mobile industry
-
బడ్జెట్ 2021: స్మార్ట్ఫోన్లపై ఉత్కంఠ!
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఊతం ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. కేంద్రం కూడా అన్ని బడ్జెట్ల కంటే ఇది ప్రత్యేకమని పేర్కొంది. అన్ని రంగాలు కూడా ఈ బడ్జెట్ పై అనేక ఆశలు పెట్టుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం కూడా ప్రభుత్వ విధానాలలో పెద్ద మార్పులు తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతాయని స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఆశిస్తున్నారు. (చదవండి: బడ్జెట్ 2021–22.. ఫోకస్) గతంలో "మేకిన్ ఇండియా" ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నేపథ్యంలో దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సెల్యులార్ హ్యాండ్సెట్లపై కస్టమ్స్ సుంకాన్ని 20%కి పెంచారు. అయితే, ఇండస్ట్రీ బాడీ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసిఇఎ) మొబైల్ పరిశ్రమపై విధించిన వస్తు, సేవల పన్ను(జీఎస్టి)ను తగ్గించాలనే డిమాండ్‌ను మళ్లీ కేంద్రం ముందుకు తీసుకొచ్చింది. గత ఏడాది మార్చిలో మొబైల్ పరిశ్రమపై 50శాతం పన్నును అధికంగా విధించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతికి కోసం మరింత ప్రోత్సాహం ఇస్తుందని వారు భావిస్తున్నారు. ప్రతి భారతీయుడికి స్మార్ట్‌ఫోన్ అందించాలంటే మొబైల్ ఫోన్లపై విధించిన జీఎస్టిని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించడం అత్యవసరం అని ఐసీఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ ఒక ప్రకటనలో చెప్పారు. ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోసం రూ.500 కోట్లు, మొబైల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్లు బడ్జెట్ లో కేటాయించాలని ఐసీఇఎ కేంద్రానికి సిఫారసు చేసింది. మరోవైపు మొబైల్ ఫోన్, కాంపోనెంట్ తయారీదారులు ఎగుమతి ప్రోత్సాహకాలు అందించడంతో పాటు మొబైల్ భాగాలపై తక్కువ జీఎస్టీని విధించాలని కోరుకుంటున్నారు. "సబ్ $200 ఎంట్రీ లెవల్(రూ.15,000) మొబైల్ ఫోన్ విభాగంలో స్వదేశీ హ్యాండ్సెట్ తయారీదారులు ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉండటానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది" అని ఐసీఇఎ తెలిపింది. -
డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్‌పై.. విదేశీ పెత్తనం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలంలో కాటన్ ఎగుమతి చేసి బట్ట లు దిగుమతి చేసుకునేవాళ్లమని పెద్దలు చెబుతుంటారు. ఇదే తరహాలో మన దేశం ఒక విచిత్ర సమస్య ఎదుర్కొంటోంది. మనం సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ప్లాట్‌ఫామ్‌లు మనమే క్రియేట్ చేసి ఇస్తున్నాం. కంటెంట్ మనదే. పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు మనవాళ్లే. ప్రకటనలపై వెచ్చించేది మనవాళ్లే. ఆదాయం మాత్రం.. ఈ ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇస్తున్న విదేశీ డిజిటల్ యాడ్స్ ఏజెన్సీలది. మనకు గూగుల్ కేవలం ఒక సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే తెలుసు. కానీ దీని ప్రధాన ఆదాయ వనరు డిజిటల్ యాడ్స్. కం పెనీల నుంచి యాడ్స్ తీసుకోవడం, డిజిటల్ పబ్లిషర్స్‌కు ప్రచురించేందుకు ఇవ్వడం. దీని ద్వారా డిజిటల్ పబ్లిషర్స్‌కు కొంత ఇవ్వడం, అది కొంత వాటా తీసుకోవడం. ఫేస్బుక్ మనకు కేవలం సోషల్ మీడియాగానే తెలుసు. కానీ మనం ఒక యాడ్ ఇవ్వాలనుకున్నా, ఒక పోస్ట్ చాలా మందికి చేరాల నుకున్నా మనం డబ్బులు వెచ్చించాలి. అంటే కేవలం తన సోషల్ మీడియా యాప్‌లోనే యాడ్స్ ప్రచురించి సొమ్ము చేసు కుంటుంది. యూజర్స్ మనమే. డబ్బులు వెచ్చించేది చాలావరకు భారతీయ కంపెనీలే. చూసేది మనమే. క్లిక్ చేసేది మనమే. ఆయా యాప్‌లను నిర్మించింది, నిర్మించే సత్తా ఉంది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే. ఈ యాప్‌లు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి. కానీ మన పబ్లిషర్లకు పెద్దగా మిగిలిందేమీ లేదు. చైనా యాప్స్ బ్యాన్ ప్రభావం ఎలా ఉండబోతోంది.. 59 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం, వోకల్ ఫర్ లోకల్ పిలుపు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇండియా డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ రంగం స్వదేశీ కంపెనీలను ఆకర్షిస్తోంది. 80 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్న దేశంలో ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇచ్చే డిజిటల్ ఏజెన్సీలకు, స్వదేశీ సోషల్ మీడియా యాప్‌లకు, ఆన్లైన్ వీడియో యాప్‌లకు, స్వదేశీ ఓటీటీలకు భారీ అవకాశాలు ముందున్నాయి. అలాగే స్వదేశీ బ్రౌజర్లు, స్వదేశీ న్యూస్ అగ్రిగేటర్లు, స్వదేశీ న్యూస్ యాప్‌లకు బోలెడు అవకాశాలు ఆహ్వానం పలుకనున్నాయి. కంటెంట్, యూజర్లు, ప్రకటనలకు కొదవలేనందున ప్లాట్‌ఫామ్‌లు కూడా స్వదేశీ అయితే దేశ ఆర్థిక వృద్ధిలో అవీ భాగమవుతాయి. డెంట్సూ నివేదిక ఏం చెప్పింది? గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, టిక్‌టాక్ యాడ్స్(టిక్‌టాక్ యాప్‌ను కేంద్రం బ్యాన్ చేసింది) ఇలాంటి డిజిటల్ యాడ్ ఏజెన్సీల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో డెంట్సూ ఏజిస్ నెట్వర్క్(డీఏఎన్) తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం డిజిటల్ అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీ 2019–20 నాటికి రూ. 13,683 కోట్ల టర్నోవర్‌తో ఉంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 26 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2020–21 నాటికి ఇది రూ.17 వేల కోట్లకు చేరనుంది. అలాగే 2022 నాటికి డిజిటల్ అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీ రూ.28,249 కోట్లకు, 2025 నాటికి రూ.58,550 కోట్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల ఇండస్ట్రీ టర్నోవర్ మొత్తం మన దేశంలో రూ.68,475 కోట్లు ఉండగా.. 2025 నాటికి రూ.1,33,921 కోట్లకు చేరనుంది. ఈ రంగం ఏటా 11 శాతం వృద్ధి సాధిస్తుండగా.. డిజిటల్ యాడ్స్ రంగం మాత్రం ఏటా 27.42 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకోనుందని డెంట్సూ ఏజిస్ నెట్వర్క్(డీఏఎన్) తన నివేదికలో తెలిపింది. దూసుకుపోతున్న మొబైల్ యాడ్ మార్కెట్ చవకైన డేటా ప్లాన్స్, స్మార్ట్ ఫోన్ల అందుబాటు కారణంగా డిజిటల్ యాడ్స్‌పై వెచ్చించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్లలో మొబైల్ యాడ్స్‌పై వెచ్చించే మొత్తం ప్రస్తుతం 40 శాతం ఉంది. అది ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 52 శాతానికి చేరనుంది. మిలీనియల్స్‌ను దృష్టిలోపెట్టుకుని అడ్వర్టయిజ్మెంట్లపై కంపెనీలు వెచ్చించడం ఇటీవల పెరిగింది. యువత వీటిపై రోజుకు సగటున 2.5 గంటలు వెచ్చిస్తున్నట్టు డీఏఎన్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్, టిక్‌టాక్, ఫేస్బుక్, షేర్‌చాట్, రొపోసో వంటి సోషల్ మీడియా యాప్స్ నిండా మిలీనియల్స్‌ను దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ఉంటుంది. అలాగే మ్యూజిక్ యాప్‌లు, యూట్యూబ్ వీడియోలు.. ఇలా డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్లకు వేదికగా మారాయి. డిజిటల్ అడ్వర్జయిమెంట్ వ్యయం సోషల్ మీడియాపై 28 శాతం ఉండగా.. పెయిడ్ సెర్చ్‌పై 25 శాతం, ఆన్లైన్ వీడియోపై 22 శాతం ఉంది. ఆన్లైన్ వీడియోలపై వెచ్చించే డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ల వృద్ధిరేటు 32 శాతంగా ఉంది. -
మొబైల్ పరిశ్రమకు భారీ రాయితీలు
పెట్టుబడుల ఆకర్షణకు ప్రోత్సాహకాలు మైక్రోమాక్స్‌కు పెద్దఎత్తున రాయితీలు మొబైల్ పాలసీ తయారీపై టీ-స్విప్ట్ కసరత్తు ఈఎంసీల్లో మొబైల్ తయారీ పరిశ్రమలు సాక్షి, హైదరాబాద్: మొబైల్ తయారీ పరిశ్రమలకు భారీ రాయితీలు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టీ-స్విప్ట్ బోర్డు (పెట్టుబడుల ఆహ్వాన సంస్థ) ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో తొలిసారిగా మొబైల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన మైక్రోమాక్స్ సంస్థకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను ‘మొబైల్ పాలసీ’ రూపంలో ఇతర పరిశ్రమలకు వర్తింపచేయాలని భావిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రిమండలి ఆమోదం తర్వాత మొబైల్ విధానం ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ‘ఈ-సిటీ’ (ఫ్యాబ్‌సిటీ)లో రూ.30 లక్షలకు ఎకరం చొప్పున 18.66 ఎకరాలు మైక్రోమాక్స్‌కు కేటాయించాలని నిర్ణయించింది. మౌలిక సౌకర్యాల కల్పనకయ్యే వ్యయంతో సంబంధం లేకుండా నామమాత్ర ధరకు మైక్రోమాక్స్ తరహాలో ఇతర పరిశ్రమలకు భూమి కేటాయించనున్నారు. అనుబంధ పరిశ్రమలతో కలుపుకొని రూ.10 కోట్లకు మించకుండా పెట్టుబడిలో 20 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. వంద శాతం స్టాంపు డ్యూటీని పరిశ్రమలకు తిరిగి చెల్లించడంతోపాటు పెట్టుబడిలో 50 శాతం మొత్తానికి 5.25 శాతం వార్షిక వడ్డీ వర్తింపచేయాలని టీ-స్విప్ట్ బోర్డు ప్రతిపాదించింది. మొబైల్ ఉత్పత్తులపై 5 శాతం వ్యాట్‌ను విధించడంతో పాటు సీఎస్టీని (కేంద్ర అమ్మకపు పన్ను) రెండు శాతం తగ్గించాలని పేర్కొంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) నిర్ణయించిన ధరలకు అనుగుణంగా మొబైల్ పరిశ్రమలకు 25 శాతం లేదా గరిష్టంగా రూ.30 లక్షలకు మించకుండా రాయితీ ఇవ్వనున్నారు. అయితే నియామకాల్లో 80 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలని టీ-స్విప్ట్ ప్రతిపాదిస్తోంది. రాష్ట్రానికి రెండు ఈఎంసీలు ఎలక్ట్రానిక్ వ్యవస్థల రూపకల్పన, ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో రెండు ఈఎంసీల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వీటిలో ఒకటి ఫ్యాబ్‌సిటీ (602 ఎకరాలు), మరొకటి మహేశ్వరంలో (310 ఎకరాలు) ఏర్పాటు కానున్నాయి. ఈఎంసీల అభివృద్ధికి అవసరమైన నిధులను 50 నుంచి 75 శాతం వరకు ప్రాజెక్టు విస్తీర్ణాన్ని బట్టి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీఎస్ఐఐసీ ద్వారా అభివృద్ధి చేసే ఈఎంసీల్లో మొబైల్ తయారీ పరిశ్రమల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మొబైల్ పరిశ్రమలకు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు భారీ రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ మొబైల్ తయారీ పరిశ్రమ వేళ్లూనుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మైక్రోమాక్స్‌కు ఇవాల్సిన రాయితీల ప్రతిపాదనలను ఆమోదిస్తే, ఇతర పరిశ్రమలూ ముందుకొస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. -
మొబైల్ పరిశ్రమతో 41 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం మొబైల్ పరిశ్రమ(మొబైల్ ఎకానమీ) 2020 నాటికి 41 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దీని వాటా 400 బిలియన్ డాలర్ల మేర ఉండనుంది. మొబైల్ ఎకానమీ ఇండియా 2013 పేరిట అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య జీఎస్ఎంఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కలిసి జీఎస్ఎంఏ దీన్ని రూపొందించింది. మొబైల్ ఎకానమీ వల్ల టెలికం మౌలిక సదుపాయాల కల్పన కోసం 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగలవని జీఎస్ఎంఏ వివరించింది. దేశీయ మొబైల్ పరిశ్రమ చాలా వేగంగా ఎదుగుతోందని, అయితే లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే నియంత్రణ వ్యవస్థ ప్రస్తుతం కరువైందని జీఎస్ఎంఏ డెరైక్టర్ జనరల్ యాన్ బూవెరాట్ తెలిపారు. గతేడాది గణాంకాల ప్రకారం 2012 జీడీపీలో మొబైల్ పరిశ్రమ వాటా 5.3 శాతంగా ఉండగా, ప్రత్యక్షంగా 7,30,000 మందికి, పరోక్షంగా ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించిందని వివరించారు. పరిశ్రమ మరింతగా పురోగమించాలంటే స్పెక్ట్రమ్ కేటాయింపులు తదితర అంశాల్లో దీర్ఘకాలిక మైన, సరళమైన విధానాలు అవసరమవుతాయని బూవెరాట్ చెప్పారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రభుత్వంతోనూ, ఇతర అనుబంధ పరిశ్రమలతోనూ కలిసి పనిచేసేందుకు మొబైల్ రంగం సిద్ధంగా ఉందని జీఎస్ఎంఏ ఇండియా డెరైక్టర్ సందీప్ కరణ్వాల్ తెలిపారు.