BMS
-
రైల్వే బ్రిడ్జిలకు రక్షణ కవచం
సాక్షి, అమరావతి: రైల్వే వంతెనలపై ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. భారీ వర్షాలు, వరదల సమయంలో రైల్వే వంతెనలు, సమీపంలోని ట్రాక్‌ల భద్రత చర్చనీయాంశంగా మారుతోంది. అందుకే 24 గంటలూ రైల్వే వంతెనలతోపాటు నది, సముద్ర తీరాలకు సమీపంలోని ట్రాక్‌ల భద్రతను పర్యవేక్షించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసేలా బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టం(బీఎంఎస్)ను ప్రవేశపెట్టింది. వెబ్ ఆధారిత అప్లికేషన్ సాయంతో.. బీఎంఎస్ అనేది వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక వ్యవస్థ. దేశంలోని రైల్వే వంతెనలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని 24/7 విధానంలో ఇది అందుబాటులో ఉంచుతుంది. రైల్వే వంతెనల డిజైన్, అధికారుల తనిఖీల వివరాలు, తాజా ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచుతూ ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు దోహదపడుతుంది. వంతెనల వద్ద నీటిమట్టం, ప్రవాహ వేగం, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. రైల్వే అధికారులను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. బీఎంఎస్ విధానానికి అనుబంధంగా మరికొన్ని అప్లికేషన్లను కూడా రైల్వే శాఖ జోడించింది. ‘ఆన్లైన్ మానిటరింగ్ ఆఫ్ రోలింగ్ స్టాక్ (ఓఎంఆర్ఎస్), ‘వీల్ ఇంపాక్ట్ లోడ్ డిటెక్టర్ (డబ్ల్యూఐఎల్‌డీ) పేరుతో రెండు వ్యవస్థలను బీఎంఎస్‌కు అనుబంధంగా ప్రవేశపెట్టారు. నదీ ప్రవాహ వేగం, వంతెనల వద్ద ప్రవాహ వేగం, నీటిమట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎప్ఐడీ) ట్యాగ్‌లను ఏర్పాటు చేశారు. వాటితోపాటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), హాట్ బాక్స్ డిటెక్టర్ (బీబీడీ), మెషిన్ విజన్ ఇన్స్పెక్షన్ సిస్టం (ఎంబీఐఎస్)లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. తద్వారా వర్షాలు, వరదలు ముంచెత్తిన సమయంలో నది, సముద్ర తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న రైల్వే ట్రాకుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దాంతో ఆ మార్గంలో రైళ్లను అనుమతించవచ్చా లేదా అనే దానిపై అధికారులు తక్షణం నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మొదటి దశలో దేశంలో 305.. రాష్ట్రంలో 5 బీఎంఎస్ కింద మొదటి దశలో దేశంలో 305 రైల్వే వంతెలను, ట్రాక్‌లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 5 వంతెనలు ఉన్నాయి. దేశంలో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 1.44 లక్షల రైల్వే వంతెనలు ఉండగా.. వాటిలో మేజర్ వంతెనలు 37,689 ఉన్నాయి. ఎంపిక చేసిన 305 వంతెనలను మొదటి దశలో బీఎంఎస్ వ్యవస్థ కిందకు రైల్వే శాఖ తీసుకువచ్చింది. ఇందులో ఏపీలో 5 వంతెనలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 678 రైల్వే వంతెనలు ఉండగా వాటిలో మేజర్ వంతెనలు 31 ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, అనకాపల్లి సమీపంలోని శారదా నదిపై వంతెన, రాజమహేంద్రవరంలో గోదావరి వంతెన, విజయవాడ కృష్ణా నదిపై వంతెన, నెల్లూరులోని పెన్నా నదిపై నిర్మించిన వంతెన ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని దాదాపు 150 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణను రైల్వే శాఖ బీఎంఎస్ పరిధిలోకి తీసుకువచ్చింది. భారీ వర్షాలు, వరదల సమయంలో ఈ రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో రైళ్లను నిలిపివేయాల్సి వస్తోంది. అందుకే వాటిని ఎంపిక చేసినట్టు రైల్వేవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని రైల్వే వంతెనలు బీఎంఎస్ విధానం పరిధిలోకి చేరనున్నాయి. -
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
‘సింగరేణి సైరన్’తో బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్
గోదావరిఖని (రామగుండం): సింగరేణి ప్రాంతంలో పట్టుకు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. త్వరలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో పార్టీకి కీలకంగా ఉన్న నాయకుడు.. సింగరేణి సైరన్‌గా గుర్తింపు పొందిన నేతను తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం బీజేపీకి షాకిచ్చిలా ఉంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే బీజేపీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య త్వరలో తన సొంతగూటికి చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్ మేరకే ఆయన బీఎంఎస్‌ను వీడారు. మల్లయ్య టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఒంటిచేతితో యూనియన్ను నడిపించాడు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సింగరేణివ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 2003 నుంచి సంఘాన్ని ముందుండి నడిపించారు. సుమారు 16 ఏళ్లు టీబీజీకేఎస్‌లో పనిచేసిన మల్లయ్య నాయకత్వ విభేదాలతో సంఘానికి దూరమయ్యారు. టీఆర్ఎస్ నుంచి కూడా హామీ రాకపోవడంతో పార్టీని వీడారు. అనంతరం 2019 సెప్టెంబర్ 30న బీజేపీ అనుబంధ బీఎంఎస్ (సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్)లో చేరారు. అక్కడ కూడా మల్లయ్య అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇచ్చి బీఎంఎస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మల్లయ్య ముందుకెళ్తున్నారు. అయితే బీఎంఎస్‌లో గుర్తింపు రాకపోవడం, తాను ఆశించిన జేబీసీసీఐ సభ్యతం రాకపోవడంతో దీంతో మల్లయ్య అసంతృప్తిలో ఉన్నారు. ఈ కారణంగా మూడు నెలలుగా సంఘం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ అసంతృప్తిని గ్రహించి టీఆర్ఎస్ మళ్లీ ఆహ్వానం పలికింది. ఈ క్రమంలోనే కెంగర్ల మల్లయ్యను తిరిగి టీబీజీకేఎస్, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఇటీవల టీఆర్ఎస్ అధిష్టానంతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ యువ, అధినాయకుడు కచ్చితమైన హామీ ఇవ్వడంతో శుక్రవారం తెల్లవారుజామున బీఎంఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీఎంఎస్‌కు రాజీనామా చేసిన మల్లయ్య గోదావరిఖనిలో తన అనుచరులతో సమావేశమై టీఆర్ఎస్లో చేరే విషయం చర్చించారు. త్వరలో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు కోసం ఇప్పుడే వ్యూహం సిద్ధం చేశారు. -
23న బీఎంఎస్ మహా ప్రదర్శన
గోదావరిఖని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 23న కార్మిక మహాప్రదర్శన నిర్వహిస్తున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ టుంగుటూరి కొమురయ్య తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం 2008 అమలు చేయాలని, అంగన్వాడీ, ఆశ, ఇతర స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని కోరారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు బీడీ కార్మికులకు కల్పించి కార్మికులను కాపాడాలని, పీఎఫ్ కనీస పెన్షన్ రూ.3 వేలు చెల్లించాలని, ఏడో∙వేతన సంఘ సిఫారసులను కార్మికులకు అనుకూలంగా సవరించి అమలు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలన్నారు. సిర్పూర్మిల్లు, ఏపీ రేయాన్సు, నిజాం షుగర్సు, ఇతర మూతపడిన పరిశ్రమలను వెంటనే తెరిపించాలని, వివిధ కార్మిక సంక్షేమ ట్రైపార్టీయేటెడ్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ రవాణా వాహనాలకు పెంచిన 50 శాతం ఇన్సూరెన్స్ రేట్లను తగ్గించాలని, రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బిల్–2015ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గొట్టెముక్కుల నారాయణచారి, దిగుట్ల లింగయ్య, కంది శ్రీనివాస్, శివరాత్రి సారయ్య, అంబటి మల్లికార్జున్, బంక రాజేశ్, కట్కూరి విజేందర్‌రెడ్డి, కొర్రి ఓదెలు, కజాపురం రమేశ్, సంకె అంజయ్య, అభినాష్, బొక్క వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎస్ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. ఇప్పటికే ఏడాది ఆలస్యమవుతున్న ఎన్నికల కసరత్తులో అటు యూనియన్లు, ఇటు యాజమాన్యం తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న అన్ని యూనియన్ల ప్రతినిధులతో రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. యాజమాన్యం, యూనియన్ ప్రతినిధుల నుంచి ఓటర్లు, ఎన్నికల ఏర్పాట్లు తదితర వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఈ నెల 20న మరోమారు సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ నెలాఖరున లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుండగా యూనియన్లు ఇప్పటి నుంచే ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్), ఐఎన్టీయూసీ(పులి గుర్తు), ఐఎన్టీయూసీ(త్రాచు గుర్తు), భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్), కార్మిక పరిషత్(టీఎన్టీయూసీ), యునెటైడ్ వర్కర్స్ యూనియన్లు ఈ సారి పోటీకి సిద్ధమవుతున్నాయి. ఏడాది ఆలస్యంగా ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. 2013 జనవరి నుంచి ఈయూ గుర్తింపు సంఘంగా కొనసాగుతోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అనేక కారణాలతో కాలయాపన జరిగింది. మొత్తం 57,700 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. 2015 డిసెంబర్ 31 నాటికి ఆర్టీసీలో ఉద్యోగం చేపట్టి ఆరు నెలలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నారు. ఎన్నికలకు పలు అడ్డంకులు... ఆర్టీసీలో అంతర్గత సమస్యలు ప్రభావం చూపకుంటే గుర్తింపు సంఘం ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందని పలు యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు. యూనియన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ అద్దె బస్సుల టెండర్లను ఈ నెల 5న యాజమాన్యం ఆమోదించనుంది. ఒప్పందం ప్రకారం కార్మికులకు గత ఏడాది డిసెంబర్ 23న ఇవ్వాల్సిన బకాయిలును యాజమాన్యం ఇంత వరకు చెల్లించలేదు. మరోవైపు సంక్రాంతికి ముందు జనవరి 8న పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంది. అద్దె బస్సులు, పలు సమస్యలపై ఈ నెల 4న ఈయూ అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహించనుంది. ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్‌ఎంయూలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలతో ముడిపడి ఉండటం గమనార్హం.