ఎయిర్‌టెల్ లాభం 29% డౌన్
న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 29 శాతం దిగజారి రూ.512 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.721.2 కోట్లుగా ఉంది. లాభాలు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది 15వ క్వార్టర్ కావడం గమనార్హం. అయితే, కంపెనీ నిర్వహణ మార్జిన్లు మెరుగుపడటం భవిష్యత్తులో దేశీ టెలికం కంపెనీలకు మంచిరోజులు రానున్నాయనే ఆశలను చిగురింపజేస్తోంది. కాగా, క్యూ2లో తమ లాభాలు తగ్గుముఖం పట్టడానికి ప్రధానంగా రుణ చెల్లింపుల వ్యయాలు అధికం కావడం, రూపాయి విలువ క్షీణత వల్ల తలెత్తిన ఫారెక్స్ నష్టాలు(రూ.342 కోట్లు) కారణంగా నిలిచాయని కంపెనీ వెల్లడించింది.
మెరుగైన ఎబిటా...: వడ్డీ, పన్నులు, తరుగుదలను తీసేయడానికి ముందు(ఎబిటా) నిర్వహణ మార్జిన్‌లు క్యూ2లో 32 శాతంగా నమోదయ్యాయని(క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో 30.6 శాతం) భారతీ గ్రూప్ సీఎఫ్‌ఓ సర్వ్‌జిత్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దేశీ టెలికం మార్కెట్లో కొంత సానుకూల పరిస్థితులు కనబడుతున్నాయని ఆయన చెప్పారు.
డేటా టారిఫ్‌ల పెంపు తోడ్పాటు..: ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ2లో రూ.21,343 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ2లో రూ.19,408 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి చెందింది. డేటా సేవలపై దృష్టిసారిస్తున్న ఎయిర్‌టెల్‌కు ఈ సెప్టెంబర్ క్వార్టర్‌లో మొబైల్ ఇంటర్నెట్ విభాగం నుంచి రూ.1,503 కోట్ల ఆదాయం(39% వృద్ధి) లభించింది. కాగా, మొబైల్ ఇంటర్నెట్ రేట్లను గత నెలలో ఎయిర్‌టెల్ 25% పెంచడంతోపాటు కొన్ని ప్రోత్సాహక స్కీమ్‌లలో ప్రయోజనాలను 50% మేర కోత విధించింది. భారత్‌లో టారిఫ్‌లు ఇప్పటికీ చాలా తక్కువస్థాయిలోనే ఉన్నాయని కంపెనీ జాయింట్ ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ చెప్పారు. అయితే, ప్రధాన టారిఫ్‌లలో ఇప్పటిదాకా ఎలాంటి పెంపు చేయలేదన్నారు. తద్వారా భవిష్యత్తులో మరిన్ని రేట్ల పెంపు సంకేతాలిచ్చారు. ప్రోత్సాహకాలను మరింత తగ్గించేందుకు అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
ఇతర ముఖ్యాంశాలివీ...
- క్యూ2లో కంపెనీకి భారత్‌లో 25 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు జతయ్యారు. సెప్టెంబర్ చివరికి యూజర్ల సంఖ్య 19.34 కోట్లకు చేరింది.
- ఒక్కో కస్టమర్ నుంచి నెలవారీ సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) కూడా క్యూ2లో 192కు చేరింది. క్రితం క్యూ2తో పోలిస్తే రూ.15 పెరిగింది.
- ఇక ఆఫ్రికా ప్రాంతంలో క్యూ2 నష్టాలు మరింత పెరిగాయి. గత క్యూ2లో 9.7 కోట్ల డాలర్లు కాగా, తాజా క్యూ2లో నష్టం 10.5 కోట్ల డాలర్లకు చేరాయి. అయితే, ఆదాయం 109.7 కోట్ల డాలర్ల నుంచి 111.9 కోట్ల డాలర్లకు వృద్ధి చెందింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 220-230 కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రణాళికలకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
- కాగా, కంపెనీ షేరు ధర బుధవారం బీఎస్‌ఈలో 5.23 శాతం ఎగబాకి రూ.359 వద్ద స్థిరపడింది.