సాక్షి, న్యూఢిల్లీ : ఈ సారి ఫిజియాలోజీ, వైద్య విజ్ఞాన శాస్త్రంలో జెఫ్రీ హాల్, మైఖేల్ రోస్‌బాష్, మైఖేల్ యంగ్‌లకు నోబెల్ అవార్డు ఇవ్వడం మనిషికి నిద్ర ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తోంది. మానవులకు చాలినంత నిద్ర లేకపోతే వారిలో రక్తపు పోటు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఊబకాయం వస్తుంది. మధుమేహ వ్యాధి–2 సంక్రమిస్తుంది. లైంగిక పటుత్వం తగ్గుతుంది. ఇతర మానసిక సమస్యలు వస్తాయి. ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే భారతీయుల్లో నిద్ర తక్కువే. అందులోనూ కాల్ సెంటర్లలో పనిచేస్తున్న వారిలో నిద్ర మరింత తక్కువ.
18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులు రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిద్ర పోవాలని అమెరికాలోని ‘జాతీయ స్లీప్ ఫౌండేషన్’ సిఫార్సు చేస్తోంది. 18 దేశాల ప్రజల్లో నిద్ర అలవాటు ఎలా ఉందన్న అంశంపై ఫిట్‌నెస్‌ను సూచించే సాంకేతిక పరికరాలను విక్రయించే ‘ఫిట్‌బిట్’ సంస్థ తాజాగా అధ్యయనం జరిపింది. అందులో భారతీయులు నిద్ర పోయేది తక్కువేనని తేలింది. భారతీయులు సరాసరి 6,55 గంటలు నిద్ర పోతున్నారట. జపనీయులు మనకన్నా తక్కువగా నిద్రపోతున్నారు. వారి సరాసరి నిద్ర 6.35 గంటలు మాత్రమే. ఇక న్యూజిలాండ్ ప్రజలు సరాసరి 7. 25 గంటలు నిద్ర పోతున్నారు.
మరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫిలిప్స్ నిర్వహించిన సర్వే ప్రకారం 5, 600 మంది భారతీయుల్లో 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నారు. తాము పడుకున్నాక మధ్యలో ఒకటి నుంచి మూడుసార్లు లేస్తామని వారిలో 74 శాతం మంది తెలిపారు. నిద్ర లేక పోవడం వల్ల తాము చేసే పనిపై కూడా దాని ప్రభావం ఉంటోందని, పని చేస్తూ కునుకు తీస్తున్న సందర్భాలు ఉంటున్నాయని 58 శాతం మంది చెప్పారు. ఇక నిద్ర సరిపోక సెలవు పెట్టి ఇంటికి పోతున్న వారి సంఖ్య 11 శాతం ఉంది. అనేక కారణాల వల్ల రాత్రి పూట నిద్రలోనుంచి మేల్కొంటున్నామని వివిధ ఏజ్ గ్రూపుల వారు తెలిపారు. బెంగళూరులోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్’కు చెందిన శాస్త్రవేత్తలు 2011లో తమ ఆస్పత్రికి రోగుల వెంట వచ్చిన 1,050 మంది ఆరోగ్యవంతులైన అటెంటెండ్స్‌పై ఈ విషయమై అధ్యయనం జరిపారు. వారిలో 18 శాతం నిద్రలేమి తనం అంటే, ఇన్‌సోమ్నియాతో, 40 శాతం మంది నిద్రలేమితో వచ్చే ఇతర సమస్యలతో బాధ పడుతున్నారు.
నిద్రలేమితో బాధపడుతున్నామని మరో సర్వేలో పెద్ద వయస్కులు తెలిపారు. న్యూఢిల్లీలోని సఫ్ధార్‌జంగ్ ఆస్పత్రితో కలసి వర్ద్‌మాన్ మహావీర్ వైద్య కళాశాల నిపుణులు 1240 మంది పెద్ద వయస్కుల్లో నిద్ర అలవాటు గురించి తెలుసుకున్నారు. సరైన నిద్ర లేకుండా పోతోందని 59 శాతం మంది తెలియజేస్తున్నారు. నిద్ర రావడం లేదని కొందరు చెప్పగా, రోగాల కారణంగా లేదా రోగాలకు మందులు తీసుకుంటుండడం వల్ల నిద్ర రావడంలేదని మరికొందరు చెప్పారు. భారతీయుల్లో ఇన్‌సోమ్నియాతో మహిళలే ఎక్కువ బాధ పడుతున్నారు. ముఖ్యంగా బాలింతలు ఈ సమస్యతో ఎక్కువ మంది బాధ పడుతున్నారు. స్కూలు వెళుతున్న విద్యార్థినీ విద్యార్థులు కూడా నిద్ర లేమితో బాధ పడుతున్నట్లు మరో సర్వేలో తేలింది.
కాల్ సెంటర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు జీవ గడియారాన్ని సరిగ్గా నడపలేక పోతున్నారు. వారంతా ఎక్కువగా నైట్ షిప్టుల్లో పనిచేస్తున్నందున వారు డే టైమ్‌లో వారికి నిద్ర సరిపోవడం లేదట. ఐటీ సెక్టార్‌లో నిద్రలేమితో బాధ పడుతున్న వారి సంఖ్య 41 శాతం కాగా, కాల్ సెంటర్లలో పనిచేస్తున్న వారిలో 83 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నారు. టెలివిజన్ ఛానెళ్లు, సినిమాలు, స్మార్ట్‌ఫోన్లు, గేమ్ ఆఫ్స్ కూడా నిద్ర లేమికి భారత్‌లో ఎక్కువగా కారణం అవుతున్నాయట. మద్యం అతిగా తాగడం కూడా నిద్రలేమికి కారణం అవుతుందట.
Comments
Please login to add a commentAdd a comment