సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్ చార్జి రూ.140. వెళ్లి రావటానికి రూ.280. రెండు రోజులకు రూ.560. అదే రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ.440 చెల్లిస్తే సరి. రెండు రోజుల బస్ చార్జి కంటే చవకగా, ఏకంగా నెలరోజుల పాటు ప్రయా ణించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది.
ఈ నెల మూడో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్–సిద్దిపేట ప్యాసింజర్ రైలు ఆ ప్రాంత వాసులకు కారు చవక ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య 117 కి.మీ. ప్రయాణానికి రైలు టికెట్ ధర కేవలం రూ.60 మాత్రమే. ఇప్పుడు దానిని మరింత చవకగా మారుస్తూ నెలవారీ సీజన్ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
మామూలు టికెట్ ప్రకారం.. వెళ్లి రావటానికి రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెల రోజులకు రూ.3,600 అవుతుంది. కానీ, నెల రోజుల సీజన్ టికెట్ కొంటే కేవలం రూ.440తో నెల రోజుల పాటు ఎన్ని ట్రిప్పులైనా తిరగొచ్చు. ఇంతకాలం బస్సులు, ప్రైవేటు వాహనాలకు ఎక్కువ మొత్తం చెల్లిస్తూ ప్రయాణిస్తున్న నిరుపేద వర్గాలకు ఇది పెద్ద వెసులుబాటుగా మారనుంది. స్పెషల్ రైలు సర్వీసుగా సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య ఈ రైలు సేవలు ప్రారంభమైనప్పటికీ, సీజన్ టికెట్‌ను జారీ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
ప్రత్యేక రైలులో ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలను అమలు చేస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వీసుగా మార్చగానే ఆర్డినరీ టికెట్ ధరలను వర్తింపచేస్తారు. ఈ ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న టికెట్ ధర రూ.60 నుంచి రూ.50కి తగ్గుతుంది. అయితే దీనితో సంబంధం లేకుండా ఇప్పుడు సీజన్ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. 101 కి.మీ. నుంచి 135 కి.మీ. వరకు ప్రయాణ దూరానికి సీజన్ టికెట్ ధర రూ.440 ఉంటుంది.
సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు ప్రయాణ దూరం 117 కి.మీ.గా ఉంది. దీంతో ఈ టికెట్ ధరను రూ.440 ఖరారు చేశారు. నెల తర్వాత దానిని మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ –సిద్దిపేట మధ్య ఇతర స్టేషన్ల వరకు కూడా ఈ సీజన్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. ఆయా స్టేషన్ల మధ్య దూరం ఆధారంగా ఆ టికెట్ ధర ఉంటుంది.
ట్రిప్పు వేళలు ఇలా..
♦ సిద్దిపేటలో రైలు (నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది.
♦ తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది.
♦ తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటుంది.
♦ సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేట కు రాత్రి 8.45 గంటలకు చేరుకుంటుంది.
♦ హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కేవలరీ బ్యారెక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చ ల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment