ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ తొలుత దాదాపు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 488కు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 471 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) భారీగా మెరుగుపడటంతో ఎయిర్‌టెల్ కౌంటర్‌కు జోష వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..
రూ. 162కు
క్యూ2లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎయిర్‌టెల్ రూ. 763 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ2లో నమోదైన రూ. 23,045 కోట్లతో పోలిస్తే నష్టం 97 శాతం తగ్గడం గమనార్హం! కాగా.. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఈ క్యూ2లో రూ. 25,785 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది 22 శాతం అధికంకాగా.. డేటా వినియోగం 58 శాతం పెరిగినట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. దేశీయంగా ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 18,747 కోట్లను తాకింది. ప్రధానంగా ఏఆర్‌పీయూ రూ. 128 నుంచి రూ. 162కు ఎగసింది. క్యూ1లో సాధించిన రూ. 157తో పోల్చినా ఇది అధికమే. ఈ కాలంలో 4జీ డేటా కస్టమర్ల సంఖ్య 15.27 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. 1.44 కోట్ల మంది కొత్తగా జమ అయినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment