ఇకపై వారానికి 4 రోజులు కరీంనగర్‌–తిరుపతి రైలు | Sakshi
Sakshi News home page

ఇకపై వారానికి 4 రోజులు కరీంనగర్‌–తిరుపతి రైలు

Published Sat, Dec 23 2023 4:34 AM

Bandi Sanjay Met Railway Minister Ashwini Vaishnav - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్‌ నుంచి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో 4 రోజులపాటు నడవనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రైల్వే పెండింగ్‌ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా కరీంనగర్‌ నుంచి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని కోరారు.బండి సంజయ్‌ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆది, గురువారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలును మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్‌ – హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్‌ కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి కొత్త రైల్వే లేన్‌ పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా రైల్వే మంత్రిని బండి సంజయ్‌ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్‌ చేసి త్వరగా ఫైనల్‌ లోకేషన్‌ సర్వే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.  

జమ్మికుంటలో పలు రైళ్ల హాల్ట్‌  
ప్రజల సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జమ్మికుంట స్టేషన్‌లో ఆపే (హాల్ట్‌) విధంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ రైల్వే మంత్రిని కోరారు. సికింద్రాబాద్‌ – గోరక్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12590–89), యశ్వంతపూర్‌ – గోరక్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12592–91 ), హైదరాబాద్‌ – న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (12723–23), సికింద్రాబాద్‌ – పట్నా దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12791–92), చెన్నై – అహ్మదాబాద్‌ నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12656–55) రైళ్లను జమ్మికుంట స్టేషన్‌లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన రైల్వే మంత్రి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంట స్టేషన్‌లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement