న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ వన్‌వెబ్ సేవల టారిఫ్‌లు పాశ్చాత్య దేశాల్లోని మొబైల్ సర్వీసుల రేట్ల స్థాయిలో ఉంటాయని కంపెనీ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు. ఇవి భారత్‌లో ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్న టారిఫ్‌లకు సమానంగా మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. ఒక ఊళ్లో 30–40 ఇళ్లు ఒక కమ్యూనిటీగా సర్వీసులను వినియోగించుకుంటే కాస్త చౌకగా ఉండవచ్చని కానీ వ్యక్తిగతంగా ఒక్కరు వాడుకోవాలంటే మాత్రం ఖరీదైనవిగానే ఉండవచ్చని మిట్టల్ చెప్పారు.
‘మొబైల్ టారిఫ్‌ల స్థాయిలో శాటిలైట్ కమ్యూనికేషన్ ధర ఉంటుందా అని ప్రశ్నిస్తే .. ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న వాటి స్థాయిలో ఉండవచ్చు. భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు నెలకు 2 – 2.5 డాలర్ల స్థాయిలో (సుమారు రూ. 164– రూ. 205) ఉన్నాయి. ఆ రేట్లకు మాత్రం శాటిలైట్ కమ్యూనికేషన్ టారిఫ్‌లు ఉండవు. ఎందుకంటే అవి అత్యంత కనిష్ట రేట్లు‘ అని ఆయన పేర్కొన్నారు.
అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించే వన్‌వెబ్‌కు సంబంధించిన 36 ఉపగ్రహాలను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ప్రయోగించిన సందర్భంగా మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఎల్‌వీఎం–3 (లాంచ్ వెహికల్ మార్క్–3) వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనితో వన్‌వెబ్‌కి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 618కి చేరింది. తమకు ఉపగ్రహ సర్వీసులను ఆవిష్కరించేందుకు పర్మిట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పేస్‌కామ్ పాలసీని ప్రవేశపెట్టి, స్పెక్ట్రం కేటాయించే వరకు వేచి ఉండాల్సి ఉంటుందని మిట్టల్ తెలిపారు. భారత్‌లో యూజర్ శాటిలైట్ టెర్మినల్స్ తయారీ కోసం కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment