2030 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే
న్యూఢిల్లీ: భారత దేశం 2030 సంవత్సరం నాటికి ఒక్క ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తుంది. అంటే పెట్రోలు, డీజిల్ కార్లకు అప్పటికే గుడ్‌బై చెప్పేస్తుంది. ఆ దిశగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల ఏటా 12 లక్షల మంది ప్రజల ప్రాణాలను హరిస్తున్న కాలుష్యాన్ని అరికట్టకలుగుతుంది. ఎలక్ట్రికల్ కార్ల ఉత్పత్తి దిశగా కేంద్ర ప్రభుత్వ తీసుకుంటున్న ప్రణాళికాపరమైన చర్యలను పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు.
ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్, దేశంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడం వల్లన కలిగి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో అత్యధికంగా డీజిల్, పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడవ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఇదే విషయాన్ని డబ్బు లెక్కల్లో చెప్పాలంటే ఏటా 15,000 కోట్ల డాలర్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడం ద్వారా 2030 నాటికి భారత్ ఏటా 6,000 కోట్ల డాలర్లను ఆదా చేయవచ్చు. అలాగే భారత కార్ల యజమానులకు కూడా ఏటా కోట్లాది రూపాయల ఖర్చు తగ్గుతుంది.
ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు మొదటి రెండు, మూడు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తోందని, ఆ తర్వాత ఒక్కపైసా సబ్సిడీ అవసరం లేకుండానే డిమాండ్‌పై ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ నిలదొక్కుకోవాలని, ఆ నమ్మకం తనకుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. వాతావరణ కాలుష్యంలోని విషవాయువులను పీల్చడం వల్ల భారత్‌లో ఏటా 12 లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారని ఇది ధూమపానం కారణంగా మరణిస్తున్న వారికన్నా కాస్త మాత్రమే తక్కువని గ్రీన్‌పీస్ సంస్థ ఓ అధ్యయనంలో తెలిపింది. వాతావరణంలోని విషవాయువుల వల్ల జాతీయ స్థూల ఉత్పత్తిలో మూడుశాతం నష్టపోతున్నామని కూడా తెలియజేసింది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 20 నగరాలను గుర్తించగా, వాటిలో 13 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.