మొబైల్ పరిశ్రమతో 41 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం మొబైల్ పరిశ్రమ(మొబైల్ ఎకానమీ) 2020 నాటికి 41 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దీని వాటా 400 బిలియన్ డాలర్ల మేర ఉండనుంది. మొబైల్ ఎకానమీ ఇండియా 2013 పేరిట అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య జీఎస్‌ఎంఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కలిసి జీఎస్‌ఎంఏ దీన్ని రూపొందించింది. మొబైల్ ఎకానమీ వల్ల టెలికం మౌలిక సదుపాయాల కల్పన కోసం 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగలవని జీఎస్‌ఎంఏ వివరించింది.
దేశీయ మొబైల్ పరిశ్రమ చాలా వేగంగా ఎదుగుతోందని, అయితే లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే నియంత్రణ వ్యవస్థ ప్రస్తుతం కరువైందని జీఎస్‌ఎంఏ డెరైక్టర్ జనరల్ యాన్ బూవెరాట్ తెలిపారు. గతేడాది గణాంకాల ప్రకారం 2012 జీడీపీలో మొబైల్ పరిశ్రమ వాటా 5.3 శాతంగా ఉండగా, ప్రత్యక్షంగా 7,30,000 మందికి, పరోక్షంగా ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించిందని వివరించారు. పరిశ్రమ మరింతగా పురోగమించాలంటే స్పెక్ట్రమ్ కేటాయింపులు తదితర అంశాల్లో దీర్ఘకాలిక మైన, సరళమైన విధానాలు అవసరమవుతాయని బూవెరాట్ చెప్పారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రభుత్వంతోనూ, ఇతర అనుబంధ పరిశ్రమలతోనూ కలిసి పనిచేసేందుకు మొబైల్ రంగం సిద్ధంగా ఉందని జీఎస్‌ఎంఏ ఇండియా డెరైక్టర్ సందీప్ కరణ్‌వాల్ తెలిపారు.