దుబాయ్: గ్లోబల్ చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో గతేడాది(2022) కొత్త చరిత్రను లిఖిస్తూ 161 బిలియన్ డాలర్ల(రూ. 13 లక్షల కోట్లకుపైగా) నికర లాభం ఆర్జించింది. వెరసి ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలరీత్యా లిస్టెడ్ కంపెనీలలో సరికొత్త రికార్డును సాధించింది. సౌదీ అరామ్‌కోగా పిలిచే సౌదీ అరేబియన్ ఆయిల్ కో కొద్ది నెలలుగా చమురు ధరలు జోరందుకోవడంతో తాజా ఫీట్‌ను సాధించింది. ప్రధానంగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడం ఇందుకు సహకరించింది. రష్యా చమురు, నేచురల్ గ్యాస్ అమ్మకాలపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం ప్రభావం చూపింది.
కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. 2021లో సాధించిన 110 బిలియన్ డాలర్లతో పోలిస్తే నికర లాభం 46 శాతంపైగా ఎగసింది. కాగా.. కోవిడ్–19 సంక్షోభం తదుపరి ఇటీవల చైనా ఆంక్షలు సడలించడంతో చమురుకు డిమాండ్ మరింత ఊపందుకోనున్నట్లు సౌదీ అరామ్‌కో భావిస్తోంది. వెరసి ఉత్పత్తిని పెంచే యోచనలో ఉంది. అయితే మరోపక్క వాతావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. శిలాజ ఇంధనాల విక్రయం ద్వారా ఒక కంపెనీ 161 బిలియన్ డాలర్లు ఆర్జించడం షాక్‌కు గురిచేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఏన్స్ కాలమార్డ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment