OneWeb
-
రెండు కంపెనీలకు ఐఎస్పీ లైసెన్స్
న్యూఢిల్లీ: జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వన్‌వెబ్ తాజాగా టెలికం శాఖ నుంచి ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ (ఐఎస్పీ) లైసెన్స్ అందుకున్నట్టు సమాచారం. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు ఈ రెండు సంస్థలకు ఏడాది క్రితమే అనుమతులు లభించాయి. ఈ కంపెనీలు టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌లతో లేదా వీశాట్ ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించవచ్చని ఒక అధికారి తెలిపారు. -
ONEWEB: ఇస్రో కీర్తి కిరీటంలో... మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఇస్రో మరో అద్భుత వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 36 వన్‌వెబ్ ఇండియా–2 ఇంటర్నెట్ సమాచార ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అత్యంత బరువైన ఎల్వీఎం3–ఎం3 బాహుబలి రాకెట్ వాటిని తీసుకుని ఆదివారం ఉదయం 9.00 గంటలకు నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ 36 ఉపగ్రహాలను 97 నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడుతలుగా భూమికి అతి తక్కువ దూరంలో లోయర్ ఎర్త్ లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. అవన్నీ కక్ష్యలోకి చేరాయని, అంటార్కిటికా గ్రౌండ్‌స్టేషన్ నుంచి సిగ్నల్స్ అందాయని ఇస్రో ప్రకటించింది. వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 2022 అక్టోబర్ 23న తొలి బ్యాచ్‌లో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం తెలిసిందే. తాజా ప్రయోగంతో మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ఇస్రో స్థాయి పెరిగింది: చైర్మన్ సోమనాథ్ ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు పరస్పరం అలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ‘‘ఇది టీం వర్క్. ప్రపంచంలోనే అద్భుతమైన విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలను పెంచినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం చరిత్రాత్మకమైనది. దీనివల్ల ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల ప్రయోజనాలకు మరింత బలం చేకూరింది. ఇదే ఊపులో పీఎస్ఎల్వీ సీ55 రాకెట్ ద్వారా ఏప్రిల్‌లో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ ఏడాది చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1తో పాటు మరో నాలుగు ప్రయోగాలు చేసే అవకాశముంది’’ అని చెప్పారు. వాణిజ్య ప్రయోగాలకు ఎల్వీఎం3 రాకెట్ ఎంతో ఉపయోగకారి అని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డి.రాధాకృష్ణన్, మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ చెప్పారు. ఆత్మనిర్భరతకు తార్కాణం ప్రధాని మోదీ అభినందనలు వన్‌వెబ్ ఇండియా–2 ప్రయోగం దిగ్విజయం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘‘వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అంతర్జాతీయంగా భారత్ పై చేయిని ఈ ప్రయోగం మరింత దృఢపరిచింది. ఆత్మనిర్భరత స్ఫూర్తిని ఎలుగెత్తి చాటింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. -
వన్‌వెబ్ సేవలు చౌకగా ఉండవు..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ వన్‌వెబ్ సేవల టారిఫ్‌లు పాశ్చాత్య దేశాల్లోని మొబైల్ సర్వీసుల రేట్ల స్థాయిలో ఉంటాయని కంపెనీ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు. ఇవి భారత్‌లో ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్న టారిఫ్‌లకు సమానంగా మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. ఒక ఊళ్లో 30–40 ఇళ్లు ఒక కమ్యూనిటీగా సర్వీసులను వినియోగించుకుంటే కాస్త చౌకగా ఉండవచ్చని కానీ వ్యక్తిగతంగా ఒక్కరు వాడుకోవాలంటే మాత్రం ఖరీదైనవిగానే ఉండవచ్చని మిట్టల్ చెప్పారు. ‘మొబైల్ టారిఫ్‌ల స్థాయిలో శాటిలైట్ కమ్యూనికేషన్ ధర ఉంటుందా అని ప్రశ్నిస్తే .. ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న వాటి స్థాయిలో ఉండవచ్చు. భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు నెలకు 2 – 2.5 డాలర్ల స్థాయిలో (సుమారు రూ. 164– రూ. 205) ఉన్నాయి. ఆ రేట్లకు మాత్రం శాటిలైట్ కమ్యూనికేషన్ టారిఫ్‌లు ఉండవు. ఎందుకంటే అవి అత్యంత కనిష్ట రేట్లు‘ అని ఆయన పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించే వన్‌వెబ్‌కు సంబంధించిన 36 ఉపగ్రహాలను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ప్రయోగించిన సందర్భంగా మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఎల్వీఎం–3 (లాంచ్ వెహికల్ మార్క్–3) వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనితో వన్‌వెబ్‌కి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 618కి చేరింది. తమకు ఉపగ్రహ సర్వీసులను ఆవిష్కరించేందుకు పర్మిట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పేస్‌కామ్ పాలసీని ప్రవేశపెట్టి, స్పెక్ట్రం కేటాయించే వరకు వేచి ఉండాల్సి ఉంటుందని మిట్టల్ తెలిపారు. భారత్‌లో యూజర్ శాటిలైట్ టెర్మినల్స్ తయారీ కోసం కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. -
వన్‌వెబ్ మరోసారి ప్రయోగం
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్స్ రంగ కంపెనీ వన్‌వెబ్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో (ఇస్రో) కలిసి 36 ఉపగ్రహాలను మార్చి 26న ప్రయోగించనుంది. భూమికి తక్కువ కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్) వీటిని పంపుతారు. జూలై–ఆగస్ట్ నాటికి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధమని వన్‌వెబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఫిబ్రవరిలో వెల్లడించారు. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి కంపెనీకి లైసెన్స్ దక్కింది. అయితే ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించాల్సి ఉంది. ‘శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవి నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. వన్‌వెబ్ ఇప్పటికే 17సార్లు ఉపగ్రహాలను పంపింది. ఈ ఏడాది మూడవ పర్యాయం ప్రయోగిస్తోంది. మొదటి తరం లో ఎర్త్ ఆరిŠబ్ట్ (లియో) కూటమిని పూర్తి చేసి 2023లో కంపెనీ అంతర్జాతీయంగా కవరేజీని ప్రారంభించేందుకు ఈ ప్రయోగం వీలు కల్పిస్తుంది. కంపెనీ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి’ అని వన్‌వెబ్ తెలిపింది. -
వన్‌వెబ్ 40 ఉపగ్రహాల ప్రయోగం..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్‌వెబ్ తాజా స్పేస్ఎక్స్తో కలిసి 40 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని ప్రయోగించినట్లు వివరించింది. దీంతో తాము మొత్తం 582 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లయిందని పేర్కొంది. కనెక్టివిటీ సామర్థ్యాలను పెంచుకోవడంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయని వన్‌వెబ్ సీఈవో నీల్ మాస్టర్సన్ తెలిపారు. -
మరోసారి 36 ఉపగ్రహాలు ప్రయోగానికి ‘వన్‌వెబ్’ ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు గ్లోబల్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ సంస్థ వన్‌వెబ్ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక మార్క్–3 నుంచి ఈ ఏడాది మార్చి తొలివారంలో ఈ ప్రయోగం చేపట్టనున్నారు. 36 ఉపగ్రహాలు తమ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరాయని, వాటి గమ్యస్థానం భారత్ అంటూ వన్‌వెబ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మాసిమిలియానో లాడోవెజ్ ట్వీట్ చేశారు. వన్‌వెబ్ సంస్థ గత అక్టోబర్ 22న శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక ఎల్వీఎం–3 నుంచి 36 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించడం తెలిసిందే. -
యూటెల్శాట్తో వన్‌వెబ్ విలీనం
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కి చెందిన ఉపగ్రహాల ఆపరేటర్ యూటెల్‌శాట్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ వన్‌వెబ్ విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ డీల్ పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో ఉండనుంది. ఇరు సంస్థల సంయుక్త ప్రకటన ప్రకారం వన్‌వెబ్ విలువను 3.4 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 27,000 కోట్లు) లెక్కకట్టారు. ప్రస్తుతం వన్‌వెబ్‌లో కీలక భాగస్వామి అయిన దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ .. డీల్ పూర్తయిన తర్వత యూటెల్‌శాట్‌లో అతి పెద్ద వాటాదారుగా ఉండనుంది. విలీన సంస్థకు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్ కో–చైర్మన్‌గాను, ఆయన కుమారుడు శ్రావిన్ భారతి మిట్టల్ .. డైరెక్టరుగా ఉంటారు. యూటెల్‌శాట్ ప్రస్తుత చైర్మన్ డొమినిక్ డి హినిన్ .. విలీన సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీల్ ప్రకారం వన్‌వెబ్ షేర్హోల్డర్లకు యూటెల్‌శాట్ కొత్తగా 23 కోట్ల షేర్లను జారీ చేస్తుంది. తద్వారా పెరిగిన షేర్ క్యాపిటల్‌లో ఇరు సంస్థల షేర్‌హోల్డర్ల వాటా చెరి 50 శాతంగా ఉండనుంది. వన్‌వెబ్‌లో 100 శాతం వాటాలు యూటెల్‌శాట్‌కు దఖలుపడతాయి. 2023 ప్రథమార్ధంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. యూటెల్‌శాట్‌కు 36 జియోస్టేషనరీ ఆర్బిట్ (జియో) ఉపగ్రహాలు ఉండగా, వన్‌వెబ్‌కు 648 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. -
గుడ్ న్యూస్: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు..ఎప్పటి నుంచంటే!
న్యూఢిల్లీ: భారతీ గ్రూపు ప్రధాన వాటాదారుగా ఉన్న ‘వన్ వెబ్’ ఇస్రో వాణిజ్య కంపెనీ అయిన ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’తో ఒప్పందం చేసుకుంది. దీంతో వన్‌వెబ్ తన శాటిలైట్ల విడుదల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. న్యూ స్పేస్ ఇండియాతో కలసి వన్‌వెబ్ మొదటి శాటిలైట్ లాంచ్ కార్యక్రమం 2022లోనే శ్రీహరికోటలోని షార్ నుంచి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శాటిలైట్ నెట్వర్క్ అభివృద్ధికి, సురక్షితమైన అనుసంధానాన్ని కల్పన కోసం పనిచేస్తున్నట్టు వన్‌వెబ్ ప్రకిటించింది. అంతరిక్ష రంగంలో సహకారానికి మరొక చరిత్రాత్మక రోజుగా పేర్కొంది.‘‘శాటిలైట్ల ఆవిష్కరణ విషయంలో తాజా ఒప్పందం, వన్‌వెబ్ నెట్ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. అంతర్జాతీయంగా కమ్యూనిటీలను అనుసంధానించాలన్న మా ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు అంతరిక్షం రంగంలో మేము కలసి పనిచేస్తాం’’అని వన్‌వెబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. కజకిస్థాన్‌లో రష్యా నిర్వహించే బైకోనర్ కాస్మోడ్రోన్ నుంచి శాటిలైట్ల ఆవిష్కరణను నిలిపివేస్తున్నట్టు వన్‌వెబ్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన నేపథ్యంలో తాజా ఒప్పందం కుదరడం గమనార్హం. శాటిలైట్లు, టెక్నాలజీని సైనిక అవసరాలకు వినియోగించబోమంటూ హామీ ఇవ్వాలని రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్‌కాస్మోస్ కోరడమే ఈ నిర్ణయం వెనుక కారణం. తక్కువ కక్ష్యలో పరిభ్రమించే శాటిలైట్ల సాయంతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే సంస్థే వన్‌వెబ్. మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన నెట్ సేవలు అందించొచ్చు. ఈ కంపెనీలో భారతీ గ్రూపు పెద్ద వాటాదారుగా ఉండగా, బ్రిటన్ ప్రభుత్వానికి సైతం వాటాలున్నాయి. భారత్‌లో వన్‌వెబ్‌కు లైసెన్స్ భారత్ మార్కెట్లో శాటిలైట్ సేవలు అందించేందుకు వన్‌వెబ్ కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ సంపాదించింది. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్‌ను వన్‌వెబ్‌కు టెలికం శాఖ మంజూరు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2022 మధ్య నుంచి భారత్ మా ర్కెట్లో సేవలు అందించాలన్న వన్‌వెబ్ లక్ష్యం తాజా లైసెన్స్ రాకతో సాకారం కానుంది. చదవండి👉 భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..! -
రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. స్వదేశీ కంపెనీ మెడ మీద వేలాడుతున్న కత్తి..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఆ దాడుల ప్రభావం ఇప్పుడు ఇతర రంగాల మీద కూడా పడుతుంది. ఈ దాడుల వల్ల లో ఎర్త్ ఆర్బిట్(లియో) బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్ వెబ్ దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రష్యా 24 టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ మాట్లాడుతూ.. వన్ వెబ్ తన ఉపగ్రహాలను సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని హామీ ఇవ్వకపోతే, మార్చి 4న దాని ఉపగ్రహ ప్రయోగాన్ని నిలిపి వేయనున్నట్లు తెలిపారు. ఈ వన్ వెబ్ కంపెనీలో ఎయిర్‌టెల్‌కు చెందిన భారతి గ్లోబల్ గ్రూప్‌కు ఎక్కువ వాటా ఉంది. కజకస్తాన్ నుంచి రష్యా అద్దెకు తీసుకున్న బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి 36 ఉపగ్రహాలను మార్చి 4న ప్రయోగించడానికి వన్ వెబ్ ప్రణాళికలు వేసింది. అయితే, మార్చి 4న మాస్కో సమయం 21:30 వరకు వన్ వెబ్ సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని హామీ ఇవ్వకపోతే ఉపగ్రహాలను ప్రయోగించడానికి వినియోగిస్తున్న సోయుజ్-2.1బీ అంతరిక్ష వాహన నౌక వాడకాన్ని అంతరిక్ష సంస్థ అనుమతించదని రోగోజిన్ తెలిపారు. తన ఉపగ్రహాలను రష్యాకు వ్యతిరేకంగా సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని వన్ వెబ్ హామీలను అందించాలని తన ఏజెన్సీ కోరుకుంటున్నట్లు రోగోజిన్ తెలిపినట్లు ఇంటర్ ఫ్యాక్స్ వార్తా సంస్థ నివేదించింది. ❗️ В связи с враждебной позицией Великобритании в отношении России еще одним условием запуска космических аппаратов OneWeb 5 марта является выход британского правительства из состава акционеров компании OneWeb. 🔗 Подробнее: https://t.co/HHbGC0DY12 pic.twitter.com/M6FnQeKC4K — РОСКОСМОС (@roscosmos) March 2, 2022 నవంబర్ 2020లో దివాలా అంచున ఉన్న వన్ వెబ్ కంపెనీలో యుకె ప్రభుత్వం, భారతి గ్లోబల్ కన్సార్టియం కలిసి 650 లియో ఉపగ్రహాల ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సేవలను అందించడానికి సంస్థలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టుబడి పెట్టాయి. వన్ వెబ్ ఇప్పటికే 400కు పైగా ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని రద్దు చేస్తే రష్యా-ఉక్రెయిన్ దాడి వల్ల ప్రత్యక్ష పర్యవసానాన్ని ఎదుర్కొన్న మొదటి భారతీయ కార్పొరేట్ కంపెనీగా భారతి గ్రూప్ నిలవనుంది. గత ఏడాది జూన్ నెలలో అతిపెద్ద వాటాదారుగా మారడానికి వన్ వెబ్ సంస్థలో అదనంగా 500 మిలియన్ డాలర్లు(రూ.3,700 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు భారతి గ్రూప్ తెలిపింది. $550 మిలియన్ పెట్టుబడితో వన్ వెబ్'లో భారతి గ్రూప్ 38.6 శాతం వాటా కలిగి ఉంది. యుకె ప్రభుత్వం, యూటెల్‌శాట్, సాఫ్ట్ బ్యాంక్ ఒక్కొక్కటి 19.3 శాతం వాటా కలిగి ఉన్నట్లు వన్ వెబ్ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!) -
ఎలన్‌మస్క్‌కు గట్టిపోటీ..! దూకుడు పెంచిన ఎయిర్టెల్..!
స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను భారత్ ప్రవేశపెట్టాలనే ఎలన్‌మస్క్ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. దీంతో స్టార్‌లింక్ సేవలు పూర్గిగా నిలిచిపోయాయి. ఇక స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు పోటీగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది. 34 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..! భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్ ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి ఏరియన్‌స్పేస్ రాకెట్ సహాయంతో 34 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వన్‌వెబ్ శుక్రవారం ధృవీకరించింది. 2022లో కంపెనీ ప్రారంభించిన తొలి ప్రయోగం ఇది. ఇది 13 వ ప్రయోగం. వన్‌వెబ్ ఇప్పటివరకు 428 శాటిలైట్లను ప్రయోగించింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రయోగంలో ఇప్పటివరకు 66 శాతం ఉపగ్రహాలను వన్ వెబ్ విజయవంతంగా పూర్తి చేసింది. మరింత వేగంగా..! వన్ వెబ్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది. స్టార్‌లింక్ సేవలకు పోటీగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల ప్రయోగాలను ముమ్మురం చేసింది. కంపెనీకి భారతీ ఎయిర్టెల్ తోడవడంతో మరింత వేగంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తెచ్చేందుకు సిద్దమైంది వన్ వెబ్. ఇటీవల హ్యూస్ నెట్వర్క్ సిస్టమ్స్, మార్లింక్ అండ్ ఫీల్డ్ సొల్యూషన్స్ హోల్డింగ్స్‌తో సహా పలు కంపెనీలతో వన్ వెబ్ గత నెలలో కీలక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేసింది. చదవండి: గూగుల్ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్..! -
స్టార్ లింక్‌కు షాక్.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక అడుగు..!
మన దేశంలో అందరి కంటే ముందుగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని చూసిన స్టార్ లింక్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ లింక్ కంటే ముందే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు వన్ వెబ్ సిద్దం అవుతుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అంధించడానికి ప్రముఖ నెట్వర్క్ సంస్థ భారతి ఎయిర్టెల్, యుకె ప్రభుత్వ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ వన్ వెబ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ హ్యూస్ వ్యూహాత్మక ఆరు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం మీద సంతక చేశాయి. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి హైదరాబాద్‌కి చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్లో ఎయిర్టెల్ సుమారు 33 శాతం, హ్యూస్ కమ్యూనికేషన్స్ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ భారత్‌లో శాటిలైల్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు. ముఖ్యంగా ఫైబర్ కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వన్ వెబ్ నెట్వర్క్ పట్టణాలు, గ్రామాలు, స్థానిక & ప్రాంతీయ మున్సిపాలిటీలలోని కష్టతరమైన ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించగలదు అని కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. 2022 చివరలో ప్రారంభం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఎయిర్టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్‌తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్ ఆపరేటర్‌గా హ్యూస్ కమ్యూనికేషన్స్ నిలుస్తోంది. బ్యాంకింగ్, ఏరోనాటికల్, మేరీటైమ్ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ వల్ల దేశంలోని లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించవచ్చు అని వన్ వెబ్ సీఈఓ నీల్ మాస్టర్సన్ తెలిపారు. ఈ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల 2022 చివరి నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?)