బాధలూ బలమే!
ఆత్మీయం
ఆపదలు, కష్టాలు రానివారుండరు. దేవుడు ఇచ్చే ప్రతి కష్టమూ మనకు అనుభవాన్ని నేర్పిస్తుంది. మరింత గట్టిపడేలా చేస్తుంది. అదే విధంగా ప్రతికూల భావనల స్థానంలో సానుకూల భావనలను నింపుకుంటే, ఇక ఏ సంఘటనా బాధించదు.దేనినైనా సరే, అది మనకు ఇబ్బందికరమైనదనో, దాని ద్వారా భరించలేనంతటి బాధ కలుగుతుందనో ముందే అనుకోకూడదు. అసలు ఆ భావనే దుర్భరమైన స్థితిలోకి నెడుతుంది. కాబట్టి ఆ జరగబోయే దానిలో లేదా అప్పటికే జరిగిన దాని ద్వారా కలగబోయే మేలును మాత్రమే తలచుకోవాలి.
మనల్ని పరీక్షించడం కోసం ఆ బాధను లేదా సమస్యను సృష్టించిన దేవుడే దానిని పరిష్కరించగలడన్న నమ్మకాన్ని మనసులో నింపుకోవాలి. అప్పుడే ఎంతటి గడ్డు పరిస్థితులనయినా సరే, ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అప్పుడే బాధే బలంగా మారుతుంది. కుంతీదేవి ఎప్పుడూ శ్రీకృష్ణుని తనకు ఏదైనా సమస్య లేదా కష్టాన్ని ఇమ్మని కోరుకునేదట. ఎందుకంటే, కష్టసమయంలోనే కదా, దేవుడు గుర్తుండేది!