డాక్టర్ నిశాంత్ దొంగరి
రవాణా రంగంలో విద్యుత్తు వాహనాలు ఒక సంచలనం...
పర్యావరణ హితమైనవి. ఖర్చు తక్కువ. లాభమెక్కువ!
ఈ కారణంగానే ఇటీవలి కాలంలో స్కూటర్లు మొదలుకొని..
ఆటోలు, మోటార్‌బైకులు, కార్లు అనేకం విద్యుత్తుతోనే నడుస్తున్నాయి!
అయితే... వీటిల్లో సమస్యలూ లేకపోలేదు.
కొన్ని స్కూటర్లు రోడ్లపైనే కాలి బూడిదవుతూంటే..
ఇంకొన్నింటి బ్యాటరీలు టపాసుల్లా పేలిపోతున్నాయి!
ఈ సమస్యలకు కారణాలేమిటి? పరిష్కారం ఉందా?
విద్యుత్తు వాహనాల్లో ఇప్పుడు వాడుతున్న...
లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబు తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ‘సాక్షి.కాం’
డాక్టర్ నిశాంత్ దొంగరి.. (Nishanth Dongari) విద్యుత్తు వాహన రంగంలో చిరపరిచితమైన పేరిది. హైదరాబాద్‌లోని ఐఐటీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే.. ఇక్కడ మొట్టమొదటి విద్యుత్తు వాహన స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన వ్యక్తి ఈయన. ప్యూర్ ఈవీ (Pure EV) పేరుతో మార్కెట్‌లో లభ్యమవుతున్న విద్యుత్తు స్కూటర్లు డాక్టర్ నిశాంత్ సృష్టే. ఇటీవలి కాలంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు అనేక సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి.కాం’ ఆయన్ను సంప్రదించింది. ఆ వివరాలు..
బ్యాటరీలు ఎందుకు కాలిపోతున్నాయి?
ఛార్జ్ చేసేటప్పుడు.. వినియోగించే సమయంలోనూ అన్ని బ్యాటరీలూ వేడెక్కుతూంటాయి. ఇది సహజం. అయితే సక్రమంగా నియంత్రించకపోతే ఈ వేడి కాస్తా ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న విద్యుత్తు వాహనాల బ్యాటరీలు అన్నింటిలోనూ వేడిని పసికట్టేందుకు సాధ్యమైనంత వరకూ తొలగించేందుకు ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి.
‘‘ప్యూర్ -ఈవీలో మేము ఇంకో అడుగు ముందుకేశాము. బ్యాటరీల్లో వేడిని ఎప్పటికప్పుడు తగ్గించేందుకు దేశంలోనే మొట్టమొదటి సారి ఫేజ్ ఛేంజ్ మెటీరియల్ (PCM)ను ఉపయోగించాం. వేడి ఎక్కువైనప్పుడు ఈ పదార్థం ద్రవరూపంలోకి మారిపోతుంది. వేడిని బ్యాటరీల నుంచి దూరంగా తీసుకెళుతుంది. తరువాతి కాలంలో ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేశాము. నానోస్థాయి పదార్థాన్ని చేర్చడం ద్వారా బ్యాటరీల్లోని వేడి మరింత సమర్థంగా తగ్గించగలిగాం. ఈ నానోపీసీఎం కారణంగా ప్యూర్-ఈవీ బ్యాటరీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలిపోవు అని గ్యారెంటీగా చెప్పగలం.’’
విద్యుత్తు వాహనాల్లో ఏఐ వాడకం ఎలా ఉండబోతోంది?
వాహనాల్లో కృత్రిమ మేధ వాడకం గత ఐదేళ్లలో బాగా పెరిగింది. విద్యుత్తు వాహనాల్లో కూడా. ప్రస్తుతం ప్యూర్-ఈవీలో బ్యాటరీ ప్యాక్‌లలోని ఒక్కో సెల్‌ను పరిశీలించేందుకు మేము కృత్రిమ మేధను వాడుతున్నాం. భవిష్యత్తులో విద్యుత్తు వాహనాలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను గుర్తించేందుకు, వినియోగదారులకు పరిష్కార మార్గాలు సూచించేందుకూ జనరేటివ్ ఏఐను వాడే ఆలోచనలో ఉన్నాం. ఉదాహరణకు.. మీ వాహనం అకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోయిందనుకుందాం. స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్‌లో మీ సమస్య వివరాలు ఎంటర్ చేస్తే జనరేటివ్ ఏఐ ‘‘స్విచ్ ఆన్/ఆఫ్ చేసి చూడండి’’ లేదా ఇంకో పరిష్కార మార్గం సూచిస్తుంది.
లిథియం అయాన్ బ్యాటరీలు ఇంకెంత కాలం?
విద్యుత్తు వాహనాలతోపాటు అనేక ఇతర రంగాల్లోనూ లిథియం అయాన్ బ్యాటరీలే అధికం. రానున్న 30 - 50 ఏళ్ల వరకూ ఇదే పంథా కొనసాగనుంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది 20 - 25 ఏళ్ల ముందు మాత్రమే. కాథోడ్, ఆనోడ్, ఎలక్ట్రొలైట్, సెపరేటర్ వంటి అనేక అంశాల్లో మెరుగుదలకు చాలా అవకాశాలున్నాయి. నిల్వ చేయగల విద్యుత్తు, భద్రత అంశాలు కూడా బాగా మెరుగు అవుతాయి. సైద్ధాంతికంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ద్రవ ఎలక్ట్రోలైట్ బ్యాటరీల్లో 220 వాట్ల విద్యుత్తు నిల్వ చేయగలిగితే సాలిడ్ స్టేట్ బ్యాటరీల్లో ఇది 800 వాట్లకు చేరుకోగలదు. రానున్న ఐదేళ్లలో మరింత వేగంగా ఛార్జ్ చేసుకోవడంతోపాటు అవసరమైనప్పుడు అవసరమైనంత వేగాన్ని ఇచ్చే టెక్నాలజీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్ లాంటి దేశాలు లిథియంపై మౌలిక రంగ పరిశోధనలు మరిన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ముడి ఖనిజం నుంచి లిథియం అయాన్‌ను మరింత సమర్థంగా వెలికితీయగలిగితే, వాడేసిన బ్యాటరీల నుంచి మెరుగ్గా రీసైకిల్ చేయగలిగితే బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. భారత్ ఈ విషయాల్లో చొరవ చూపాలి. ముడి ఖనిజం ద్వారా వెలికితీసే లిథియంకు ఇది సరైన ప్రత్యామ్నాయం కాగలదు. లిథియం అయాన్ బ్యాటరీల్లో మరింత ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసేందుకు కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరం (మైలేజీ) మరింత పెరుగుతుంది. కాబట్టి.. సమీప భవిష్యత్తులో లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదనే చెప్పాలి.
హోండా లాంటి కంపెనీలు హైడ్రోజన్‌పై దృష్టి పెడుతున్నాయి కదా?
నిజమే. కానీ హైడ్రోజన్‌తో వ్యక్తిగత వాహనాలు నడుస్తాయని నేను భావించడం లేదు. లారీలు, ట్రక్కులు, రైళ్లు, చిన్న నౌకల వంటి భారీ వాహనాలకు హైడ్రజన్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత్ కూడా ఇటీవలి కాలంలో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకునే విషయంలో చొరవ చూపుతోంది. పరిశోధనలపై దృష్టి పెడుతోంది. భవిష్యత్తులో రవాణా రంగంలో హైడ్రోజన్ కీలకం కాగలదు. చిన్న వాహనాల విషయానికి వస్తే హైడ్రోజన్‌ను నిల్వ చేయడం, రవాణా చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం.
Comments
Please login to add a commentAdd a comment