హైబ్రిడ్ వాహనాలకు ప్రాధాన్యత
మారుతున్న కస్టమర్ల అభిరుచులు
దేశీ ఆటోమోటివ్ రంగంపై గ్రాంట్ థార్న్‌టన్ భారత్ సర్వే
న్యూఢిల్లీ: వాహనాల కొనుగోలుదార్లు విలాసవంతమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే హైబ్రిడ్ వాహనాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దేశీ ఆటోమోటివ్ పరిశ్రమపై గ్రాంట్ థార్న్‌టన్ భారత్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో పాల్గొన్న వారిలో 85 శాతం మంది ప్రీమియం మోడల్స్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 40 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను ఇష్టపడుతుండగా, 17 శాతం మంది మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపారు. 34 శాతం మంది పెట్రోల్ వాహనాలకు ప్రాధాన్యమిస్తున్నారు.
వినియోగదారులు మరింత భారీ ఈవీ మౌలిక సదుపాయాలు... ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తూనే పర్యావరణ అనుకూల ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారనే ధోరణి వల్లే హైబ్రిడ్ వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో మారుతున్న వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా రాణించేలా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ సొల్యూషన్స్‌పై వాహనాల తయారీ సంస్థలు దృష్టి పెట్టాల్సిన ఉంటుందని పేర్కొంది.
కీలకంగా పండుగ సీజన్...
వార్షిక అమ్మకాల్లో దాదాపు 30–40 శాతం వాటా పండుగ సీజన్ విక్రయాలే ఉంటాయి కాబట్టి దేశీ ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది కీలకమైన సీజన్ అని సర్వే తెలిపింది. అయితే, నిల్వలు భారీగా పేరుకుపోవడం, వాతావరణ మార్పులపరమైన అవాంతరాలు, ఎన్నికలు మొదలైనవి ఈసారి అమ్మకాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు గ్రాంట్ థార్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ సాకేత్ మెహ్రా చెప్పారు. యుటిలిటీ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు నెలకొన్న డిమాండే.. మార్కెట్‌ను ముందుకు నడిపిస్తోందన్నారు.
‘‘ఈ సెగ్మెంట్స్ వార్షికంగా 13 శాతం వృద్ధి నమోదు చేశాయి. ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో వీటి వాటా 65 శాతంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీ విక్రయాలు కేవలం 0.5 శాతం పెరిగి ఒక మోస్తరు వృద్ధిని మాత్రమే నమోదు చేసినప్పటికీ ఎస్‌యూవీలు, యూవీలకు డిమాండ్ నిలకడగా కొనసాగడం ప్రత్యేకమైన వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండటాన్ని తెలియజేస్తోంది’’ అని మెహ్రా వివరించారు.
సవాలుగా నిల్వలు..
వాహన నిల్వలు గణనీయంగా పేరుకుపోవడం పరిశ్రమకు సవాలుగా మారింది. రూ.79,000 కోట్ల విలువ చేసే 7.9 లక్షల యూనిట్ల స్థాయిలో నిల్వలు పేరుకుపోయినట్లు మెహ్రా వివరించారు. భారీగా పండుగ డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంపై ఆటోతయారీ సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు. దాదాపు 90 శాతం మంది ఈ తరహా ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, కంపెనీలు ప్రకటిస్తున్న
సబ్‌్రస్కిప్షన్ విధానాలకు, అలాగే వివిధ కార్ మోడల్స్‌లో మరిన్ని భద్రతా ఫీచర్లకు కూడా డిమాండ్ పెరుగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఇక కొనుగోలుదారులు డిజైన్ లేదా పనితీరు వంటి అంశాలకు మించి అధునాతన భద్రతా ఫీచర్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment