
సాక్షి, రాజమహేంద్రవరం: రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని నిర్ణయించింది. ఈ పనిని రైల్వే రక్షక దళానికి (ఆర్‌పీఎఫ్) అప్పగించింది. తోటి ప్రయాణికుల వలన ఎదురవుతున్న సమస్యలపై రైల్వే మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. వీటి ప్రకారం ఇక నుంచి రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయడాన్ని నిషేధించారు. ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడకూడదు.
చదవండి: (చట్టాలు చేయకుండా నిలువరించలేరు)
రాత్రి 10 గంటల తర్వాత బోగీలో అన్ని లైట్లూ ఆర్పేయాలి. ఈ నిబంధనలను పాటించని ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తోటి ప్రయాణికుల వలన ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా 139 నంబరుకు ఫోన్ చేస్తే చాలు.. అలా ఇబ్బందికరంగా ప్రవర్తించే వారిపై ఆర్‌ఫీఎఫ్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుంటారు. దీనిపై బోగీల్లోని ఆర్‌ఫీఎఫ్ సిబ్బంది, టికెట్ చెకర్లు, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్ సహా ఇతర రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులు ఇతరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండేలా వీరు అప్రమత్తం చేస్తుంటారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే ఆ రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది.
చదవండి: (TTD: ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లు విడుదల)
ఫోన్ కాల్ చాలు.. జైలుకు పంపేస్తాం
బోగీల్లో తోటి ప్రయాణికుల వలన ఎటువంటి చిన్న అసౌకర్యం కలిగినా చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు.. న్యూసెన్స్ కేసు నమోదు చేసి, జైలుకు పంపుతాం.
– సైదయ్య, ఆర్‌ఫీఎఫ్ ఇన్‌స్పెక్టర్, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment