హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్ చేతక్ ద్వారా స్కూటర్స్ రంగంలోకి బజాజ్ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్ మోటార్ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.
నవంబర్ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్‌లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్‌లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.
హోండా ఎలక్ట్రిక్ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారత టూవీలర్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.
రెండింటిలో ఒకటి ఈవీ..
భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్ రోడ్డెక్కాయి. భారత్‌లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్‌జీ, ఎల్‌పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం విశేషం.
ఎలక్ట్రిక్ త్రీవీలర్స్‌లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.
2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ఆప్షన్స్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్ కంపెనీల నుంచి డిమాండ్ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్‌లో సీఎన్‌జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్‌కు 11, ఎల్‌పీజీ 3, పెట్రోల్‌కు ఒక శాతం వాటా ఉంది.
పోటీలో నువ్వా నేనా..
రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతూ.. 2024 సెప్టెంబర్‌లో 19,213 యూనిట్లతో తొలిసారిగా బజాజ్ ఆటో రెండవ స్థానాన్ని పొంది టీవీఎస్‌ను మూడవ స్థానానిని నెట్టింది. అక్టోబర్, నవంబర్‌లో టీవీఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన బజాజ్ ఆటో మూడవ స్థానానికి పరిమితమైంది.
ఇక 2020 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు బజాజ్ ఆటో మొత్తం 1,04,200 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తొలి లక్ష యూనిట్లకు కంపెనీకి 47 నెలల సమయం పట్టింది. 2024లో ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరువైంది. గతేడాది సంస్థ మొత్తం 1,93,439 యూనిట్ల అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో మూడవ స్థానంలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 4,07,547 యూనిట్లతో మొదటి, టీవీఎస్ మోటార్ కో 2,20,472 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment