తాజాగా జట్టు కట్టిన హోండా, నిస్సాన్
చైనా పోటీకి చెక్ పెట్టే ప్రణాళికలు
9 ఏళ్ల తదుపరి విడిపోయిన దైమ్లర్ క్రిస్లర్
2008 సంక్షోభంతో టాటాల చేతికి జేఎల్‌ఆర్
ఆటోరంగం ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఒక కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేగంగా దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ కార్లు ఒకవైపు, ఆర్టీఫిషియల్ టెక్నాలజీతో నడిచే డ్రైవర్ లెస్ కార్లు రోబో ట్యాక్సీలు మరోవైపు ఆటో కంపెనీ లకు ఆర్థిక భారాన్ని పెడుతున్నాయి.. అమెరికా కార్ల దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ఆధిపత్యం చెలాయిస్తుంటే, చైనా కంపెనీలు బీవైడీ, నియో, గ్రేట్‌వాల్ మోటార్స్ తక్కువ ధరకే ఈవీలను రోడ్లపైకి తెస్తూ చైనాకు చెక్ పెడుతున్నాయి. కొత్తగా ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి, అనేక దేశాల్లో ఆటో కంపెనీలు తమ పోటీ కంపెనీలతోనే పొత్తుకు దిగుతున్నాయి.
ప్రత్యర్ధి కంపెనీలతోనే చేతులు కలుపుతున్నాయి. కార్ల తయారీ నుంచి మార్కెటింగ్ దాకా పలు విభాగాల్లో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా విలీనం బాట పట్టి ఇతర మార్కెట్లకు విస్తరిస్తుంటే మరికొన్ని టెక్నాలజీని షేర్ చేసుకుంటూ కొత్త మోడళ్ల అభివృద్ధి వ్యయాలు తగ్గించుకుంటున్నాయి. తాజాగా జపనీస్ కంపెనీలు నిస్సాన్, హోండా కూడా విలీనానికి చేతులు కలపడం ఆటో రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నా విలీనాలు, భాగస్వామ్యాలతో ఏ కంపెనీ ఎక్కువ లాభపడినట్లు గణాంకాలు వెల్లడించడంలేదు. వివరాలు చూద్దాం.
– సాక్షి, బిజినెస్ డెస్క్
భాగస్వామ్యాల తీరిదీ..
⇒ ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ సాంకేతికతల కోసం ఫోర్డ్ మోటార్, ఫోక్స్‌వేగన్ చేతులు కలిపాయి. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల బిజినెస్‌ను మూసివేయగా.. కొంతమేర లబ్ధి పొందాయి.
⇒ జనరల్ మోటార్స్‌తో హోండా జత కలిసింది. జీఎం తయారు చేసే 2 ఈవీ కార్లను హోండా విక్రయిస్తోంది. ఈ రెండింటికి మాత్రమే ఈ భాగస్వామ్యం పరిమితం.
⇒ ఫ్రాన్స్ ప్యూజో, ఫియట్ క్రిస్లర్ జట్టు కట్టడం ద్వారా 2021లో స్టెల్లాంటిస్‌కు ఊపిరిపోశాయి. అయితే ఫ్యాక్టరీలు మూసివేత బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
⇒ రేనాల్ట్‌తో నిస్సాన్ జత కలిసింది. దీంతో నిస్సాన్ నిలదొక్కుకుంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే అంత విజయవంతంకాలేదు.
⇒ అందుబాటు ధరల కార్ల తయారీకి వీలుగా లగ్జరీ కార్ల కంపెనీ దైమ్లర్‌తో, క్రిస్లర్ విలీనమైనప్పటికీ 9 ఏళ్ల తదుపరి 2007లో విడిపోయాయి.
దేశీయంగా..
టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2016లోనే భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2019 ఆగస్ట్‌లో దీర్ఘకాలిక సహకారంలో భాగంగా ఈవీ టెక్నాలజీ, అటానమస్ డ్రైవింగ్‌పై కన్నేశాయి. ఈ బాటలో దేశీయంగా మారుతీ సుజుకీ బ్రాండ్ ద్వారా కార్ల అమ్మకాలు పెంచుకునే ప్రణాళికలు వేశాయి. మరోపక్క మారుతీ సియాజ్, ఎర్టిగా ప్లాట్‌ఫామ్ ద్వారా అభివృద్ధి చేసిన వాహనాలను సరఫరా చేయనుంది. ఇదేవిధంగా సీవిభాగంలోని ఎంపీవీ, టయోటా కరోలా సెడాన్, విటారా బ్రెజ్జా తదితర ప్లాట్‌ఫామ్‌లను పరస్పరం అభివృద్ధి చేయనున్నాయి.
టాటా చేతికి జేఎల్‌ఆర్
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి జాగ్వార్– ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్), మజ్దా, వోల్వో విభాగాలను ఫోర్డ్ మోటార్ కంపెనీ విక్రయించింది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారీ నష్టాలలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల విభాగం జేఎల్‌ఆర్‌ను దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. తదుపరి కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా అధ్యక్షతన నష్టాలను వీడి లాభాల బాట పట్టిన సంగతి తెలిసిందే.
హోండా – నిస్సాన్ విలీనం.. మూడో పెద్ద కంపెనీ
జపనీస్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ తాజాగా విలీనానికి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో అమ్మకాలరీత్యా ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీ ఆవిర్భావానికి తెరతీయనున్నాయి. మిత్సుబిషీ సైతం వీటితో కలవనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే విలీన కంపెనీ టయోటా, ఫోక్స్‌వ్యాగన్‌తో పోటీ పడనుంది. ఇప్పటికే నిస్సాన్, హోండా, మిత్సుబిషీ సంయుక్తంగా ఈవీల కోసం బ్యాటరీలు తదితర విడిభాగాల తయారీ టెక్నాలజీని పంచుకోనున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా అటానమస్ డ్రైవింగ్‌కు వీలుగా సాఫ్ట్ వేర్‌పై పరిశోధనలు సైతం చేపట్టనున్నట్లు తెలియజేశాయి.
ఆర్‌ఐఎల్– టెస్లా
టెస్లా దేశీయంగా రిలయన్స్‌తో భాగస్వామ్యానికి చర్చలు జరుపుతున్నట్లు సమా చారం. తద్వారా స్థానికంగా టెస్లా ఎల క్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే వాణిజ్య వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్‌తో భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ దేశీయంగా తొలి హైడ్రోజన్ ఐసీఈ ఇంజిన్‌తో నడిచే హెవీడ్యూటీ ట్రక్‌ను 2023లో ఆవిష్కరించింది.
జేఎస్‌డబ్ల్యూ– చైనీస్
ఎలక్ట్రిక్ కార్ల తయారీకి జిందాల్ గ్రూప్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ సైతం చైనీస్ దిగ్గజాలు బీవైడీ, జీలీ తదితరాలతో చర్చలు. జరుపుతోంది. లైసెన్సింగ్ ఒప్పందం, టెక్నాలజీ బదిలీ తదితరాలకు ఒప్పందాలు కుదుర్చుకునే సన్నాహాల్లో ఉంది. వోల్వో కార్ల కంపెనీగా జీలీ ఇప్పటికే పరోక్షంగా కార్యకలాపాలు కలిగి ఉంది. దేశీయంగా 2024 తొలి 11 నెలల్లో 18.7 లక్షల ఎలక్ట్రిక్ కార్లు విక్రయంకావడంతో పలు దిగ్గజాలు ఈవీ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment