ఇక రైళ్లు ఢీ కొట్టుకోకుండా ‘టీకాస్‌’తో చెక్‌ | Green Signal To Preventing Train Collision System | Sakshi
Sakshi News home page

ఇక రైళ్లు ఢీ కొట్టుకోకుండా ‘టీకాస్‌’తో చెక్‌

Published Sun, Nov 1 2020 6:31 AM | Last Updated on Sun, Nov 1 2020 6:31 AM

Green Signal To Preventing Train Collision System - Sakshi

రైలుబోగీలో టీకాస్‌ పరికరం

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు దశాబ్దం నిరీక్షణ తర్వాత రైల్వే శాఖ.. రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనకుండా ఉపయోగపడే యాంటీ కొల్యూజన్‌ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి ముథ్కేడ్‌–సికింద్రాబాద్‌ సెక్షన్‌ పరిధిలోకి వచ్చే ఉమ్రి–సివన్‌గావ్‌ స్టేషన్ల మధ్య 21.5 కి.మీ. నిడివిలో దీన్ని ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ అధీనంలోని పరిశోధన సంస్థ ఆర్‌డీఎస్‌ఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేసింది. ట్రైన్‌ కొల్యూజన్‌ అవాయిడెన్స్‌ సిస్టం (టీకాస్‌)గా పేర్కొనే ఈ పరిజ్ఞానాన్ని దేశంలో తొలుత దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్‌–వాడి, వికారాబాద్‌–బీదర్‌ సెక్షన్ల మధ్య పరీక్షించారు. దాదాపు పదేళ్లుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

ఈ వ్యవస్థలో రకరకాల మార్పులు చేస్తూ వచ్చిన అధికారులు ఈ పరిజ్ఞానాన్ని మాత్రం అందుబాటులోకి తేలేదు. పలు సందర్భాల్లో పార్లమెంటులో ఈ అంశం చర్చకు కూడా వచ్చింది. కాగా, ఇంతకాలం నిరీక్షణ తర్వాత దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఎట్టకేలకు రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ప్రయోగాత్మకంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉమ్రి–సివన్‌గావ్‌ స్టేషన్ల మధ్య దీన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గం సింగిల్‌ లైన్‌తో ఉండటంతో పాటు ఇక్కడ రైళ్ల రాకపోకలు కూడా తక్కువ. అందుకే పరీక్షలకోసం అనువుగా ఉంటుందని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి ఇది వినియోగంలోకి వచ్చింది. 

స్టేషన్ల వద్ద టీకాస్‌ టవర్‌ 
ఎదురెదురుగా వస్తే హెచ్చరిస్తుంది.. 
రైలు లోకోపైలట్‌ (డ్రైవర్‌) సిగ్నల్‌ను విస్మరించి నా, బ్రేకులు వేయకపోయినా, నిర్ధారిత వేగాన్ని మించి రైలు దూసుకుపోతున్నా ఈ వ్యవస్థ వెంటనే హెచ్చరిస్తుంది. అదే సమయంలో ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే రెండు రైళ్ల లోకోపైలట్లకు సంకేతాలు అంది అప్రమత్తం అయ్యేందుకు అవకాశం కలుగుతుంది. అప్పటికీ బ్రేకులు వేయని పక్షంలో ఆటోమేటిక్‌గా రైళ్లు నిలిచిపోతాయి. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ రెండు స్టేషన్ల మధ్య విద్యుత్తు సరఫరా సౌకర్యంతో కూడిన టీకాస్‌ యూనిట్లు సిద్ధం చేశారు. 40 మీటర్ల ఎత్తుతో టీకాస్‌ టవర్లు, అనుబంధ కేబుల్స్‌ ఏర్పాటు చేశారు.

స్టేషన్లను ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లతో అనుసంధానించారు. రేడియో కమ్యూనికేషన్‌ వ్యవస్థ, టెస్ట్‌ రూమ్‌ల వద్ద ఎన్‌ఎంఎస్‌ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. అంటే స్టేషన్లు, ట్రాక్‌ మొత్తం టీకాస్‌తో అనుసంధానమవుతుంది. రైలు ఇంజిన్లపై కూడా టీకాస్‌ పరికరాలుంటాయి. అవన్నీ అనుసంధానమై ఉంటాయి. ఇక్కడ వచ్చే ఫలితాలను పరిశీలించాక క్రమంగా ఈ పరిజ్ఞానాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. ముందుగా మన్మాడ్‌–నాందేడ్‌–సికింద్రాబాద్‌–డోన్‌–గుంతకల్, బీదర్‌–వర్లి–పర్బని సెక్షన్ల మధ్య 1,200 కి.మీ. మేర దీన్ని ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement