
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు.
పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్‌లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది.
ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు.
దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి.
Comments
Please login to add a commentAdd a comment