రైల్వే బ్రిడ్జిలకు రక్షణ కవచం | Railway Department introduced Bridge Management System | Sakshi
Sakshi News home page

రైల్వే బ్రిడ్జిలకు రక్షణ కవచం

Published Thu, Dec 22 2022 6:04 AM | Last Updated on Thu, Dec 22 2022 6:04 AM

Railway Department introduced Bridge Management System - Sakshi

సాక్షి, అమరావతి: రైల్వే వంతెనలపై ప్రమాదా­లను నివారించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కా­ర్యాచరణకు ఉపక్రమించింది. భారీ వర్షాలు, వర­దల సమయంలో రైల్వే వంతెనలు, సమీపంలోని ట్రాక్‌ల భద్రత చర్చనీయాంశంగా మారు­తోంది. అందుకే 24 గంటలూ రైల్వే వంతెన­లతోపాటు నది, సముద్ర తీరాలకు సమీపంలోని ట్రాక్‌ల భద్రతను పర్యవేక్షించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక సమా­చార సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసేలా బ్రిడ్జ్‌ మేనేజ్మెంట్‌ సిస్టం(బీఎంఎస్‌)ను ప్రవేశపెట్టింది. 

వెబ్‌ ఆధారిత అప్లికేషన్‌ సాయంతో..
బీఎంఎస్‌ అనేది వెబ్‌ ఆధారిత సమాచార సాంకేతిక వ్యవస్థ. దేశంలోని రైల్వే వంతెనలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని 24/7 విధానంలో ఇది అందుబాటులో ఉంచుతుంది. రైల్వే వంతెనల డిజైన్, అధికారుల తనిఖీల వివరాలు, తాజా ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచుతూ ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు దోహదప­డుతుంది. వంతెనల వద్ద నీటిమట్టం, ప్రవాహ వేగం, ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. రైల్వే అధికారులను ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ల ద్వా­రా అప్రమత్తం చేస్తూనే ఉంటుంది.

బీఎంఎస్‌ విధానానికి అనుబంధంగా మరికొన్ని అప్లికేషన్ల­ను కూడా రైల్వే శాఖ జోడించింది. ‘ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ రోలింగ్‌ స్టాక్‌ (ఓఎంఆర్‌ఎస్‌), ‘వీల్‌ ఇంపాక్ట్‌ లోడ్‌ డిటెక్టర్‌ (డబ్ల్యూఐఎల్‌డీ) పేరుతో రెండు వ్యవస్థలను బీఎంఎస్‌కు అనుబంధంగా ప్రవేశపెట్టారు. నదీ ప్రవాహ వేగం, వంతెనల వద్ద ప్రవాహ వేగం, నీటిమట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎప్‌ఐడీ) ట్యాగ్‌లను ఏర్పాటు చేశారు.

వాటితోపాటు గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌), హాట్‌ బాక్స్‌ డిటెక్టర్‌ (బీబీడీ), మెషిన్‌ విజన్‌ ఇన్స్‌పెక్షన్‌ సిస్టం (ఎంబీఐఎస్‌)లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. తద్వారా వర్షాలు, వరదలు ముంచెత్తిన సమయంలో నది, సముద్ర తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న రైల్వే ట్రాకుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దాంతో ఆ మార్గంలో రైళ్లను అనుమతించవచ్చా లేదా అనే దానిపై అధికారులు తక్షణం నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

మొదటి దశలో దేశంలో 305.. రాష్ట్రంలో 5 
బీఎంఎస్‌ కింద మొదటి దశలో దేశంలో 305 రైల్వే వంతెలను, ట్రాక్‌లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 5 వంతెనలు ఉన్నాయి. దేశంలో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 1.44 లక్షల రైల్వే వంతెనలు ఉండగా.. వాటిలో మేజర్‌ వంతెనలు 37,689 ఉన్నాయి. ఎంపిక చేసిన 305 వంతెనలను మొదటి దశలో బీఎంఎస్‌ వ్యవస్థ కిందకు రైల్వే శాఖ తీసుకువచ్చింది. ఇందులో ఏపీలో 5 వంతెనలు ఉన్నాయి.

రాష్ట్రంలో మొత్తం 678 రైల్వే వంతెనలు ఉండగా వాటిలో మేజర్‌ వంతెనలు 31 ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, అనకాపల్లి సమీపంలోని శారదా నదిపై వంతెన, రాజమహేంద్రవరంలో గోదావరి వంతెన, విజయవాడ కృష్ణా నదిపై వంతెన, నెల్లూరులోని పెన్నా నదిపై నిర్మించిన వంతెన ఉన్నాయి.

అదేవిధంగా శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని దాదాపు 150 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణను రైల్వే శాఖ బీఎంఎస్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. భారీ వర్షాలు, వరదల సమయంలో ఈ రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో రైళ్లను నిలిపివేయాల్సి వస్తోంది. అందుకే వాటిని ఎంపిక చేసినట్టు రైల్వేవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని రైల్వే వంతెనలు బీఎంఎస్‌ విధానం పరిధిలోకి చేరనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement