న్యూఢిల్లీ: వచ్చే ఏడాది(2022) ఏప్రిల్-మే మధ్య 5జీ స్పెక్ట్రమ్ వేలం జరిగే అవకాశం ఉన్నట్లు కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్నావ్ గురువారం తెలిపారు. టెలికాం ఆపరేటర్ల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన చర్యలు మొదటి సంస్కరణలుగా చెప్పారు. "రాబోయే 2-3 సంవత్సరాలలో టెలికామ్ నియంత్రణ వ్యవస్థ మారాలి" అని వైష్ణవ్ తెలిపారు. ఒక మీడియా కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ టెలికామ్ సెక్టార్ రెగ్యులేషన్‌ను ప్రపంచ ఉత్తమంగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. "కాబట్టి, ఇక మేము టెలికామ్ పరంగా వరుస సంస్కరణలతో వస్తాము" అని అన్నారు.
5జీ వేలం కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సంప్రదింపులు జరుపుతోందని మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. "ఫిబ్రవరి మధ్య నాటికి వారు తమ నివేదికను సమర్పిస్తారని నేను అనుకుంటున్నాను. బహుశా ఫిబ్రవరి చివరి వరకు/గరిష్టంగా మార్చి వరకు. ఆ వెంటనే మేము వేలం వేస్తాం" అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5జీ వేలం నిర్వహించాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటి) ఇంతకు ముందు ఆశాభావం వ్యక్తం చేయడంతో ఈ మాటలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాబోయే 5జీ వేలం నిర్దిష్ట కాలవ్యవధిని పేర్కొనడం ఈ దశలో కష్టమవుతుంది. ఎందుకంటే ట్రాయ్ తన అభిప్రాయాలను ఖరారు చేసే పట్టే సమయంపై చాలా ఆధారపడి ఉంటుంది అని మంత్రి తెలిపారు.
(చదవండి: యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే!)
"కానీ, మా అంచనా ప్రకారం ఏప్రిల్-మేలో వేలం వేయవచ్చు. నేను ఇంతకు ముందు మార్చి ఆని అంచనా వేశాను. కానీ, సమయం పడుతుందని నేను అనుకుంటున్నాను.. సంప్రదింపులు ప్రక్రియ సంక్లిష్టమైనవి కాబట్టి, విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. వచ్చే ఏడాది 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి గ్రౌండ్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నందున, బహుళ బ్యాండ్‌లలోని రేడియోవేవ్‌లకు సంబంధించిన ధర, క్వాంటం, ఇతర విధానాలపై సిఫార్సులను కోరుతూ డీఓటి ట్రాయ్‌ని సంప్రదించిందన్నారు. వీటిలో 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2300 మెగాహెర్ట్జ్, 2500 మెగాహెర్ట్జ్ లతో పాటు 3,300-3,600 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లు(అవి గత వేలంలో లేవు) ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన చివరి రౌండ్ స్పెక్ట్రమ్ వేలంలో 855.6 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు ₹77,800 కోట్లకు పైగా బిడ్‌లు వచ్చాయి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment