ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల అంగీకారం
కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఆదరణ పెరుగుతుండటంతో ఇకపై రాయితీలు నిలిపివేసినా సమస్య ఉండదని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీ పథకం ముగిసిన తర్వాత రాయితీలను నిలిపివేయొచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రతిపాదనకు కంపెనీలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు. బ్యాటరీ చార్జింగ్, స్వాపింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై పరిశ్రమ వర్గాలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయం చెప్పారు.
ఈవీల వినియోగంతో ఖర్చులపరంగా ఒనగూరే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ఆయన తెలిపారు. బ్యాటరీల మారి్పడికి ఉమ్మడిగా వనరులు వినియోగించుకోవడం కావచ్చు లేదా సొంత బ్యాటరీలతోనే వాహనాలను విక్రయించడం కావచ్చు ఎటువంటి వ్యాపార విధానాలనైనా పాటించేందుకు వాహనాల తయారీ సంస్థలకు స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్, భారతీయ ప్రమాణాల బ్యూరో, అంకుర సంస్థలు, టాటా..మెర్సిడెస్ బెంజ్ తదితర వాహనాల కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
ఫేమ్ ఇండియా, పీఎం ఈ–డ్రైవ్ తదితర స్కీముల ద్వారా విద్యుత్తు వాహనాల విక్రయాలను పెంచే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2022లో భారత్‌లో మొత్తం ఈవీల విక్రయాలు 10 లక్షలుగా నమోదయ్యాయి. దేశీయంగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటర్స్ అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ ఈవీ దిగ్గజాలను ఆకర్షించేందుకు కేంద్రం గతేడాది మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రవేశపెట్టింది. దీని కింద కనీసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడితో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే సంస్థలకు సుంకాలపరంగా కొన్ని మినహాయింపులను ప్రతిపాదించింది. అలాగే ఫేమ్–2 స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 10,763 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment