సాక్షి, అమరావతి: దేశమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ట్రెండ్ నడుస్తోంది. తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ వాహనాల పట్ల అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఈవీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. సహజంగానే ఏ రాష్ట్రంలో వాహనం తక్కువ రేటుకి వస్తుందో అక్కడ వాహనం కొని, అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని సొంత రాష్ట్రానికి తెచ్చుకుని వాడుకోవడం చాలా మందికి అలవాటు. పలువురు వాహన వ్యాపారులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. విద్యుత్ వాహనాలను కూడా ఇదే విధంగా తక్కువ రేటుకు లభించే రాష్ట్రంలో కొని తెచ్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
కొత్త సెక్షన్ తెచ్చిన కేంద్రం
దేశవ్యాప్తంగా ఈవీలకు కేంద్రం కొన్ని రాయితీలు ఇస్తోంది. దేశంలో ఆదాయ పన్ను చట్టాల ప్రకారం.. కార్లు లగ్జరీ ఉత్పత్తుల కిందకు వస్తాయి. అందువల్ల పౌరులు వీటి కోసం తీసుకునే రుణాలపై పన్ను ప్రయోజనాలను పొందలేరు. కానీ విద్యుత్ వాహనాల (ఈవీ) యజమానులను పన్నుల నుంచి మినహాయించేందుకు ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్ యాక్ట్‌లో 80 అనే కొత్త సెక్షన్ని కేంద్రం తీసుకువచి్చంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ జారీకి, పునరుద్ధరించడానికి చెల్లించాల్సిన రుసుము నుంచి ఈవీలకు మినహాయింపు ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
2019లో తీసుకువచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్–2) పథకంలో ద్విచక్ర వాహనాలకు (రూ.1.5 లక్షల ధర వరకు) కిలోవాట్‌అవర్ (కేడబ్ల్యూహెచ్) బ్యాటరీ కెపాసిటీకి రూ.15 వేలు అందిస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు ప్రత్యక్ష ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. అలాగే ఈవీలపై 5%జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తోంది. అయితే ఇవి ఒక వ్యక్తికి ఒక వాహనం కొనుగోలుకే వర్తిస్తాయి. ఈ విషయంలో రాష్ట్రాలు తమ వెసులుబాటునిబట్టి వేర్వేరుగా రాయితీలు, ప్రోత్సాహకాలను సమకూరుస్తున్నాయి.
పలు రాష్ట్రాల్లో ఈవీలకు ఇస్తున్న రాయితీలు
► ఏపీలో ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు లభిస్తోంది. ద్విచక్ర వాహనాలకు రూ.15 వేలు, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు కిలోవాట్‌కు రూ.10 వేలు, బస్సులకు రూ.20 వేలు రాయితీలిస్తోంది. నగరాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు వేల ప్రాంతాలను గుర్తించింది. చార్జింగ్ స్టేషన్ల యజమానులకు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది.
► ఢిల్లీ ప్రభుత్వం మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్లను మాత్రమే ప్రోత్సహిస్తోంది. ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ సామర్థ్యం కేడబ్ల్యూహెచ్‌కు రూ.5 వేలు చొప్పున రూ.30 వేల వరకు అందిస్తోంది. ఇది రిజి్రస్టేషన్, రహదారి పన్ను మినహాయింపునకు అదనం.
► తెలంగాణ ప్రభుత్వం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఖర్చులపై 100 శాతం మినహాయింపు ఇస్తోంది. మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలు, 20 వేల త్రీవీలర్ ఆటోరిక్షాలకు రాయితీలను అందిస్తోంది. రాష్ట్రంలో బ్యాటరీ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి. మొదటి 500 బ్యాటరీ చార్జింగ్ పరికరాలపై 25 శాతం మూలధన రాయితీ ఇస్తోంది. పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ విద్యుత్ టారిఫ్‌పై పదేళ్లపాటు డ్యూటీ మినహాయింపు ఉంటుంది.
► మహారాష్ట్రలోని అన్ని ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీకి రూ.5 వేలు ప్రోత్సాహం అందిస్తోంది.
► గుజరాత్ మొదటి 1.1 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వినియోగదారులకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంకు రూ.10 వేల వరకూ సబ్సిడీ ఇస్తోంది. మొదటి 10 వేల మందికి కేంద్రం ఇచ్చే రాయితీలను సమకూరుస్తోంది.
► మేఘాలయలో మొదటి 3,500 ద్విచక్ర వాహనాలకు ప్రతి కిలోవాట్‌కు రూ.10 వేల సబ్సిడీని అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. మొదటి 2,500 నాలుగు చక్రాల వాహనాలకు కేడబ్ల్యూహెచ్‌కు రూ.4 వేలు ప్రోత్సాహకం ఇస్తోంది.
► అసోం ప్రభుత్వం మొదటి లక్ష ద్విచక్ర వాహనాలు, 75 వేల త్రిచక్ర, 25 వేల నాలుగు చక్రాల వాహనాలకు వచ్చే ఐదేళ్లలో వాణిజ్య, వ్యక్తిగత వినియోగానికి వాడుకునే వెసులుబాటు కలి్పస్తోంది. ఈ ఐదేళ్లూ రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ మినహాయింపు వర్తిస్తుంది.
► ఒడిశా 2025 వరకు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుముల్లో 100% మినహాయింపును ప్రకటించింది.
► రాజస్థాన్‌లో 2 కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈవీలకు రూ.5 వేలు సబ్సిడీ ఇస్తోంది. 2 నుంచి 4 కేడబ్ల్యూహెచ్ వరకు ఉంటే రూ.7 వేలు అందిస్తోంది. ఇక్కడ ఫోర్ వీలర్లకు ఎలాంటి రాయితీలు లేవు.
► పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేసింది.
► గోవా ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment