![31 Railway Stations Closed In South Central Railway - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/30/555.jpg.webp?itok=Jwt1BcBr)
సాక్షి, హైదరాబాద్: ఆదాయం లేని కొన్ని రైల్వే స్టేషన్లను మూసేయాలని, రోజులో ఒకట్రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగే స్టేషన్లపై వేటు వేయాలని రైల్వే నిర్ణయించింది. ఆదాయం కంటే నిర్వహణ ఖర్చే అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 31 స్టేషన్లు మూతపడనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 16, హైదరాబాద్ డివిజన్ పరిధిలో 7 స్టేషన్లు ఉన్నాయి. గుంతకల్ డివిజన్ పరిధిలో 3, గుంటూరు డివిజన్ పరిధిలో 4, నాందేడ్ డివిజన్ పరిధిలో ఒకటి ఉన్నాయి.
ఇవీ కారణాలు..
పెద్ద స్టేషన్లతో పాటు కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో కూడా రైల్వే శాఖ చిన్న స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ ఉండరు. సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఉండదు. ఒక చిన్న గది, చిన్న బుకింగ్ సెంటర్ మాత్రమే ఉంటుంది. టికెట్లను కూడా ప్రైవేటు సిబ్బందే జారీ చేస్తుంది. వారు కూడా రోజులో కొంత సమయమే ఉండి టికెట్లు జారీ చేసి వెళ్లిపోతారు. ఒకటి లేదా రెండు ప్యాసింజర్ రైళ్లు అర నిమిషం ఆగి వెళ్లిపోతాయి. ఇలాంటి స్టేషన్లలో కొన్నింటికి పెద్దగా ప్రయాణికుల నుంచి స్పందన ఉండట్లేదని తాజాగా రైల్వే గుర్తించింది. సాధారణంగా సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం, లేదా లక్ష మంది ప్రయాణికులు ఉంటే స్టేషన్‌ను నిర్వహిస్తారు. అంతకంటే తక్కువ నమోదవుతుంటే వాటి నిర్వహణ అనవసరమని రైల్వే భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment