
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వాహనాల సంఖ్య
ఏడాదిన్నరలో లక్షకుపైగా రోడ్లపైకి.. 3 నెలల్లోనే దాదాపు 15 వేల ఈవీల కొనుగోలు
విద్యుత్ వాహన పాలసీతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్
ఇంధన ఖర్చులో ఆదా, రాయితీల ప్రకటనతో కొనుగోళ్లు పైపైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(electric vehicles) వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. నాలుగేళ్ల కిందట 3 వేలలోపు ఉన్న ఈవీల సంఖ్య ప్రస్తుతం సుమారు 1.77 లక్షలకు చేరింది. ముఖ్యంగా విద్యుత్ ద్విచక్ర వాహనాలు సాధారణ పెట్రోల్ టూవీలర్ల విక్రయాలకు పోటీనిచ్చే దిశగా సాగుతుండటం విశేషం. ఏప్రిల్ నాటికి వాటి సంఖ్య లక్షన్నర కంటే పెరగనుండటం విశేషం. మరోవైపు ఈవీ చార్జింగ్ కేంద్రాలను పెంచడంపై ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపకపోవడంతో విద్యుత్ కార్లు కొనేందుకు వినియోగదారులు సంకోచిస్తున్నారు. దీంతో వాటి సంఖ్య పరిమితంగానే ఉంటోంది.
ఈవీ పాలసీ రాకముందు అంతంతే..
రాష్ట్రంలో 2021కి ముందు వరకు నామమాత్రంగానే విద్యుత్ ద్విచక్ర వాహనాలు ఉండేవి. వాటి కొనుగోళ్లపై ప్రజల్లో అవగాహన సైతం అంతంత మాత్రంగానే ఉండేది. విద్యుత్ వాహనాలు అంత సురక్షితం కాదని.. వాటి చార్జింగ్ ఇబ్బందికరంగా ఉంటుందని.. మధ్యలో బ్యాటరీ డిశ్చార్జి అయితే తిరిగి చార్జింగ్ చేయడం కష్టమనే భావన ఉండేది. అదే సమయంలో కొన్ని ద్విచక్రవాహనాల్లో బ్యాటరీలు పేలుతుండటం వారిలో అనుమానాలు, భయాన్ని మరింత పెంచింది. ఫలితంగా వాటి సంఖ్య ఆశించినస్థాయి పెరగలేదు.
ఈవీల పెరుగుదలకు దోహదపడ్డ కారణాలు ఇవీ..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో విద్యుత్ వాహన విధానాన్ని ప్రకటించి నిర్ధారిత సంఖ్యలో వాహనాలకు రాయితీలను ప్రకటించడం ప్రజలను ఈవీలవైపు ఆకర్షించింది. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాలసీకి సవరణలు చేస్తూ మెరుగైన రాయితీలను ప్రకటించడం ప్రజల్లో మరింత జోష్ నింపింది. ముఖ్యంగా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకపోవడం విద్యుత్ వాహనాల కొనుగోళ్లకు మరింతగా ఊతమిస్తోంది.
అదే సమయంలో బ్యాటరీల నాణ్యత పెరగడం.. మరింత సమర్థంగా పనిచేసే బ్యాటరీలు అందుబాటులోకి రావడం.. దేశీయంగా వాటి తయారీ కూడా మొదలవడం.. ప్రముఖ వాహన తయారీ కంపెనీలు కూడా ఈవీల తయారీ రంగంలోకి ప్రవేశించడంతో వాటి సంఖ్య అమాంతం పెరిగింది. పెట్రోల్‌తో నడిచే ద్విచక్రవాహనాలతో పోలిస్తే 60 శాతానికిపైగా ఇంధన ఖర్చు ఆదా అవుతుండటంతో ప్రజలు ఎలక్రి్టక్ టూవీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంధనం ఆదాతోపాటు పన్నులు, ఫీజులు కూడా లేకపోవడంతో వాహన కొనుగోలు ధరలోనూ ఆదా కనిపిస్తోంది. దీంతో బైక్ ట్యాక్సీదారులు, చిరు వ్యాపారులు, డెలివరీ బాయ్స్ ఎక్కువగా ఎలక్ట్రిక్ టూవీలర్లను కొంటున్నారు.
చార్జింగ్ కేంద్రాలు పెరిగితే పెరగనున్న కార్ల కొనుగోళ్లు..
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 13 వేల విద్యుత్ కార్లు పరుగులు పెడుతున్నాయి. ఇంధన వ్యయంలో ఆదా, రాయితీలు, శబ్దం లేకుండా నడవడం, కాలుష్యరహితం లాంటి ప్రయోజనాలతో ఈవీ కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 435 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. వాటి సంఖ్య త్వరలో 800కు.. మరో ఏడాదిలో 3 వేలకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ఈవీల విడిభాగాలు, బ్యాటరీ కాంపోనెంట్లపై రాయితీలను ప్రకటించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. ఇది కూడా విద్యుత్ కార్ల కొనుగోళ్లు పెరిగేందుకు దోహదపడనుంది.

ఇతర రాష్ట్రాల్లో ఈవీలు ఇలా..
⇒ కర్ణాటకలో 5,800 చార్జింగ్ కేంద్రాలున్నాయి. ఆ సంఖ్యను 8 వేలకు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సుమారు 3 లక్షల విద్యుత్ వాహనాలు ఉన్నాయి.
⇒ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర దేశంలోకెల్లా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. యూపీలో 5 లక్షలు, మహారాష్ట్రలో 3.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
⇒ తమిళనాడు, ఢిల్లీ, బిహార్, రాజస్తాన్ క్రమంగా పోటీ పడుతూ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment