సాక్షి, న్యూఢిల్లీ : 2030 సంవత్సరం కల్లా దేశంలో అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయని, అప్పటికీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్క పెట్రోలు, ఒక్క డీజిల్ కారు కూడా ఉండదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్ గత కొంతకాలంగా గర్వంగా చెబుతూ వస్తున్నారు. భారతీయులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వల్ల చమురు వినియోగం తగ్గి ఏటా 600 కోట్ల డాలర్ల సొమ్ము మిగులుతుందని ‘నీతి ఆయోగ్’ సంస్థ ఓ నివేదికలో తెలిపింది. అంతేకాకుండా రానున్నదంతా ఎలక్ట్రానిక్ వాహనాల యుగమేనని ఇటు భారత్ మీడియాతోపాటు, అంతర్జాతీయ మీడియాలో ఇటీవల తరచుగా వార్తలను చూస్తున్నాం.
ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో రాణించడం భారత్ లాంటి దేశానికి సాధ్యమయ్యే పనేనా? అందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తోంది? తీసుకుంటున్న చర్యలేమిటీ? ఆ చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఆటోమొబైల్ ఇంజన్ కార్ల నుంచి ఎలక్ట్రానిక్ వాహనాల రంగానికి మారడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ విధాన దక్పథం పూర్తిగా మారాలి. దృష్టినంతా ఎలక్ట్రిక్ వాహనాల రంగంపై కేంద్రీకరించాలి. అందులో కేంద్రం, రాష్ట్రాలు, నగరాలు ప్రత్యక్ష పాత్రధారులు కావాలి.
నిధుల సమీకరణ, మౌలిక సౌకర్యాల ఏర్పాటు, అవసరమైన అనుమతులు, దిగుమతుల కోసం కేంద్రంలోని రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, గృహ నిర్మాణ–పట్టణాభివృద్ధి, భారీ పరిశ్రమలు, విద్యుత్, కొత్త–పునర్వినియోగ ఇంధనం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కలసికట్టుగా కదలాలి. అవసరమైన దిగుమతుల అనుమతికి, మౌలిక సౌకర్యాల కల్పనకు నీతి ఆయోగ్ సంస్థ ఓ విధానాన్ని, నియమ నిబంధనలను రూపొందించాలి. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ చార్జింగ్ సౌకర్యాల ఏర్పాటుకు రాష్ట్రాలు, నగరాల ప్రభుత్వ యంత్రాంగం కలసి పని చేయాలి.
ఇప్పటివరకూ రెండు దేశాలదే విజయం
ఇప్పటి వరకు ఈ ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో రెండు దేశాలు మాత్రమే విజయం సాధించాయి. అందులో ఒకటి చైనా కాగా, రెండోది నెదర్లాండ్స్. రెండు దేశాలు రెండు భిన్నమైన దృక్పథాలను ఎన్నుకోవడం వల్ల విజయం సాధించాయి. అమెరికాలో ‘టెస్లా’ కార్ల లాగా కొన్ని దేశాల్లో కొన్ని కంపెనీలు మాత్రమే ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అలా చేయడం వల్ల చమురు రంగం నుంచి ఎలక్ట్రిక్ రంగంలోకి మారడం సాధ్యం కాదు. చైనా ఆటోమొబైల్ రంగంపై దృష్టిని కేంద్రీకరిస్తూనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల రంగాన్ని పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చింది. ఇక నెదర్లాండ్స్ దేశవ్యాప్తంగా చార్జింగ్ వసతులను కల్పించింది. తద్వారా దేశీయంగా ఉత్పత్తయిన ఎలక్ట్రిక్ వాహనాలవైపే కాకుండా టెస్లా లాంటి ప్రసిద్ధి చెందిన కంపెనీల నుంచి కార్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపేలా చేసింది.
చైనాకున్న సానుకూలతలు
ఎలక్ట్రిక్ బస్సులో గ్లోబల్ లీడర్‌గా చైనా ఎదగడానికి స్థానికంగా ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధాన భాగం బ్యాటరీ. కారు తయారీలో సగానికిపైగా ఖర్చు బ్యాటరీదే. లిథియం ఐయాన్ బ్యాటరీలను చైనా స్వయంగా తయారు చేస్తోంది. భారత్ లాంటి దేశాలు ఈ బ్యాటరీలను తయారు చేయడం లేదు. చైనా నుంచే లిథియం ఐయాన్ సెల్స్‌ను దిగుమతి చేసుకొని అసెంబుల్ చేసుకుంటోంది.
జపాన్, దక్షిణ కొరియా కంపెనీలు కూడా ఈ రంగంలో పోటీ పడుతున్నప్పటికీ గ్లోబల్ మార్కెట్‌లో చైనానే 55 శాతం మార్కెట్‌ను స్వాధీనం చేసుకొంది. 2021 నాటికి చైనా మార్కెట్ 65 శాతానికి విస్తరిస్తుందని నిపుణుల అంచనా.
భారత్ బ్యాటరీలను ఉత్పత్తి చేయాలంటే
భారత్ కూడా ఈ బ్యాటరీలను తయారు చేయాలంటే ఆస్ట్రేలియా, చీలి, కాంగోల నుంచి లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్ ఖనిజాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీల మీద ఎవరికి ఆధిపత్యం ఉంటే ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో వారిదే పైచేయి అవుతుంది కనుక బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనల కోసం భారత్ భారీ పెట్టుబడులను పెట్టాల్సి వస్తుంది.
ఆటోమొబైల్ రంగం ఏం కావాలి?
ఆటోమొబైల్ వాహనాల ఉత్పత్తిరంగంలో భారత్ ప్రపంచంలో ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ద్విచక్ర వాహనాల తయారీలో అతి పెద్దది. దేశంలో ప్రతి ఏటా రెండున్నర కోట్ల వాహనాలు తయారవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. జీడీపీలో ఈ రంగ వాటా 7.1 శాతంగా ఉంది. అందుకని 2016 నుంచి 2026 వరకు వర్తించేలా ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మేనిఫాక్చరర్స్’ ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌ను రూపొందించింది.
2021 నాటికి 1650 కోట్ల డాలర్లు, 2026 నాటికి 300 కోట్ల బిలియన్ డాలర్లకు మార్కెట్‌ను విస్తరించాలన్నది లక్ష్యంగా పెట్టుకొంది. తద్వారా ఈ రంగంలో జీడీపీలో 12 శాతానికి చేరుకుంటుందని, అదనంగా ఆరున్నర కోట్ల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా. అప్పటికీ దేశీయ చమురు వినియోగంలో 99 శాతం పెట్రోలు, 70 శాతం డీజిల్ రవాణా రంగానికి వెళుతుందన్నది ఆ ప్రణాళిక అంచనా. చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ప్రపంచంలో భారత్‌ది మూడో స్థానం.
నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాన్ 2020
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఓ విజన్ డాక్యుమెంట్‌ను మాత్రమే రూపొందించింది. దాని ప్రకారం మరో రెండేళ్లలో దేశంలో ఏడు లక్షల హైబ్రిడ్ లేదా ఎలక్ట్రానిక్ వాహనాలు రోడ్లపైకి రావాలి. ఈ విజన్ డాక్యుమెంట్‌కు రెండేళ్లు పూర్తయినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ముందుగా ఆలోమొబైల్ రంగాన్ని ఎలక్ట్రిక్ రంగం వైపు మళ్లించకుండా, అందుకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు, రాయితీలు కల్పించకుండా 2030 నాటికి అన్నీ సాధిస్తామనడంలో అర్థం లేదు.
Comments
Please login to add a commentAdd a comment