు. ఇండెంట్ రాగానే గూడ్సు రైళ్లు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment