29 పారామీటర్ జాబితా నుంచి ఆధార్ తొలగింపు (ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీ : డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తప్పనిసరి జాబితా నుంచి ఆధార్ నెంబర్‌ను తొలగించేసింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా తమ డేటాబేస్‌లో నమోదు చేసే మొబైల్ సబ్‌స్క్రైబర్ల 29 పారామీటర్ లిస్ట్ నుంచి ఆధార్ నెంబర్‌ను తొలగిస్తున్నట్టు డీఓటీ పేర్కొంది. దీంతో వర్చ్యువల్ ఐడీ వాడకానికి మార్గం సుగమం అయింది. కొత్త సిమ్ కొనుగోలు చేసేటప్పుడు లేదా పాత దాన్ని పునఃసమీక్షించేటప్పుడు ఈ-కేవైసీ ప్రక్రియలో ఆధార్ నెంబర్‌కు ప్రత్యామ్నాయంగా ఇక నుంచి ఈ వర్చ్యువల్ ఐడీని ఉపయోగించుకోవచ్చు. ధృవీకరణ సమయంలో ఆధార్ నెంబర్ హోల్డర్ భద్రతను, గోప్యతను మరింత బలోపేతం చేసేందుకు, ఆధార్ ఎకోసిస్టమ్‌లో యూఐడీఏఐ కొన్ని మార్పులను ప్రతిపాదించినట్టు డీఓటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ సర్క్యూలర్‌ను జారీచేసింది. వర్చ్యువల్ ఐడీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం, కొత్త సిస్టమ్‌లోకి తరలి వెళ్లడం వంటి వాటిని టెలికాం ఆపరేటర్లు అమలు చేయాలని డీఓటీ ఆదేశించింది.
ఏప్రిల్‌లోనే యూఐడీఏఐ 16 అంకెల వర్చ్యువల్ ఐడీ సౌకర్యాన్ని లాంచ్ చేసింది. ఈ వర్చ్యువల్ ఐడీని, 12 అంకెల ఆధార్ నెంబర్‌కు బదులుగా ధృవీకరణ కోసం వాడుకోవచ్చు. కొత్త మొబైల్ సిమ్ కొనుగోలు చేసేందుకు, పాత నెంబర్‌ను సమీక్షించుకునేందుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని అంతకముందు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ లింకేజీని తప్పనిసరి చేయాలా? లేదా? అనే విషయంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రైవేట్, పబ్లిక్ సర్వీసులకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తే, వ్యక్తుల గోప్యత హక్కులను కాల రాసినట్టే అవుతుందని పిటిషన్‌దారులు చెబుతున్నారు. ఆధార్ విషయంలో తమ తుది తీర్పు వచ్చే వరకు ఆధార్ నెంబర్‌ను మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా ఏ సర్వీసులకు తప్పనిసరిగా లింక్ చేయాల్సినవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment